మన్యంలో చలిపులి
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:25 AM
పార్వతీపురం మన్యం జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న మొన్నటి వర కు వర్షాకాలంలో కూడా ఎండ తీవ్రత 40 డిగ్రీల వరకు కొనసాగింది.
- 17 డిగ్రీలకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
పాలకొండ, నవంబరు 23 (ఆంధ్ర జ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న మొన్నటి వర కు వర్షాకాలంలో కూడా ఎండ తీవ్రత 40 డిగ్రీల వరకు కొనసాగింది. గత నాలుగు రోజులుగా జిల్లాలోని అన్ని మండలల్లో ఉష్ణో గ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. పగటి ఉష్ణో గ్రతలు గడిచిన నాలుగు రోజుల్లో గరిష్టంగా 30 డిగ్రీ ల వరకు ఉండగా... కనిష్టం 17 డిగ్రీలకు పడిపోయింది. వీటితో పాటు చలిగాలులు పెరగడంతో అన్ని వయసలు వారూ ఇబ్బంది పడుతున్నారు. సీతంపేట, భామిని, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, పాచిపెంట తదితర మండలాల్లో రాత్రి వేళల్లో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు తెలుస్తోంది. దీనితో సాయంత్రం ఐదు నుంచి ఉదయం 8 గంటల వరకు బయటకు వచ్చేందు కు జంకుతున్నారు. తెల్లవారుజామున రెండు, మూడు నుంచి ఉదయం ఏడు గంటల వర కు మన్యం జిల్లా అంతటా మంచు దుప్పటి కమ్ముకుంటోంది. ఆ సమయంలో రహదా రులపై వాహనాల హెడ్‌లైట్లు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు. నవంబరు నెలలోనే చలి తీవ్రత ఇలా ఉంటే డిసెంబరు, జనవరిలో ఏ స్థాయిలో ఉంటుం దోనని బెంగ పెట్టు కుంటున్నారు.
ఆస్తమా బాధితులు జాగ్రత్త
ఆస్తమా, న్యూమోనియా, సీవోపీడీ, గుండె వ్యాధులతో బాధపడే వారికి చలికాం కష్టమేనని వైద్యులు అంటున్నారు. చల్లటి ప్రదేశంలో తిరిగినా... చల్లటి ఆహారం తీసుకున్నా... ఏసీ గదుల్లో ఉన్నా ఆస్తమా సమస్య పెరుగుతుంది. చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తే ఆస్తమా, న్యూమోనియా రోగులకు మరంత అసౌకర్యంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆస్తమా, న్యూమోనియాతో బాధ పడేవారు మందులు వాడకపోతే సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వేడినీరు తాగాలి...
శాశ్వత, చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఉన్నవారు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. నీరు వేడి చేసి వడబోసుకొని తాగాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు తీసుకోవద్దు, గొంతునొప్పి ఉన్నవారు ప్రతిరోజూ రెండుసార్లు వేడిచేసిన నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించాలని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధుల ముప్పు
చల్లటి వాతావరణంతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఆయాసం, స్వైన్‌ప్లూ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఆస్తమా, అలర్జీ, న్యూమోనియా తదితర వ్యాధుల ముప్పు పొంచి ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ త్వరగా దాడి చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులతో చల్లటి గాలులలకు శరీరం తెల్లగా పొడిబారినట్టు మారిపోతుంది. పెదవులు పగిలిపోయి ముఖం కాంతిహీనంగా మారుతుంది. అరికాళ్లు పగుళ్లు ఏర్పడతాయి. శరీరంతో తేమశాతం తగ్గడంతో చర్మ రక్షణ శక్తి తగ్గి దురదలు వస్తాయంటున్నారు. చేతులపై పగుళ్ల మాదిరిగా తెల్లటి గీతలు వస్తాయంటున్నారు. ఈ తరహా సమస్యలు మధుమేహ రోగులకు వస్తే ఇబ్బందులు ఉంటాయన్నారు. వాతావరణంలో మార్పులతో దగ్గు, ఆయాసం, గాలి పీల్చుకోవడం వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
గుండె జబ్బు బాధితులు అప్రమత్తం
గుండెజబ్బులు ఉన్నవారు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్స్, కొలెస్ర్టాల్ ఉన్న వారిలో రక్తనాళాల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల గుండె వైఫల్యం చెందే ముప్పు ఉంటుంది. చలి ఎక్కువగా ఉంటే వాకింగ్ చేయవద్దు. అధిక బరువు, ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారు వాకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చలికాలంలో పొగ, మద్యపానా నికి తాగొద్దు. మధుమేహ రోగులు చల్లటి ప్రదేశంలో పడుకోవద్దు. పొగమంచు బారిన పడకుండా మాస్క్‌లు ధరించాలి. గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. చలిగాలి ఉన్న సమయంలో వృద్ధులు బయట తిరగొద్దని వైద్యులు చెబుతున్నారు.
సాలూరు ఏజెన్సీలో మంచు దుప్పటి
సాలూరు రూరల్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సాలూరు ఏజెన్సీలో మంచు దుప్పటితో ప్రకృతి కొత్త అందాలు సంతరించుకుం టోంది. ఉదయం 9 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంటోంది. మరోవైపు చలి పెరిగింది. పచ్చని పొలాల్లో మంచుతెరలు చూపరుల కు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
Updated Date - Nov 24 , 2024 | 12:25 AM