ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక షాపు.. గుడ్‌విల్‌ రూ.కోటి

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:58 PM

జిల్లాలో మద్యం షాపుల గుడ్‌విల్‌ రూ.కోట్లకు చేరింది. లాటరీలో దుకాణం పొందలేని వారు.. తమ ప్రాంతాల్లో షాపులను దక్కించుకున్న వ్యాపారులకు భారీగా ఆఫర్‌ చేస్తున్నారు. ఎంతైనా ఇచ్చి.. షాపులకు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇతర చోట్లా ఇదే తంతు.. జోరుగా బేరసారాలు

ఎంతైనా ఇచ్చి దుకాణాలు దక్కించుకునేందుకు యత్నం

లాభం ఆధారపడేది మాత్రం బెల్ట్‌ దుకాణాలపైనే..

ఇప్పటికే ఆ దిశగా ప్రారంభమైన విక్రయాలు

పార్వతీపురం, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మద్యం షాపుల గుడ్‌విల్‌ రూ.కోట్లకు చేరింది. లాటరీలో దుకాణం పొందలేని వారు.. తమ ప్రాంతాల్లో షాపులను దక్కించుకున్న వ్యాపారులకు భారీగా ఆఫర్‌ చేస్తున్నారు. ఎంతైనా ఇచ్చి.. షాపులకు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా మక్కువ మండలంలో ఓ మద్యం షాపునకు భారీ మొత్తంలో గుడ్‌విల్‌ కింద చెల్లించడం చర్చనీయాంశమవుతోంది. పార్వతీపురానికి చెందిన ఓ సిండికేట్‌ వ్యాపారికి మక్కువ మండలంలో మద్యం షాపు దక్కింది. ఈ దుకాణాన్ని సుమారు రూ.కోటిపైనే మక్కువకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి విక్రయించారు. జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా గుడ్‌విల్‌ పేరిట సిండికేట్లు వ్యక్తిగత మద్యం షాపుల వ్యాపారులతో బేరసారాలు చేస్తున్నారు. మొత్తంగా రూ.60 లక్షల నుంచి రూ.కోటిపైన ఇచ్చేందుకు వెనుకాడడం లేదు.

ఇదీ పరిస్థితి..

నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 52 మద్యం షాపులకు లాటరీ నిర్వహించారు. టీడీపీ, వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కటై అత్యధికంగా షాపులు దక్కించుకున్నారు. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న కొంతమందికి అదృష్టవశాత్తూ లాటరీలో మద్యం షాపు దక్కింది. అయితే ఇటువంటి వారిపై సిండికేట్‌ వ్యాపారుల కన్ను పడంది. ఆ షాపులు తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించి.. సఫలీకృతులవుతున్నారు. ఈ నేపథ్యంలో గుడ్‌విల్‌ కింద రూ.60 లక్షల నుంచి రూ.కోటిపైనే ఇస్తున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు గాని, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులకు గాని జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో షాపులు నిర్వహించాలంటే రాజకీయ బలం ఎంతో అవసరమనే అభిప్రాయాన్ని స్థానిక సిండికేట్‌లు కల్పిస్తున్నారు. దీంతో తమకెందుకులే ఈ గొడవ అన్నట్టుగా భావించి.. వారు జిల్లా సిండికేట్‌ వ్యాపారులకే షాపులను విక్రయిస్తున్నారు.

- జిల్లాలో మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పాత మద్యాన్నే సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఇది క్లియరెన్స్‌ అయిన తర్వాత కొత్త మద్యం బ్రాండ్స్‌ విక్రయాలు మొదలు కానున్నాయి. నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రస్తుతం ఎంసీ, ఐబీ విస్కీ అనే రెండు బ్రాండ్స్‌ను అదనంగా విక్రయిస్తున్నారు. కాగా గత వైసీపీ పాలనలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల అండతో కొందరు ఇష్టారాజ్యంగా బెల్ట్‌లు నిర్వహించేవారు. ప్రస్తుతం జిల్లాలో కొన్నిచోట్ల పాత బెల్ట్‌షాపుల నిర్వాహకులే రహస్యంగా మద్యం విక్రయాలు చేపడుతున్నారు. దీనిపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. బెల్టు దుకాణాలకు చెక్‌పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

‘బెల్టు’ పై చూపు

- మద్యం దుకాణం ద్వారా రోజువారి సేల్స్‌ అధిక మొత్తంలో ఉంటేనే వ్యాపారులకు గిట్టుబాటు అవుతుంది. లేకుంటే నష్టాలను భరించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు వ్యాపారులు అప్పుడే తమకు కావాల్సిన దారులు వెతుక్కుంటున్నారు. ఈ మేరకు బెల్టు షాపులను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

- జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపులకు లైసెన్స్‌ ఫీజు కింద ఏడాదికి రూ.55 లక్షల నుంచి రూ,65 లక్షల వరకు చెల్లించాలి. దుకాణం నిర్వహణ తదితర వాటి కోసం రోజుకు కనీసం రూ.20 నుంచి రూ.25 వేలు ఖర్చువుతుంది. రూ.లక్ష మద్యం విక్రయిస్తే మిగిలేది రూ.18 వేల నుంచి రూ.20 వేలేనని కొంతమంది మద్యం వర్తకులు చెబుతున్నారు. ఇదే సమయంలో మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోతే నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని వారు వాపోతున్నారు. దీంతో కొంతమంది అప్పుడే అడ్డదారులను వెతుక్కుంటున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాప్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

- ఏ విధంగా అయినా మద్యం దుకాణాల ద్వారా భారీ ఆదాయాన్ని పొందాలన్న లక్ష్యంతో మద్యం వ్యాపారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని మద్యం దుకాణాల్లో అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. భవిష్యత్తులో వాటి ధరలు ఇంకెంత పెంచుతారోనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మొత్తంగా కొంతమంది మద్యం వ్యాపారులు ఎక్సైజ్‌ నిబంధనలు పాటించేలా కనిపించడం లేదు. మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకముందే ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది.

బెల్ట్‌ దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

జిల్లాలో 52 మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడా అధిక రేట్లకు మద్యం అమ్మడం లేదు. ఎవరైనా బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు.

- జీవన్‌ కిషోర్‌, ఏఈఎస్‌, పార్వతీపురం మన్యం

Updated Date - Oct 19 , 2024 | 11:58 PM