మండల స్థాయిలో పకడ్బందీగా పీజీఆర్‌ఎస్
ABN, Publish Date - Nov 18 , 2024 | 11:41 PM
మండల స్థాయిలో ప్రతి సోమవారం పకడ్బందీగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.
పార్వతీపురం, నవంబరు18 (ఆంధ్రజ్యోతి) : మండల స్థాయిలో ప్రతి సోమవారం పకడ్బందీగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో కమిషనర్లు, మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు పక్కాగా పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించి.. ప్రజా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు నివేదించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. అర్జీలను పరిష్కరించని సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేటి నుంచి మరుగుదొడ్ల దినోత్సవం
జిల్లాలో మంగళవారం నుంచి మరుగుదొడ్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. మరుగుదొడ్ల దినోత్సవం నేపథ్యంలో నేటి నుంచి డిసెంబరు 10 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు 469 మరుగుదొడ్లు మంజూరు చేశామని వచ్చేనెల 10 నాటికి వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ శోభిక, ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ కె.చలపతిరావు, కార్యనిర్వాహక ఇంజనీర్ వేణుగోపాల్‌నాయుడు తదితరులున్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 156 వినతులు
పార్వతీపురం, నవంబరు18 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 156 వినతులు అందాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు రెవెన్యూ, ఇళ్లు, పింఛన్లు, రోడ్లు, రేషన్‌కార్డులు తదితర సమస్యలపై అర్జీలు అందించారు. వాటిని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, ఐటీడీఏ ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పరీశీలించారు. తక్షణ పరిష్కార నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందజేశారు.
Updated Date - Nov 18 , 2024 | 11:41 PM