పరిశ్రమలతోనే ప్రగతి
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:24 AM
ఏ ప్రాంతంలోనైనా పారిశ్రామిక అభివృద్ధి చాలా ముఖ్యం. అప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కానీ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. పారిశ్రామికీకర ణకు ఎన్నో వనరులు ఉన్నా.. ఆ దిశగా అడుగులు పడడం లేదు.
పారిశ్రామికీకరణకు అడుగులు పడని వైనం
గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం.. మూతపడిన పరిశ్రమలు
ఉపాధి లేక వలసబాట పడుతున్న జిల్లావాసులు
కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని విన్నపం
(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)
ఏ ప్రాంతంలోనైనా పారిశ్రామిక అభివృద్ధి చాలా ముఖ్యం. అప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కానీ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. పారిశ్రామికీకర ణకు ఎన్నో వనరులు ఉన్నా.. ఆ దిశగా అడుగులు పడడం లేదు. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి మూతపడ్డాయి. ఫలితంగా ఏటా ఎంతోమంది జిల్లావాసులు వలసబాట పడుతున్నారు. పొట్ట చేతపట్టుకుని ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం జిల్లాలో పారిశ్రామికీకరణపై దృష్టి సారించాల్సి ఉంది. వలసలను నివారించాల్సి ఉంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన పార్వతీపురం మన్యంలో చెప్పుకోదగ్గ పరిశ్రమలేవీ లేవు. వాస్తవంగా అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతంలో పేదలే ఎక్కువ. వారిలో అత్యధికులకు వ్యవసాయమే ఆధారం. మరోవైపు ఏజెన్సీలో గిరిజనులు పోడు సాగుతో పాటు అటవీ ఉత్పత్తులు సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఏటా సంభవించే ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయం చేయలేక.. వేరే పనుల్లోకి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో పరిశ్రమలు లేకపోవడంతో పనుల కోసం కుటుంబాలతో వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ వంటి కర్మాగారాలు రాకపోయినా.. కనీసం వెయ్యి మంది వరకూ ఉపాధి పొందే చిన్న, మధ్య తరహా కర్మాగారాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం, సాలూరు నియోజకవర్గంలోని జీగిరాం జూట్ మిల్లు ఇప్పటికే మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. అయినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎన్‌సీఎస్ ఫ్యాక్టరీకి చెందిన భూములను రియల్ ఎస్టేట్లుగా మార్చారే తప్ప చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు ఏ మాత్రం శ్రద్ధ వహించలేదు.
- గతంలో సాలూరు మండలంలో కరాసవలసలో సిమెంట్ పరిశ్రమ ఉండేది. అయితే వివిధ కారణాలతో అది మూతపడింది.
- జిల్లాలో అటవీ ఉత్పత్తులకు కొదవ లేదు. అయితే గిట్టుబాటు ధర లేక గిరిజనులు నష్టపోతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో జీడి పంట అధికంగా ఉన్నప్పటికీ జీడి ప్రాసెసింగ్ యూనిట్లు లేవు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- రాష్ట్రంలో విజయవాడ తరువాత సాలూరు లారీ పరిశ్రమలో రెండో స్థానంలో ఉంది. పట్టణంలో 2,400 పైగా లారీలున్నాయి. ప్రత్యక్ష, పరోక్షంగా 26 వేల మంది వరకు లారీ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పరిస్థితి దయనీయంగా మారింది. వ్యాట్, రోడ్డు ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, డీజీల్‌పై వ్యాట్, రోడ్ సెస్ ఇలా పలు పన్నులను వైసీపీ ప్రభుత్వం పెంచింది. ఈ భారంతో లారీలను నడపడానికి యాజమానులు ముందుకు రాకపోవడంతో ఆ ప్రభావం కార్మికులపై పడింది. మొత్తంగా సాలూరు లారీ పరిశ్రమపై వైసీపీ శీతకన్ను వేసింది. కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. అయితే దీనికి సంబంధించి స్పేర్ పార్ట్స్‌తో పాటు టైర్లు తయారీ తదితర పరిశ్రమలను ఏర్పాటు చేస్తే.. కార్మికులతో పాటు మరెంతో మంది ఉపాధి పొందే అవకాశం ఉంది. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి ‘మన్యం’లో పారిశ్రామికీకరణకు చర్యలు తీసుకోవాలని, మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు చొరవ చూపాలని జిల్లావాసులు కోరుతున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు నూతన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - Sep 16 , 2024 | 12:24 AM