ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రదక్షిణలే.. పరిష్కారాలేవి?

ABN, Publish Date - Nov 18 , 2024 | 11:43 PM

ఎంతో ప్రయాస పడి.. ఎన్నో ఇబ్బందులకు ఓర్చి.. నిరీక్షించి కలెక్టరేట్‌కు వచ్చి ఇచ్చే విన్నపాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఒక సమస్యతో వచ్చిన వారే పదేపదే తిరిగి వస్తూ విన్నవించుకుంటున్నారు.

పి.పైడిరాజు, అర్జీదారుడు

ప్రదక్షిణలే.. పరిష్కారాలేవి?

క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోని వినతులు

అత్యధికంగా పెండింగులో

రేషన్‌ కార్డులు, ఇళ్లు, పెన్షన్‌లపైనే ఎక్కువ విన్నపాలు

భూ సమస్యలు ఎక్కడివక్కడే

కలెక్టరేట్‌ అర్జీదారులకూ తప్పని అవస్థలు

ఎంతో ప్రయాస పడి.. ఎన్నో ఇబ్బందులకు ఓర్చి.. నిరీక్షించి కలెక్టరేట్‌కు వచ్చి ఇచ్చే విన్నపాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఒక సమస్యతో వచ్చిన వారే పదేపదే తిరిగి వస్తూ విన్నవించుకుంటున్నారు. వినతిపత్రాలు తీసుకునే సమయంలో అధికారులు హామీలైతే ఇస్తున్నారు. సంబంధిత మండల అధికారులకు పంపుతున్నారు. అక్కడితే ఆ వినతిపత్రం ఆగిపోతోంది. సమస్య అలాగే ఉండిపోతోంది. ఇదిలా ఉండగా కలెక్టరేట్‌కు వచ్చే విన్నపాల్లో అత్యధికంగా రేషన్‌కార్డులు, ఇళ్లు, పెన్షన్‌లు, భూ సమస్యలవే ఎక్కువ. ఎన్నాళ్లయినా కష్టం తీరడం లేదని అర్జీదారులు వాపోతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లోనూ ఇదే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారు.

విజయనగరం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి)/రూరల్‌, కలెక్టరేట్‌, రింగురోడ్డు, టౌన్‌, దాసన్నపేట:

ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు అందిస్తున్న వినతులు పేపర్లకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయికి వచ్చేసరికి పరిష్కారం కాకపోవడంతో అర్జీదారులు అనేకసార్లు విన్నవించుకుంటున్నారు. అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలపై వినతులు వస్తున్నాయి. అధికారులకు అందిన వినతుల్లో 80 శాతం భూ సమస్యలవే. గత ప్రభుత్వ హయంలో గ్రీవెన్స్‌, స్పందన, జగనన్నకు చెబుదాం వంటి పేర్లతో ప్రజల నుంచి వినతులు స్వీకరించేవారు. వాటిని మొక్కుబడిగా పరిశీలించి 90శాతం(రీడ్రస్‌) పరిష్కారం చేసినట్లు అధికారులు కాగితాలపై చూపించేవారు. ఆర్థిక పరమైన సమస్యలు, ప్రభుత్వపరమైన విధానాలపై పరిష్కారం జిల్లా, మండల స్థాయి అధికారుల చేతిలో ఉండదు. ఆర్థికేతర సమస్యలను మాత్రం పరిష్కరించగలరు. అయినా దృష్టి పెట్టలేదు. దీంతో అర్జీదారులు పదేపదే కలెక్టరేట్‌ చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ అదే ఒరవడి కొనసాగుతోంది. ప్రజల నుంచి వచ్చిన వినతులను మండల, జిల్లా స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎం, కాల్‌ సెంటర్‌ తదితర మార్గాల్లో వినతులు స్వీకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 4024 వినతులు వచ్చాయి. వీటిల్లో 90శాతం వినతులు పరిష్కారం చేసినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. బాధితులు మాత్రం ప్రతివారం కోకొల్లలుగా వస్తున్నారు.

- ఇళ్లు, ఇంటి రుణాలు, రేషన్‌కార్డులు, సామాజిక పెన్షన్‌ (విభిన్న, వృద్ధాప్య, వితంతు, ఒంటరి) కోసం ఎక్కువ వినతులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి. మరోవైపు భూ తగాదాలూ తగ్గడం లేదు. వచ్చిన వినతులను జిల్లా అధికార యంత్రాంగం ఆయా విభాగాలకు పంపుతోంది. వాటిలో 20 శాతం వరకూ ఎటువంటి స్పందన ఉండడం లేదు.

ఆరు పర్యాయాలు వచ్చాను

పి.పైడిరాజు, స్టేడియం కాలనీ, విజయనగరం

విద్యాశాఖ పరిధిలో బాధ్యతలు నిర్వహించాను.. నా సర్వీసు రికార్డులో సమస్య ఉంది. ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు సర్వీసు రికార్డుకు సంబంధించిన సమస్యను పరిష్కరించడం లేదు.. ఆయన వద్దకు తిరిగి, తిరిగి.. చివరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చాను.. ఏడాదిలో ఆరు పర్యాయాలు వచ్చాను. ఉన్నతాధికారులు చొరవ చూపితే తప్ప పరిష్కారం కాదు.

పీఎం కిసాన్‌ నిధులు పడలేదు

గౌరీ శంకర్‌, ఎం కొత్తవలస, బొండపల్లి

నేను రెండు పర్యాయాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చాను.. విభిన్న ప్రతిభావంతుడిని కావడంతో ఇబ్బందికరంగా ఉంది. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి వస్తున్నా. పీఎం కిసాన్‌ నిధులకు సంబంధించి ఉన్నతాధికారులు చొరవ చూపితే తప్ప నా సమస్య పరిష్కారం కాదు.

మా భూమిని ఇప్పించండి

మజ్జి సన్యాసిరావు, దాసన్నపేట, కాపువీధి, విజయనగరం

నగరంలోని విజ్జీస్టేడియానికి ఆనుకుని ఉన్న భూమిలో రెవెన్యూ వారి నుంచి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేశారు. ఆ స్థలం ప్రస్తుతం నా ఆధీనంలో ఉంది. రెవెన్యూ అధికారులు నా భూమిలోకి వచ్చి ప్రహరీ నిర్మించారు. అధికారులకు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా స్పందన లేదు.

ఇళ్లు వదిలి ఎక్కడికి వెళ్లాలి

టెక్కలి సూరిబాబు, నెల్లిమర్ల

నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధిలో నివశిస్తున్నా. డైట్‌ కళాశాల దగ్గరలో 2 సెంట్ల ప్రభుత్వ భూమిలో గత 25 ఏళ్లనుంచి షెడ్‌ వేసుకుని ఉన్నాం. ఈమధ్య ఎవరో వ్యక్తి వచ్చి ఆ స్థలం తనది అని, మా ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలి.. నా ఆరోగ్యం కూడా బాగాలేదు... నా కాళ్లకు రెండు వేళ్లు కూడా తీసేయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. నా స్థలాన్ని నాకు మంజూరు చేయండి

ఇళ్లు ఇచ్చారు... విద్యుత్‌ మీటర్‌ ఇవ్వనంటున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న పూజారి చిన్నమ్మలు, యశోద కృష్ణలది పూసపాటిరేగ మండలం పూసపాటిరేగ గ్రామం. వీరికి గత ప్రభుత్వంలో జగనన్న ఇంటి పథకంలో ఇల్లు మంజూరు అయ్యింది. ఇంటి స్థలాన్ని ఇదే మండలం పిట్టపేట గ్రామంలో జగనన్న లేఅవుట్‌- 1లో మంజూరు చేశారు. రూ.15 లక్షల వరకు అప్పులు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాను. విద్యుత్‌ మీటర్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ శాఖ అధికారులు హైటెన్సన్‌ విద్యుత్‌ లైన్‌ ఇళ్ల పైనుంచి వెలుతోందని, విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేయడం కుదరదని చెబుతున్నారని సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఫిర్యాదు అనంతరం వారు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద గోడు వినిపించారు. మాతోపాటు మరో 15 మంది వరకు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

పార్కును అందుబాటులోకి తీసుకురావాలి

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తులు విజయనగరం నగరపాలక సంస్థ పరిధి ఉడాకాలనీకి చెందినవారు. ఉడాకాలనీ ఫేజ్‌- 2లో సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మున్సిపల్‌ పార్కులో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పార్కుకు ప్రహరీ లేక పశువులు, కుక్కల బెడద ఎక్కువ అయిందని విన్నవించారు. పార్కులోని పరికరాలు విరిగిపోయాయని, వాటిని తొలగించి, కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - Nov 18 , 2024 | 11:43 PM