ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైవేపై ఘోరం

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:36 AM

మేనమామను తీసుకుని వచ్చేందుకు ఒకరు.. భార్యకు బ్యాంకు పరీక్ష ఉండడంతో బయల్దేరిన దంపతులు.. వీరిని కారులో తీసుకుని డ్రైవింగ్‌ చేస్తూ మరొకరు..! దాదాపు నలభై నిమిషాలు గడిచింది. రోడ్డుపై చిన్నగా పారుతున్న వర్షపునీరు అడ్డొస్తోంది. అయితే త్వరగా గమ్యం చేరాలన్న ఆత్రుత..! కారు డ్రైవరు వేగం పెంచాడు.

రైటప్‌: ఘటనా స్థలంలో నుజ్జునుజ్జయిన కారు, కారు బయటకు తుళ్లిన మృతదేహాలు

హైవేపై ఘోరం

అతివేగం.. వర్షపునీరు.. క్షణాల్లో దారుణం

టైరు పంక్చరై డివైడర్‌ను ఢీకొట్టి ఆవలివైపునకు..

ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న కారు

30 అడుగులు ఈడ్చుకుని పోయి ఆగిన లారీ

కారులోనే.. అక్కడికక్కడే నలుగురి మృతి

అందరూ శ్రీకాకుళం నగర వాసులే..

భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఘటన

మృతుల్లో దంపతులు.. వీరికి రెండేళ్ల కొడుకు

మేనమామను తీసుకుని వచ్చేందుకు ఒకరు.. భార్యకు బ్యాంకు పరీక్ష ఉండడంతో బయల్దేరిన దంపతులు.. వీరిని కారులో తీసుకుని డ్రైవింగ్‌ చేస్తూ మరొకరు..! దాదాపు నలభై నిమిషాలు గడిచింది. రోడ్డుపై చిన్నగా పారుతున్న వర్షపునీరు అడ్డొస్తోంది. అయితే త్వరగా గమ్యం చేరాలన్న ఆత్రుత..! కారు డ్రైవరు వేగం పెంచాడు. అంతే.. క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. జాతీయ రహదారి రక్తమోడింది. నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. కారు నుజ్జునుజ్జయి.. అందులోనే మృతదేహాలు ఇరుక్కుని.. భీతావహంగా కనిపించింది ఆప్రాంతం. కారు డివైడర్‌ను తాకి టైరు పంక్చరై.. డివైడర్‌పైకి ఎక్కి... జాతీయరహదారిపై అటువైపునకు పోయి.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి సమీపాన హైవేపై శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన గౌడి వెంకటరమణ కౌశిక్‌ (27), మెడి జయేశ్‌(20), వడ్డి మణిబాల(24), వడ్డి అభినవ్‌(27) దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్‌ రాజ్‌ఖాన్‌కు తీవ్రగాయాలయ్యాయి.

భోగాపురం/శ్రీకాకుళం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి):

శ్రీకాకుళం నగరానికి చెందిన లంక బావాజీనాయుడు మనవడికి డిసెంబరు 6న వివాహం జరగనుంది. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు అమెరికాలో ఉంటున్న బావాజీ నాయుడు కుమారుడు బాలాజీ శనివారం విమానంలో విశాఖపట్నం వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికి శ్రీకాకుళం తీసుకువచ్చేందుకు బాలాజీ మేనల్లుడు గౌడి కౌశిక్‌ తన ఫార్చ్యూనర్‌ కారులో డ్రైవర్‌ జయేశ్‌తో కలిసి విశాఖపట్నం బయలు దేరారు. కాగా.. కారులో విశాఖ వెళ్తున్నానని మిత్రుడు వడ్డి అభినవ్‌కు శుక్రవారమే కౌశిక్‌ చెప్పాడు. తన భార్యకు విశాఖలో బ్యాంకు పరీక్ష ఉందని.. తాము కూడా శనివారం కారులో వచ్చేస్తామని అభినవ్‌ తెలిపాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం కౌశిక్‌, వడ్డి అభినవ్‌, ఆయన సతీమణి మణిమాల విశాఖ బయలుదేరారు. గమ్యం తొందరగా చేరుకోవాలని వేగంగా వెళ్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి సమీపానికి వచ్చాక రోడ్డుపై వర్షపునీరు కారణంగా డ్రైవరు కారును అదుపు చేయలేకపోయాడు. కారు డివైడర్‌ను తాకుతూ వెళ్లడంతో టైరు పంక్చర్‌ అయింది. క్షణాల్లో డివైడర్‌ను ఢీకొట్టి విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే జాతీయ రహదారిపైకి దూసుకుపోయింది. అదే సమయంలో విశాఖ వైపు నుంచి శ్రీకాకుళం వస్తున్న లారీని ఢీకొట్టింది. కారును లారీ 30 అడుగుల దూరం మేర ఈడ్చుకుంటూ పోయింది. దీంతో కారు నుజ్జునుజ్జుఅయింది. కారు డోర్లు తెరుచుకుని ఇద్దరి శరీరాలు సగం వరకు బయటపడ్డాయి. మరో ఇద్దరు కారులోనే చిక్కుకున్నారు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే లారీ డ్రైవర్‌ రాజ్‌ఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంత సమయం ట్రాఫిక్‌ ఆగిపోయింది. విజయనగరం అడిషనల్‌ ఎస్పీ పి.సౌమ్మలత, సీఐ ఎన్వీ ప్రభాకర్‌, ఎస్‌ఐలు వి.పాపారావు, పి.సూర్యకుమారి ఘటనా స్థలానికి వచ్చారు. కారులో నుంచి మూడు మృతదేహాలను బయటికి తీశారు. అయితే కారు పైభాగాన్ని ఎక్స్‌కవేటర్‌తో తొలగించి డ్రైవర్‌ మృతదేహాన్ని బయటికి తీయాల్సి వచ్చింది. అనంతరం నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద జాతీయరహదారి రక్తమయమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎన్వీ ప్రభాకర్‌ తెలిపారు.

సీసీ కెమెరాలో

నిక్షిప్తమై..

ఘటనా స్థలం సమీపంలో పెట్రోల్‌ బంక్‌ ఉంది. ఇక్కడ సీసీ కెమెరాలు అమర్చారు. ఉదయం 8 గంటలు దాటిన తర్వాత ప్రమాదం జరిగినట్లు దృశ్యాలు ఇందులో నిక్షిప్తమయ్యాయి. కారు వేగంగా రావడం.. డివైడర్‌ను ఆనుకుని వెళ్లడం.. ఆవెంటనే డివైడర్‌ను ఆవలివైపునకు వెళ్లి లారీని ఢీకొట్టడం.. కారును లారీ దాదాపు 30 అడుగుల దూరం ఈడ్చుకుని పోవడం.. ఇవన్నీ అందులో రికార్డయ్యాయి. ఈ సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వాటిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఏడాది క్రితమే వివాహం..

గౌడి కౌశిక్‌.. శ్రీకాకుళంలోని పేర్లవారి వీధిలో బంగార ఆభరణాల వ్యాపారాన్ని తండ్రి వాసుదేవరావుతో కలసి చూసుకుంటున్నారు. కౌశిక్‌ అందరితో కలివిడిగా ఉంటూ మంచిపేరు సంపాదించుకున్నారు. ఏడాది క్రితం కౌశిక్‌కు వివాహమైంది. అత్తవారు కూడా బంగారు వర్తకులే. కౌశిక్‌ మృతి చెందిన వార్త తెలుసుకుని ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

అప్పుడు తండ్రి.. ఇప్పుడు తాను..

కారు డ్రైవర్‌ మెడి జయేశ్‌ తండ్రి చాన్నాళ్ల కిందట ఓ ప్రమాదంలో మృతి చెందారు. అప్పటినుంచి తల్లి.. నగరంలో సున్నపువీధిలో టీస్టాల్‌ నిర్వహిస్తూ జయేశ్‌ను పెంచింది. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో జయేశ్‌ కూడా మృతి చెందడంతో ఆమె రోదన వర్ణణాతీతం.

భార్య పరీక్ష కోసం తోడుగావెళ్లి..

కౌశిక్‌ మిత్రుడు అభినవ్‌. శ్రీకాకుళంలో లియో మెడికల్స్‌ ల్యాబ్‌ను తన తండ్రి వడ్డి మన్మథతోపాటు అభినవ్‌ చూసుకుంటున్నారు. భార్య మణిమాల విశాఖలో పరీక్ష రాసేందుకు వెళ్తుండటంతో స్నేహితుడి కారులో అభినవ్‌, తన భార్యతో కలిసి బయలుదేరారు. ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. అభినవ్‌కు మూడేళ్ల కిందట వివాహం అయింది. వీరికి రెండేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. దంపతులిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన ప్రమాద ఘటనకు చేరుకున్నారు.

----------

Updated Date - Dec 01 , 2024 | 12:36 AM