ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:03 AM

వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఇందుకూరి రఘురాజుపై కక్ష సాధించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరుగుతుందన్న ఆశతో అభ్యర్థిని ప్రకటించింది. అంతటితో ఆగకుండా నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయించింది.

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది

రఘురాజుపై కక్షసాధించేందుకు చూసిన వైసీపీ

ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేయించిన వైనం

హైకోర్టు తీర్పుతో ఉప ఎన్నికను రద్దుచేసిన ఈసీ

జిల్లాలో నడుస్తున్న గందరగోళానికి తెర

విజయనగరం/ శృంగవరపుకోట, నవంబరు 14(ఆంధ్రజ్యోతి):

వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఇందుకూరి రఘురాజుపై కక్ష సాధించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరుగుతుందన్న ఆశతో అభ్యర్థిని ప్రకటించింది. అంతటితో ఆగకుండా నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయించింది. స్థానిక సంస్థల్లో ఓట్లన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయంటూ ధీమా వ్యక్తం చేసింది. అధికార కూటమి నేతల నుంచి ఓట్లను లాగేందుకు క్యాంప్‌ రాజకీయాలు చేసేందుకూ సిద్ధపడుతున్న తరుణంతో హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. ఉప ఎన్నిక రద్దు చేయాలని తీర్పునిచ్చింది. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ కూడా తీర్పును ధ్రువీకరిస్తూ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను రద్దుచేసింది. దీంతో వైసీపీకు తెరుకోలేని దెబ్బతగిలినట్లయింది.

శృంగవరపుకోట నియోజకవర్గంలో 2019లో పార్టీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గెలుపునకు కృషి చేసారని 2021లో రఘురాజుకు జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని నాటి వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే ఎమ్మెల్సీగా బాధ్యతలను స్వీకరించిన ఏడాదిలోపే స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలు తలెత్తాయి. నియోజకవర్గంలో తన వర్గానికి అన్యాయం జరుగుతోందని రఘురాజు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కడుబండికి టిక్కెట్‌ ఇవ్వొద్దంటూ ఇతని వర్గం డిమాండ్‌ చేసింది. అధిష్టానం మాత్రం కడబండి శ్రీనివాసరావుకు టిక్కెట్‌ ఇవ్వడంతో రఘురాజు వర్గీయులంతా ఇతని భార్య సుధారాజు(సుబ్బలక్ష్మి) ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. రఘురాజు మాత్రం వైసీపీలో ఉండిపోయారు. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు అతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించేందుకు వ్యూహం రచించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అప్పటి శాసనమండలి విప్‌ పాలవలస విక్రాంత్‌తో ఫిర్యాదు చేయించారు. వెంటనే మండలి చైర్మన్‌ మోసన్‌ రాజు ఈఏడాది జూన్‌ 3న అనర్హత వేటు వేసేశారు. దీన్ని రఘురాజు హైకోర్టులో సవాల్‌ చేశారు. కోర్టులో వాజ్యం నడుస్తోంది. మరో రెండు రోజుల్లో తీర్పు వస్తుందనగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఇచ్చింది. అక్టోబర్‌ 4న నోటీఫికేషన్‌ను జారీ చేసింది. అంతే వైసీపీ ఈ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకొనేందుకు వ్యూహరచనలకు దిగింది. బొబ్బిలి మాజీ శాసనసభ్యుడు శంబంగి వెంకట చినప్పలనా యుడుకు టిక్కెట్టు ఖరారు చేసింది. అంతలో హైకోర్టు నుంచి రఘురాజుకు అనుకూలంగా తీర్పురావడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్సీ పోటీకి ఎవరినీ రంగంలోకి దించలేదు. హైకోర్టు తీర్పుతో ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను రద్దుచేస్తుందని ముందే ఊహించింది. అయితే ఈసీ నిర్ణయం ప్రకటించడంలో ఆలస్యంగా జరగడంతో ఎన్నికల క్రతువు అలాగే సాగింది. ఎందుకైనా మంచిదన్న నిర్ణయంతో రఘురాజు భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి (సుధారాజు), ఇతని వర్గానికి చెందిన కారుకొండ వెంకటరావులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు నామినేషన్‌లు వేశారు. వాటి పరిశీలన కూడా పూర్తయింది. అంతలో అందరూ ఊహించినట్లే ఎన్నికల సంఘం ప్రకటన వెలువడింది. ఉప ఎన్నిక షెడ్యూల్‌ను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. మొత్తానికైతే రఘురాజు ఎమ్మెల్సీగా 2027 సెప్టెంబరు వరకూ కొనసాగనున్నారు.

న్యాయం గెలిచింది..

ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు

నాపై కక్ష కట్టి వైసీపీ నాయుకులు, మండలిలో నాపై ఫిర్యాదు చేసి, చైర్మన్‌తో అనర్హత వేటువేయించారు. కనీసం నా వాదన కూడా వినలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. పూర్తి వివరాలు విన్న తరువాత వైసీపీ వాదనలను కోర్టు కొట్టేసింది. గురువారం ఈసీ కూడా ఉప ఎన్నికలు రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో న్యాయమే గెలిచినట్లు అయ్యింది. ఇదివరకు మాదిరిగా ఎమ్మెల్సీగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు: కలెక్టర్‌

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్‌ రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి.. కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. ఉప ఎన్నికకు ఈనెల 4న నోటిఫికేషన్‌ వెలువడినప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు హైకోర్డును ఆశ్రయించాక కోర్డు ఆదేశాలకు అనుగుణంగా ఈసీ నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దీంతో ఉప ఎన్నిక రద్దు అయ్యిందని కలెక్టరు తెలిపారు.

Updated Date - Nov 15 , 2024 | 12:03 AM