జెట్టీ కలేనా?
ABN, Publish Date - Nov 17 , 2024 | 11:50 PM
సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జెట్టీ నిర్మాణం రెండు మండలాల మత్స్యకారులకు కలగా మిగులుతోంది. జెట్టీ ఉంటే స్థానికంగా ఉపాధి దొరుకుతుందన్న మత్స్యకారుల ఆశ నెరవేరడం లేదు. ఆర్థిక కష్టాలకు తాళలేక చాలా మంది మత్స్యకారులు కుటుంబాల సమేతంగా వలసబాట పడుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, పారాదీప్ ప్రాంతాలకు వెళ్లి అక్కడ చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు.
జెట్టీ కలేనా?
సంవత్సరాలుగా మత్స్యకారుల ఎదురుచూపులు
ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస
అక్కడ ఎన్నో కష్టాలు
కూటమి ప్రభుత్వంపై ఆశలు
సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జెట్టీ నిర్మాణం రెండు మండలాల మత్స్యకారులకు కలగా మిగులుతోంది. జెట్టీ ఉంటే స్థానికంగా ఉపాధి దొరుకుతుందన్న మత్స్యకారుల ఆశ నెరవేరడం లేదు. ఆర్థిక కష్టాలకు తాళలేక చాలా మంది మత్స్యకారులు కుటుంబాల సమేతంగా వలసబాట పడుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, పారాదీప్ ప్రాంతాలకు వెళ్లి అక్కడ చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు.
పూసపాటిరేగ, నవంబరు17(ఆంధ్రజ్యోతి):
కొన్నేళ్లుగా పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన మత్యకారులు జీవనోపాధికోసం దేశంలో వివిధ ప్రాంతాలకు వలసపోతున్నారు. ఇక్కడ జెట్టీ ఏర్పాటు చేయాలని సంవత్సరాలుగా విన్నవించుకొంటున్నా స్పందన లేకపోవడంతో పొట్ట చేత పట్టుకుని పయనమ వుతున్నారు. వైసీపీ ప్రభుత్వం మత్యకార భరోసా ప్రకటించిన సమయంలో నాటి ముఖ్యమంత్రి జగన్ చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అఽధికారులు పలుమార్లు వచ్చి స్థల పరిశీలన చేయడమేగాని నిర్మాణం వైపుగా అడుగు పడలేదు. మండలంలో కోనాడ పంచాయతీకి చెందిన మత్యకార గ్రామమైన బీజీపేట నుంచి అత్యధికంగా మత్స్యకారులు వలస వెళ్లిపోయారు. ఈగ్రామంలో వృద్ధులు, పిల్లలు తప్ప పెద్దగా ఎవ్వరూ కానరారు. అందరూ జీవనోపాధి కోసం విశాఖ, పారాదీప్, గుజరాత్ తదితర ప్రాంతాలకు తరలిపోయారు. గ్రామ జనాభా సుమారు 600మందికి పైగా ఉన్నా పట్టుమని 100మంది కనిపించరు. పాఠశాలలో కూడా పట్టుమని 15మంది పిల్లలు లేరు. కొన్నిసార్లు సొంతవారు మరణించినా కడచూపు కరువైన సందర్భాలు కోకొల్లలు. మండలంలో మత్యకార గ్రామాలైన చింతపల్లి, తిప్పలవలస గ్రామాల్లో తప్ప మరేగ్రామంలోనూ మూడో వంతు ప్రజలు ఉండరు. అయితే చింతపల్లిలో జెట్టీ నిర్మాణం జరిగితే వారంతా సొంత గ్రామాల్లోనే ఉండి జీవనోపాధి పొందే అవకాశం ఉంటుంది. గతంలో కేంద్ర మత్స్యకారశాఖ మంత్రిగా ఉన్న పురుషోత్తం రూపాలా చింతపల్లివచ్చి త్వరలోనే జెట్టీ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. పనులు ముందుకు కదలలేదు. కూటమి ప్రభుత్వం జెట్టీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మత్యకారులు, నాయకులు కోరుతున్నారు.
జెట్టీ నిర్మాణం చేపట్టాలి
జెట్టీ నిర్మిస్తే జిల్లాలో మత్స్యకారులంతా స్థానికంగా జీవనోపాధి పొందే అవకాశం ఉంటుంది. వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకశ్రద్ధ కనబరిచినట్లయితే వందలమంది మత్యకారులకు జీవనోపాధి దొరుకుతుంది.
- దంగా భూలోక, కోనాడ, మత్స్యకార నాయకులు.
వేర్వేరు ప్రాంతాల్లో కొడుకులు
నాకు ముగ్గురు కొడుకులు. చేపలవేటే వారికి జీవనాధారం. జీవనోపాధికోసం ముగ్గురు కొడుకులు వృద్ధాప్యంలో ఉన్న నన్ను వదిలి వెళ్లిపోయారు. ఇక్కడే జెట్టీ ఉంటే మాతోపాటే మాగ్రామంలో ఉండేవారు.
- దంగా దానయ్య, బీజీపేట, మత్స్యకారుడు.
నాకు ఆధారం లేదు
నేనే దివ్యాంగుడిని. ఏ ఆధారం లేకుండా పోయింది. జీవనోపాధికోసం నా కుమారులు వేరేప్రాంతాలకు వెళ్లిపోయారు. జీవనం కష్టంగా ఉంది.
- బొడ్డు సత్తయ్య, మత్స్యకారుడు.
Updated Date - Nov 17 , 2024 | 11:51 PM