ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరనున్న ఇసుక కష్టాలు

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:52 PM

ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఇకనుంచి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు గెడ్డలు, వాగుల నుంచి నాటుబండ్లతో పాటు ట్రాక్టర్లతో కూడా ఇసుకను తరలించవచ్చు.

ఇసుక రీచ్‌లో ఇసుకను లోడింగ్‌ చేస్తున్న దృశ్యం

- ట్రాక్టర్లతో తరలింపునకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం

- జీఎస్టీ, సీనరేజ్‌ పన్నులు రద్దు

- రవాణా ఖర్చుతో ఇంటికి చేరనున్న ఇసుక

పార్వతీపురం/కొమరాడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఇకనుంచి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు గెడ్డలు, వాగుల నుంచి నాటుబండ్లతో పాటు ట్రాక్టర్లతో కూడా ఇసుకను తరలించవచ్చు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఇసుక రేటు ఆకాశాన్ని తాకింది. అంతేకాకుండా సమయానికి దొరకని పరిస్థితి ఉండేది. స్థానికంగా ఉన్న నదులు, గెడ్డలు, వాగుల్లో ఇసుక ఉన్నప్పటికీ తవ్వుకునే వీలు లేకుండా చేశారు. వ్యక్తిగత, సామాజిక అవసరాలకు నాటు బండ్లతో ఇసుకను తీసుకెళ్లే వారిపై పోలీసులతో కేసులు నమోదు చేయించేవారు. ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల బంధువులు మాత్రమే నాటు బండ్లతో ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించేవారు. గత ప్రభుత్వంలో ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించి రెండు చేతులా సంపాదించుకున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇసుక విధానంలో కొన్నిమార్పులు చేశారు. ప్రజలు తమ సొంత అవసరాలకు సమీప నదుల నుంచి ట్రాక్టర్‌తో ఇసుక తీసుకువెళ్లవచ్చునని, జీఎస్టీ, సీనరేజ్‌ మినహాయింపు ఉంటుందని చెప్పారు. దీంతో టన్నుకు రూ.475 వరకు వినియోగదారుడికి లబ్ధి చేకూరనుంది. అంటే రూ.5వేలకు లభించే ట్రాక్టర్‌ ఇసుక ఇకపై సగం ధరకే దొరికే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో నాగావళి, జంఝావతి, వేగావతి, వంశధార వంటి నదులతోపాటు పలు గెడ్డలు, వాగుల నుంచి ఇసుకను స్థానిక అవసరాలకు తీసుకువెళ్లవచ్చు. ఇదిలాఉండగా, నాగావళి నదిపై ఒక్క ఇసుక రీచ్‌కు మాత్రమే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఒక్క భామిని మండలంలో తప్ప మరెక్కడా రీచ్‌లు మంజూరు కాకపోవడంతో జిల్లా కేంద్రానికి ఇసుక కొరత ఉంది.


ప్రతి రోజూ సుమారు 200 టన్నుల వరకు ఇసుకను గృహ నిర్మాణాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న నదుల్లో ఇసుక రీచ్‌లను గుర్తించి అనుమతులు మంజూరు చేస్తే ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక మరంత సులభంగా వినియోగదారులకు అందే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం పల్లె పండుగ కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి ఇసుక అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం రీచ్‌లు గుర్తించి వాటి ద్వారా ఉచిత ఇసుకను అందించాల్సిన అవసరం ఉంది.


ఎంతో మంచి నిర్ణయం

సొంత అవసరాలకు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం ఎంతో మంచి నిర్ణయం. ఇది ప్రజా ప్రభుత్వ పాలన. వాస్తవంగా ఇప్పటివరకు ఇసుక కోసం కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ఎంతో ఉపయోగం కలగనుంది.

- కె.రామరాజు, పార్వతీపురం

మాకు ఎంతో ఊరట

నాకు ట్రాక్టర్‌ ఉంది. కాని జిల్లాలో ఏర్పాటు చేసిన భామిని మండలంలో ఇసుక తెచ్చుకొనే పరిస్థితి లేకుండా పోయింది. దానికి కారణం అంత దూరం నుంచి తీసుకొని వచ్చి వినియోగదారులకు అందించాలంటే అధిక సొమ్ము వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇసుకకు భామిని వెళ్లలేకపోయాం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దగ్గరలో ఇసుక లభ్యమయ్యే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వినియోగదారులకు అందించేందుకు వీలుంటుంది. కేవలం రవాణా చార్జీలు వారు చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల మాలాంటి వారికి ఉపాధి లభిస్తుంది.

-అప్పలనాయుడు, ట్రాక్టర్‌ యజమాని, పార్వతీపురం.

Updated Date - Oct 23 , 2024 | 11:52 PM