ఆదివాసీలు దేశం గర్వించేలా ఎదగాలి
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:17 AM
ఆదివాసీలు దేశం గర్వపడేలా ఎదగాలని కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండా జయంతిని ఘనంగా నిర్వహించారు.
- కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం, కలెక్టరేట్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలు దేశం గర్వపడేలా ఎదగాలని కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండా జయంతిని ఘనంగా నిర్వహించారు. బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా త్యాగాన్ని తెలుసుకుని, వారి చూపిన మార్గాన్ని అనుసరించి ఆదివాసీలు అభివృద్ధి చెందాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజనుల జీవనోపాధి పెంచడానికి, వారికి మెరుగైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో జనమన్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 11 మండలాలకు చెందిన 57 గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో కేంద్ర పథకాలపై విద్యుత్, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆరోగ్య, గిరిజన శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ తిలకించారు. గిరిజనుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం లబ్ధిదారులకు ఆయష్మాన్ భవ హెల్త్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలోని జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీవాసమూర్తి, డీఈవో మాణిక్యం నాయుడు, ఈపీడీసీఎస్ ఎస్‌ఈ లక్ష్మణరావు, రాష్ట్ర గిరిజన ఉద్యోగుల కార్యదర్శి అలుగు వెంకటరావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:17 AM