శిల్పాలు లేని శిల్పారామం
ABN, Publish Date - May 05 , 2024 | 11:42 PM
తెలుగు సంస్కృతీసంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి.. ఉగాది.. అమ్మవార్ల పండగలు.. కూచిపూడి నృత్యం.. సంగీతం.. సాహిత్యం.. జానపద కళలు.. తొలకరిలో ఏరువాక సాగించే అన్నదాత.. తెలుగు వంటకాలు.. తోలు బొమ్మలాట.. బొబ్బిలి వీణ.. రాజుల వీరగాథలు..
శిల్పాలు లేని శిల్పారామం
కానరాని తెలుగు సంప్రదాయ కళా ప్రదర్శనలు
తెరవని స్టాళ్లు.. ఫుడ్ కోర్టులు
స్థానికులు తప్ప ఇతరులెవరూ వెళ్లని దయనీయం
పార్కు అనడమే సబబు అంటున్న పర్యాటకులు
పండగల సమయాల్లోనే అధికారుల హడావిడి
తెలుగు సంస్కృతీసంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి.. ఉగాది.. అమ్మవార్ల పండగలు.. కూచిపూడి నృత్యం.. సంగీతం.. సాహిత్యం.. జానపద కళలు.. తొలకరిలో ఏరువాక సాగించే అన్నదాత.. తెలుగు వంటకాలు.. తోలు బొమ్మలాట.. బొబ్బిలి వీణ.. రాజుల వీరగాథలు.. ఇలా ఎన్నో.. వాటన్నింటినీ భవిష్యత్ తరాలకు అందించాలని.. శిల్పకళ ద్వారా శాశ్వత ప్రదర్శన ఏర్పాటు చేస్తే వాటిని చూసి అందరూ తెలుసుకుంటారని నాటి టీడీపీ ప్రభుత్వం సంకల్పించి శిల్పారామాలను ఏర్పాటు చేసింది. అవి రూపు దిద్దుకుంటున్న దశలో ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లు పట్టించుకోవడం మానేసింది. గత ఏడాది హడావిడిగా ప్రారంభించి అసలు ఉద్దేశాన్నే పక్కదారి పట్టించింది. విజయనగరంలో శిల్పాలు లేని శిల్పారామాన్ని కొలువుదీర్చింది. దీనిని పార్కు అనడం సబబేమో అని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
కనుమరుగవుతున్న తెలుగు సంప్రదాయాలను తట్టి లేపాలని.. వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని.. గత ప్రభుత్వం శిల్పారామాలను తెరపైకి తీసుకురాగా ఈ ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించింది. ఏమీ లేకుండా ఆర్భాటంగా ప్రారంభించి వదిలేసింది. కళలను భవిష్యత్ తరాలకు సజీవంగా అందించడం కోసం వారు ప్రయత్నిస్తే వీరు ప్రారంభించడమే పనిగా పెట్టుకుని మమ అనిపించేశారు. మన సంస్కృతీసాంప్రదాయల్లో అనేకం కనుమరుగవుతున్న దశలో ఉన్నాయి. వాటిని కాపాడి తర్వాత తరం వారికి పదిలంగా అందించడం అవసరం. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం కనీసం గుర్తించలేదు. శిల్పారామాల కోసం టీడీపీ ప్రభుత్వం ఏకంగా పర్యటక శాఖలో ఒక ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసింది. మార్గదర్శకంగా వాటిని రూపుదిద్దాలని భావించింది. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లు వదిలేసి గతేడాది జూన్‌లో శిల్పారామాన్ని ప్రారంభించింది. ఇక్కడున్న స్టాల్స్, కేంటీన్లు కొన్ని రోజుల్లో తెరవడం గగనమే. సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే స్టేజీ ఉంది కాని ప్రత్యేక పండగల్లోనే ప్రదర్శనలు ఉంటున్నాయి. పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం చెపుతోంది అందులో భాగమైన విజయగనరంలోని శిల్పారామాన్ని పట్టించుకోవడం లేదు. కల్చరల్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శిల్పారామం నడుస్తోంది. ఆదివారం మినహా అక్కడ జనాలు కన్పించడం లేదు. ఏ రోజూ స్టాళ్లు తెరవడం లేదు. అందులోకి ప్రవేశం కావాలంటే రూ.20 టిక్కెట్టు తీసుకోవాలి. లోపలకు వెళ్లాక చూడటానికి ఏమీ లేవు. సాధారణ పార్కు మాదిరి కాసేపు విశ్రమించి తిరుగుముఖం పట్టాల్సిందే. గత కలెక్టర్ సూర్యకుమారి శిల్పారామంలో వివిధ కార్యక్రమాల పేరుతో హడావిడి చేశారు. ప్రభత్వ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు ప్రయత్నించారు. దీంతో నిత్యం కొద్దిగా జనం కనిపించేవారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా దయనీయం. సమీపస్తులు మినహా ప్రత్యేకంగా శిల్పారామానికి వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. పిల్లలు ఆడుకునేందుకు మాత్రం కొద్దిగా పరికరాలు ఉన్నాయి. జ్యూయలరీ స్టాల్, టెర్రోకోట్, ఏటికొప్పాక బొమ్మల దుకాణాలను తెరవడం లేదు. ఫుడ్ కోర్టు కూడా రోజూ తెరిచి ఉండడం లేదు.
- శిల్పారామం కోసం విజయనగరం పట్టణంలోని వ్యాసనారాయణ మెట్ట ప్రాంతంలో 41 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం కోటి రూపాయలతో వాటర్ పార్క్ నిర్మాణం జరుగుతోంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం స్టేజ్‌తో పాటు విశ్రాంతి గదులు ఉన్నాయి. వీటి నిర్వహణ సరిగా లేదు.ఇక్కడి పరిస్థితిని శిల్పారామం ఏఓ రమణ వద్ద ప్రస్తావించగా పర్యాటక శాఖ పరిధిలో ఓ సొసైటీ ఆధ్వర్యంలో శిల్పారామం నడుస్తోందన్నారు. ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, శిల్పాలు, సాంస్కృతిక కార్యక్రమాల కళా రూపాలు, జానపద కళలు, పల్లెటూరు వాతావరణం, గిరిజన మ్యూజియం, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దశల వారీగా చేపట్టేందుకు ప్రణాళికలు ఉన్నాయని, వాటర్ పార్క్ నిర్మాణ దశలో ఉందని వెళ్లడించారు.
Updated Date - May 05 , 2024 | 11:42 PM