ఏనుగుల హల్‌చల్
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:09 PM
కొమరాడ మండలం కుమ్మరిగుంట, కందివలసలో గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. కొద్దిరోజులుగా ఆయా గ్రామాల్లో అవి సంచరిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
కొమరాడ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం కుమ్మరిగుంట, కందివలసలో గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. కొద్దిరోజులుగా ఆయా గ్రామాల్లో అవి సంచరిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇదిలా ఉండగా గజరాజులు ఆయా ప్రాంతాల్లో కూరగాయల పంటను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. తమ ఏడాది కష్టం పోయిందని, తక్షణమే ఏనుగుల గుంపును తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేలాది రూపాయలు నష్టపోయిన తమకు పరిహారం అందించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం ఏనుగులు రైల్వే ట్రాక్, పార్వతీపురం- రాయగడ అంతర్రాష్ట్ర రహదారి దాటి కుమ్మరిగుంట నుంచి గారవలసకు చేరుకున్నాయి. దీంతో ఆ దారిలో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచింది. ట్రాకర్లు అక్కడకు చేరుకుని ఏనుగుల దారి మళ్లించడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:09 PM