ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాలుగు నెలలకే వైఫల్యమా?

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:28 AM

జిల్లాలో డయేరియా మరణాలతో వైసీపీ రాజకీయ క్రీడ మొదలుపెట్టిందన్న ఆరోపణ సర్వత్రా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై ఆ పార్టీ విషపు ప్రచారానికి దిగిందని మెజారీటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

నాలుగు నెలలకే వైఫల్యమా?

కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం

‘డయేరియా’ను బాధ్యులుగా చేస్తున్న వైనం

వైసీపీ నేతల తీరుపై ముప్పేట విమర్శలు

విజయనగరం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి)

జిల్లాలో డయేరియా మరణాలతో వైసీపీ రాజకీయ క్రీడ మొదలుపెట్టిందన్న ఆరోపణ సర్వత్రా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై ఆ పార్టీ విషపు ప్రచారానికి దిగిందని మెజారీటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొద్దిరోజులుగా జిల్లాలో డయేరియా ప్రబలుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంపావతి నదీ పరివాహక గ్రామాల ప్రజలు డయేరియా బారిన పడుతుండడం మిస్టరీగా మారింది. అయితే భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. డయేరియాతో ఒకరు మాత్రమే మృతిచెందినట్టు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు 11 మరణాలు సంభవించినట్టు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విషయంలో రాద్ధాంతం చేస్తోంది. డయేరియాను రాజకీయం చేయడం తగునా? అన్న ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. అంతకు ముందు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది తామేనన్న విషయాన్ని వైసీపీ నేతలు మరచిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చంపావతి నదీ తీర గ్రామాలైన కోటగండ్రేడు, గోషాడ, పెనుబర్తి, గుర్ల తదితర గ్రామాల్లో డయేరియా కేసులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. జిల్లా మొత్తం కాకుండా కేవలం చంపావతి నదీ తీర గ్రామాలు.. అదీ గుర్ల మండలంలో వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. నది చెంతనే ఉండడంతో ఈ గ్రామాల్లో తక్కువ లోతులోనే భూగర్భ జలాలు లభిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే 15 నుంచి 20 అడుగుల లోతులోనే తాగునీటి బోర్లు వేశారు. ఆ బోర్ల నీటిని తాగిన వారే డయేరియా బారిన పడ్డారనేది వైద్యులు చెబుతున్న మాట. అయితే వ్యాధి వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యుద్ధప్రాతిపదికన గుర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటుచేసింది. తాత్కాలిక బెడ్లు తెచ్చి రోగులకు సేవలందిస్తోంది. నెల్లిమర్ల సామాజిక ఆస్పత్రితో పాటు మిమ్స్‌లో సైతం బాధితులకు ప్రత్యేక వైద్యసేవలందిస్తోంది. అయినా వైసీపీ అదే పనిగా రోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ప్రచారం చేస్తుండడాన్ని ప్రజలు కూడా విమర్శిస్తున్నారు.

యంత్రాంగం అప్రమత్తం..

డయేరియా వెలుగుచూసిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. భూగర్భ జలాలు కలుషితం కావడమే ఈ పరిస్థితికి కారణమని తెలిశాక గుర్ల మండలంలోని 15 గ్రామాల్లో తాగునీటి వనరుల వద్ద సూపర్‌ క్లోరినేషన్‌ చేపట్టారు. ట్యాంకర్ల ద్వారా రక్షిత నీరు అందిస్తున్నారు. అటు పారిశుధ్య పనులు కూడా ముమ్మరంగా చేపట్టారు. వాస్తవానికి ఐదేళ్లుగా నీటి పరీక్షలు సక్రమంగా జరగలేదు. గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కేంద్రం అందించిన ఆర్థిక సంఘం నిధులను సైతం పక్కదారి పట్టించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించలేదు. ఈ కారణాలతోనే ప్రస్తుతం పరిస్థితులు గాడితప్పాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

కొవిడ్‌ మరణాలను దాచిన వైసీపీ సర్కారు

వైసీపీ హయాంలో కొవిడ్‌ విలయతాండవం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సరైన వైద్యసేవలందక వందలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కానీ నాటి వైసీపీ ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. వందల మంది చనిపోతే పదుల సంఖ్యలో లెక్క చూపారు. ఆ సమయంలో కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించిన నెల్లిమర్ల మిమ్స్‌తో పాటు జిల్లా కేంద్రాస్పత్రిలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించలేకపోయింది. వైద్యలకు కిట్లు, శానిటైజర్‌ అందించకపోవడంతో వైద్యారోగ్య శాఖ సిబ్బంది చాలా ఇబ్బందిపడ్డారు. చివరకు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టే కార్మికులకు సైతం రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు డయేరియా వెలుగుచూడడంతో దానిని రాజకీయాంశంగా మార్చి ప్రయోజనాలు పొందాలని భావించడం దారుణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నేనొస్తా.. మీరెవరొస్తారో చెప్పండి

ప్రజారోగ్యంపై చర్చకు సిద్ధం

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం రూరల్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజారోగ్య పరిస్థితులపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వైసీపీ నుంచి ఎవరొస్తారో? ముందుకు రావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. టీడీపీ కార్యాలయంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునతో కలిసి ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకూ వైద్య ఆరోగ్యశాఖలో చాలా మంది ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి లేదని, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలకు నాడు నరకం చూపించారని, వందలాది కోట్ల రూపాయల బకాయిలు ఉంచేశారని చెప్పారు. గత ప్రభుత్వంలోని బకాయిలను వైసీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వ బకాయిలుగా పేర్కొనడం ద్వారా ప్రజలను తప్పుతోవ పట్టించడం దారుణమని, దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. గుర్లలో డయేరియాపై రాజకీయం చేస్తున్నారని, ప్రతిపక్ష నేతలకు ఆరోపించడానికి ఇంకా ఏమి దొరకలేదా? అని ప్రశ్నించారు. డయేరియాతో ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కేజీహె చ్‌లో మరణించారని, మిగతా ఏడుగురివి సహజమరణాలని అన్నారు. ఆ ప్రాంతంలో ఏ కారణంతో చనిపోయినా ప్రతిపక్ష వైసీపీ డయేరియాతో మరణిస్తున్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. డయేరియాకి సంబంధించిన సమాచారం అందగానే వైద్య బృందం అప్రమత్తం అయ్యిందన్నారు. ప్రస్తుతం గుర్ల ప్రాంతంలో డయేరియా అదుపులో ఉందని, ప్రతిపక్షంగా వైసీపీ అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి నేతల వరకు వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, గంటా పోలినాయుడు, నడిపిల్లి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లాకు పవన్‌కల్యాణ్‌ రాక

గుర్లలో డయేరియా బాధితులను పరామర్శించనున్న ఉప ముఖ్యమంత్రి

విజయనగరం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి)/దాసన్నపేట: ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్‌కల్యాణ్‌ సోమవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డుమార్గంలో బయలుదేరి నెల్లిమర్ల రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ పేట సోర్సు వద్దకు చేరుకుంటారు. అక్కడ తనిఖీ అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శిస్తారు. 11.30 గంటలకు గుర్ల గ్రామానికి చేరుకుని జలజీవన్‌ మిషన్‌ పనులను, గ్రామంలో పారిశుధ్య పరిస్థితులు, తాగునీటి సరఫరా తీరును పరిశీలిస్తారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడతారు. 12 గంటలకు గుర్లలో బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా అధికారులతో డయేరియా పరిస్థితిపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌ నుంచి బయలుదేరి, 4.10 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారని కలెక్టర్‌ తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు కూడా డయేరియా బాధితులను పరామర్శించనున్నారు.

గుర్లలో అదుపులో డయేరియా

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): గుర్లలో డయేరియా అదుపులోకి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయానికి ఆయన నివేదిక అందించారు. తాగునీటి సమూనాలను ప్రయోగశాలకు పంపించగా, నీరు సరఫరా చేసే పైపులు డ్రైనేజీ వ్యవస్థలో ఉండడం వల్ల లీకేజీ అయ్యి తాగునీరు కలుషితమైందని స్థానిక అధికారులు వివరించినట్లు పేర్కొన్నారు. ఈనెల13న ఒకరితో డయేరియా కేసులు మొదలుకాగా, 14న 55 కేసులు, 15న 65 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాత నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. శనివారం ఒక్కకేసు మాత్రమే నమోదైందని, 53 మంది చికిత్స పొందుతుంద న్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ గుర్లలో డయేరియాతో ఒక్కరు మాత్రమే చనిపోయారని, అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్న పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టరు డాక్టర్‌ పద్మావతి నివేదిక పంపారని తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 12:28 AM