మూడేళ్లయినా.. అవే కష్టాలు
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:14 PM
గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఏర్పాటు చేసిన పార్వతీపురం మన్యం జిల్లాలో నేటికీ పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వసతి సమస్య వెంటాడుతుండగా.. కీలక శాఖలకు ఇన్‌చార్జి అధికారులే దిక్కుగా మారారు.
వైసీపీ ప్రభుత్వ నిర్వాకం.. ప్రజలకు శాపం
ప్రజాప్రాయం, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా పునర్విభజన
అభివృద్ధి, మౌలిక వసతులను విస్మరించిన వైనం
కీలక శాఖలకు ఇన్‌చార్జిలే దిక్కు..
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు
పార్వతీపురం, డిసెంబరు2 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఏర్పాటు చేసిన పార్వతీపురం మన్యం జిల్లాలో నేటికీ పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వసతి సమస్య వెంటాడుతుండగా.. కీలక శాఖలకు ఇన్‌చార్జి అధికారులే దిక్కుగా మారారు. నియామకమైన అధికారులు బదిలీలపై వెళ్లిపోవడం, కొత్తవారు ఈ జిల్లాకు రావడం లేదు. దీంతో జిల్లావాసులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. నాడు ప్రజల అభిప్రాయాలు, భౌగోళిక పరిస్థితులను వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. జిల్లాల పునర్విభజన చేసి.. అభివృద్ధి, మౌలిక వసతులను విస్మరించింది. ప్రజలు, ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసింది. దీంతో మూడేళ్లయినా.. నూతన జిల్లావాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లా ఏర్పాటు ఇలా..
పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు, వాటి పరిధిలో ఉన్న 15 మండలాలతో గత ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. కేవలం నాలుగు నియోజకవర్గాలతో ఏర్పాటు చేసిన నూతన జిల్లాలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై గత వైసీపీ సర్కారు దృష్టి సారించలేదు. జిల్లా పరిధిలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలున్నాయి. కానీ గత ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించక నిర్వీర్యం చేసింది.
మండలాల పరిస్థితి ఇదీ..
- సాలూరు నియోజకవర్గంలో ఉన్న మెంటాడ మండలాన్ని తొలుత పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించినా.. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడితో విజయనగరం జిల్లాలో చేర్చారు. దీంతో మెంటాడ మండలం సాలూరు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ.. మన్యం జిల్లాతో ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిధిలోనే ఆ మండలం ఉంది.
- పాలకొండ నియోజకవర్గంలో భామిని, సీతంపేట, పాలకొండ మండలాల ప్రజలు జిల్లా కేంద్రం పార్వతీపురానికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూరాభారంతో పాటు వ్యయ ప్రయాసాలకు గురవ్వాల్సి వస్తోంది. ఆయా ప్రాంత ప్రజలు వారి సమస్యలపై జిల్లా కేంద్రానికి రాలేని పరిస్థితి ఏర్పడింది.
- పాలకొండ డివిజన్ పరిధిలో ఉన్న గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస మండలాల పరిధిలో ఉన్న ప్రజలు డివిజన్ కేంద్రం పాలకొండ వెళ్లాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. గతంలో పార్వతీపురం డివిజన్‌లో ఉన్న ఈ మండలాలు నూతన జిల్లా ఏర్పడిన తర్వాత పాలకొండ డివిజన్‌లో కలిపారు. వారంతా పాలకొండ డివిజన్‌కు వెళ్లాలంటే రూ.300 వరకు వెచ్చించాల్సి వస్తోంది.
పూర్తిస్థాయి అధికారులేరీ?
- పంచాయతీరాజ్ , హౌసింగ్, రోడ్లు భవనాల శాఖ, గిరిజన విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా తదితర కీలక పోస్టులకు పూర్తిస్థాయి అధికారులు లేరు. జిల్లా ఏర్పడి నుంచి నేటి వరకు ఇన్‌చార్జి అధికారులే ఆయా శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో అధికారి రెండు, మూడు శాఖలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు.
- పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారులు లేరు. పార్వతీపురం ఐటీడీఏకు పార్వతీపురం సబ్‌కలెక్టర్, సీతంపేట ఐటీడీఏకు పాలకొండ సబ్ కలెక్టర్ ఇన్‌చార్జి పీవోలుగా వ్యవహరిస్తున్నారు.
- మలేరియాశాఖ, డీఆర్‌డీఏ వంటి శాఖలకు సంబంధించి పోస్టులను భర్తీ చేయలేదు.
- ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులే ఆ ఖర్చులను భరించాల్సి వచ్చేది.
- జిల్లాకు శాశ్వత డిస్ర్టిక్ట్ సెలక్షన్ కమిటీ నేటికీ ఏర్పాటు చేయలేదు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ, డీఆర్‌డీఏ తదితర శాఖలకు సంబంధించి పోస్టుల భర్తీ, ఆర్థికపరమైన నిర్ణయాలు పాత జిల్లా పరిధిలోనే జరుగుతున్నాయి.
భవనాల పరిస్థితి ఇదీ..
- ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తున్న భవనం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ కోసం నిర్మించింది. కలెక్టరేట్ మినహా అత్యధిక ప్రభుత్వ శాఖలకు సొంత భవనాలు లేవు. నేటికీ అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు కూడా కొరవడ్డాయి. కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- కలెక్టరేట్ కొత్త భవనం కోసం స్థల సేకరణ పూర్తికాలేదు. అసలు కలెక్టర్ కార్యాలయం నిర్మాణం జరుగుతుందా లేదా అన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.
- ఎస్పీ కార్యాలయానికి సొంత భవనం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన యువత కోసం నిర్మించిన వైటీసీ భవనంలో ఎస్పీ కార్యాలయం నిర్వహిస్తున్నారు.
- పార్వతీపురంలోని ఆర్‌సీఎం పాఠశాల భవనాల సముదాయంలోనే నేటికీ అత్యధిక ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు.
భారీగా అద్దెలు...
జిల్లాకేంద్రం పార్వతీపురంలో ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యులతో పాటు చిరుద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో కొందరు రోజూ తమ సొంత ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు గ్రూపుగా ఏర్పడి చిన్న చిన్న ఇళ్లను అద్దెలకు తీసుకుంటున్నారు.
అతిఽథిగృహం ఎక్కడ?
ఐటీడీఏతో పాటు అటవీ శాఖ గెస్ట్ హౌస్‌ల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తుండడం వల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అతిథి గృహం లేదు. దీంతో జిల్లాకు మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వచ్చే సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. వారు రాత్రి బస చేయాలన్నా, విశ్రాంతి తీసుకోవాలన్నా ప్రైవేట్ లాడ్జీల్లోనే ఉండాల్సి వస్తోంది.
ఇవీ సమస్యలు ...
జిల్లాలో గిరిజన, మైదాన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై గత వైసీపీ ప్రభుత్వం దృష్టి తాగునీటి సమస్యనూ పరిష్కరించలేదు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేస్తున్నామని ప్రకటించిన గత ప్రభుత్వం కనీసం స్థల సేకరణ కూడా చేపట్టలేదు. జిల్లాకు నిధుల కొరత వెంటాడుతుంది. వివిధ ఆసుపత్రులకు ఉమ్మడి జిల్లా విజయనగరం నుంచే మందుల సరఫరా జరుగుతుంది.
Updated Date - Dec 02 , 2024 | 11:14 PM