ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాగునీటి సంఘాలకు ఎన్నికలు

ABN, Publish Date - Oct 21 , 2024 | 11:50 PM

జిల్లాలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించ నున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చేనెల 21 నుంచి 29 వరకు వివిధ దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ప్రక్రియ ప్రారంభించిన అధికారులు

తొమ్మిదేళ్ల అనంతరం నిర్వహణ

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

పార్వతీపురం, అక్టోబరు21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించ నున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చేనెల 21 నుంచి 29 వరకు వివిధ దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలకు సన్నద్ధమవుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాగునీటి సంఘాలకు పూర్వ వైభవం రానుందని వారు భావిస్తున్నారు. జిల్లా పరిధిలో వీఆర్‌ఎస్‌, పెద్దగెడ్డ, పెదంకలం, ఒట్టిగెడ్డ రిజర్వాయర్ల పరిధిలో 25 నీటి సంఘాలకు, తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో 22, 15 మండలాల పరిధిలో ఉన్న చెరువులకు సంబంధించి 166 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలైంది. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాం (2015)లో ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. వీటి కాల పరిమితి 2020తో ముగిసింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో సాగునీటి వనరుల అభివృద్ధి నిర్వహణ అటకెక్కింది. అప్పట్లో నీరు-చెట్టు, ఇతర నిధులతో సాగునీటి వనరుల అభివృద్ధిని నీటి సంఘాల ఆధ్వర్యంలో రైతులే నిర్వహించుకునేవారు. నీటి సరఫరా పరిస్థితి, ఆయకట్టు పరిధిలో ఏ సమస్య వచ్చినా వారే చూసుకునే వారు. అయితే వైసీపీ ప్రభుత్వ వైఖరితో సాగునీటి వనరుల నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ షెడ్యూల్‌ ..

ఈ నెల 22 నుంచి 31లోగా సాగునీటి సంఘాల పరిధిలో ఓటర్ల వివరాలన్నీ సేకరిస్తారు. 31న ఆయా సంఘాల పరిధిలో ఓటర్ల జాబితాను బహిరంగంగా ప్రదర్శిస్తారు. మేజర్‌, మీడియం సాగునీటి చెరువుల వారీగా వేర్వేరు తేదీల్లో ఈ జాబితా ప్రదర్శన ఉంటుంది. వచ్చేనెల 21న నీటి వినియోగదారుల సంఘాల సభ్యుల ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. 24న డిస్ర్టిబ్యూటరీ కెనాల్‌ పరిధిలో, 27న ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఎన్నికల ప్రక్రియ ఇలా...

మైనర్‌ నీటి సంఘాలలో ఆరుగురు సభ్యులను ఎన్నుకుంటారు. వారిలో ఒకరు అధ్యక్షుడిగా, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఉంటారు. మీడియం, మేజర్‌ నీటి సంఘాల్లో 12 మంది సభ్యులను ఎన్నుకుంటారు. వారిలో ఒకరు అధ్యక్షుడిగా, మరొకరు కార్యదర్శిగా ఉంటారు. సాగునీటి సంఘాల్లో ఓటర్లు (రైతులు) చేతులు పైకెత్తి ఆమోదం తెలపడం ద్వారా సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ విధానంపై ఎక్కడైనా అభ్యంతరాలు ఉంటే చీటీలపై పేర్లు రాసి ఇవ్వాలని ఎన్నికలు నిర్వహించే అధికారులు కోరుతారు.

ప్రారంభమైన ప్రక్రియ

జిల్లాలో నాలుగు మీడియం, ఒక మేజర్‌ ప్రాజెక్టుతో పాటు చెరువుల పరిధిలో సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేశాం. నిబంధనలు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తాం.

- అప్పలనాయుడు, జిల్లా జల వనరులశాఖ అధికారి

==================================

1560 ప్రాదేశిక ప్రాంతాలుగా విభజన

జిల్లాలో 213 నీటి సంఘాలు ఉండగా.. 1560 ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించాం. వచ్చేనెల 21 నుంచి 29వ తేదీ వరకు వివిధ దశల్లో ఎన్నికలు నిర్వహిస్తాం.

- శ్యామ్‌ప్రసాద్‌, కలెక్టర్‌, పార్వతీపురం మన్యం

Updated Date - Oct 21 , 2024 | 11:50 PM