వారినీ వదలరా?
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:00 AM
బొబ్బిలి పట్టణంలో ఫ్లైఓవర్ సమీపంలో 1999-2000 సంవత్సరంలో మాజీ సైనికుల కోసం ఏర్పాటు చేసిన బోస్‌నగర్ (మిలటరీ కాలనీ)లో ఖాళీస్థలాలపై కొందరు వ్యక్తులు కన్నేశారు. గుట్టుగా ఆక్రమణలకు తెగబడుతున్నారు.
వారినీ వదలరా?
మాజీ సైనికోద్యోగుల స్థలాలపై కన్ను
అడ్డుఅదుపూలేని ఆక్రమణలు
గత ప్రభుత్వంలో నేతల దన్నుతో యవ్వారం
అర్హులకు దక్కని ఇళ్ల స్థలాలు
బొబ్బిలి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి పట్టణంలో ఫ్లైఓవర్ సమీపంలో 1999-2000 సంవత్సరంలో మాజీ సైనికుల కోసం ఏర్పాటు చేసిన బోస్‌నగర్ (మిలటరీ కాలనీ)లో ఖాళీస్థలాలపై కొందరు వ్యక్తులు కన్నేశారు. గుట్టుగా ఆక్రమణలకు తెగబడుతున్నారు. ఇప్పటికే నేతల దన్నుతో కొన్నింటిని కబ్జా చేశారు. వాస్తవానికి మల్లమ్మపేట రెవెన్యూలో సర్వే నెంబరు 237/3 లో 91 ఇళ్ల స్థలాలతో లేవుట్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో 60 మంది మాజీ సైనికులకు స్థలాలు కేటాయించారు. మరో 38 మందికి ప్రతిపాదించారు. అయితే స్థానికంగా ఉన్న మాజీ సైనికోద్యోగ కుటుంబీకులకు కాకుండా బయట ప్రాంతాల వారికి, మాజీ సైనికులు కాని వారికి గత ప్రభుత్వ హయాంలో అడ్డుగోలుగా ఇళ్లస్థలాలను కేటాయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతల దన్నుతో కొందరు వ్యక్తులు ఆ స్థలాలపై కన్నేశారు. కాగా రక్షణదళాల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాక స్ధానికంగా 20 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న వారు ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికి, స్థానికేతరులకు స్థలాలు కేటాయించినట్లు మాజీ సైనికోద్యోగులు చెబుతున్నారు. ఆ లేఅవుట్‌లో పార్కు, సామాజిక భవనం కోసం కేటాయించిన స్థలాలను సైతం అక్రమార్కులు తన్నుకుపోయారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వారి పని సులభతరమైంది. ఇందులో కొంతమంది అధికారులు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలను గుర్తించి ఎన్నో ఏళ్ల నుంచి ఇళ్లస్ధలాల కోసం దరఖాస్తులు చేస్తున్న మాజీ సైనికోద్యోగులకు వాటిని కేటాయించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
ఇది చాలా అన్యాయం
రేవళ్ల కిరణ్‌కుమార్, మాజీ సైనికోద్యోగులసంఘం అధ్యక్షుడు
మిలటరీ కాలనీలో ఇళ్ల స్థలాల బాగోతంపై సమగ్ర దర్యాప్తు జరపాలి. ఇక్కడ వారికి కాకుండా, ఎవరెవరికో స్థలాలను అక్రమంగా కేటాయించారు. ఇది చాలా అన్యాయం. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలను సైతం కబ్జా చేసేశారు. న్యాయంగా అర్హులైన వారికి స్థలాలు కేటాయించాలి.
దర్యాప్తు చేపట్టాం
మలపురెడ్డి శ్రీను, తహసీల్దారు, బొబ్బిలి
మిలటరీ కాలనీలో ఆక్రమణలు జరిగినట్లు సమాచారం రాగానే సర్వే సిబ్బందిని పంపించాను. కబ్జా స్థలాల్లో ఉన్న కర్రలన్నింటినీ తొలగించాం. నా హయంలో ఎవరికీ ఎటువంటి పట్టాలు మంజూరు చేయలేదు. అక్రమంగా ఎవరికైనా పట్టాలు ఇచ్చారా? లేదా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. కబ్జాలు జరిగితే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదు.
Updated Date - Nov 15 , 2024 | 12:00 AM