ఇంకెన్నాళ్లిలా?
ABN, Publish Date - Oct 01 , 2024 | 11:48 PM
మండల కేంద్రానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది సీసాడవలస గిరిజన గ్రామం. అయితే రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వేళల్లో ఆ గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు.
సీసాడవలసలో గర్భిణీ అవస్థలు
కొమరాడ, అక్టోబరు 1 : మండల కేంద్రానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది సీసాడవలస గిరిజన గ్రామం. అయితే రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వేళల్లో ఆ గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. మంగళవారం ఆ గ్రామానికి చెందిన కొండగొర్రి నిఖితకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే 108 వాహనానికి ఆశా కార్యకర్త సమాచారం అందించారు. అయితే రోడ్డు లేని కారణంగా గ్రామంలోకి ఆ వాహనం రాలేదు. దీంతో గ్రామస్థులు మంచాన్ని డోలీగా చేసి నిఖితను సుమారు 150 మీటర్ల వరకు మొసుకొచ్చారు. ఆ తర్వాత 108 వాహనంలోకి ఎక్కించి జిల్లా కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం గర్భిణీ పరిస్థితి బాగానే ఉంది. అయితే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తరచూ ఈ అవస్థలు తప్పడం లేదని దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆ గ్రామస్థులు, ప్రజా, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఆ గ్రామానికి సిమెంటు రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు టీడీపీ మండల కన్వీనర్ ఉదయశేఖరపాత్రుడు తెలిపారు. గ్రామానికి వెళ్లే రహదారిలో కల్వర్టు నిర్మాణం జరుగుతుందని, మరికొద్ది రోజుల్లో ఆ గ్రామానికి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు కానున్నట్లు ఆయన చెప్పారు.
Updated Date - Oct 01 , 2024 | 11:48 PM