శంకరరావు మా‘స్టారు’
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:24 AM
‘దేశ భవిష్యత్తు నిర్మాణానికి తరగతి గదే పునాది’ అన్న మాటలను నిజమని నిరూ పిస్తున్నారా ఉపాధ్యాయుడు.
- వినూత్న బోధన ఆయన సొంతం
- పాఠాల పాటలతో పులకిస్తున్న విద్యార్థులు
మెంటాడ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘దేశ భవిష్యత్తు నిర్మాణానికి తరగతి గదే పునాది’ అన్న మాటలను నిజమని నిరూ పిస్తున్నారా ఉపాధ్యాయుడు. బెత్తం పట్టు కొని బెదిరించడం ద్వారా కాదు...ఇష్టంగా పి ల్లలు చదువుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఆయనే బొంతలకోటి శంకరరావు. 1998లో ఉద్యోగ జీవి తం ప్రారంభించిన ఈ సాంఘిక శాస్త్ర ఉపాధ్యా యుడు తరగతి గదిలో సంగీతం మాస్టారుగా మారిపోతారు. పాఠంలో సంక్లిష్టంగా ఉండే కొన్ని అంశాలకు కళారూపాన్ని అద్ది విద్యార్థులు ఆసక్తి గా నేర్చుకునేలా చేయడం ఈ మాస్టారి ప్రత్యేక త. కోలాటం, తప్పెటగుళ్లు, జముకుల కథ, ఏకపాత్రాభినయం..ఇలా విభిన్న రూపాల్లో బోధి స్తారు. తన పాఠాలకు కీబోర్డు, గిటార్, కంజీర వంటి సంగీత వాయిద్య పరికరాలను జోడిస్తారు బొంతలకోటి.
రచయితగానూ గుర్తింపు
వృత్తిపరంగా ఉపాధ్యాయుడైన బొంతలకోటి మాస్టారు ప్రవృత్తి పరంగా మంచి రచయిత కూ డా. పాటలతో పాఠాలు, సాంఘికంలో సరిగమ లు, మనోపథం, చైతన్య గీతాలు, అక్షరమే ఆయుధం, జనజాగృతి కళారూపాలు, సాక్షర భారత్ కళారూపాలు, బడి నుంచి పొలంబడికి, కషాయాలు-ద్రావణాలు, ప్రకృతి మిత్ర, ప్రకృతిలో స్వచ్ఛ భారత్, నీరు-చెట్టు, బాలరక్ష, జీవ వైవిధ్యం-పర్యావరణం తదితర రచనలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. సైకాలజీ, సోషియాలజీ, హిస్టరీలో పీజీ పూర్తి చేసిన ఆయన మరికొన్ని డిప్లొమా సర్టిఫికెట్లనూ అందుకున్నారు. ఉపాధ్యాయుడిగా సుమారు పాతికేళ్ల ప్రస్థానంలో ఎందరో శిష్యులను సొంతం చేసుకున్న శంకరావు మాస్టారు ప్రస్తుతం మెంటాడ మండలం గుర్ల తమ్మిరాజుపేట (జీటీపేట)లో సేవలు అందిస్తున్నారు. గజపతినగరం మండలం పురిటిపెంట న్యూకాలనీకి చెందిన ఈ మాస్టారు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని కోరుకుందాం.
ఎన్నో అవార్డులు
వినూత్న బోధనతో ఆకట్టుకునే శంకరరావు మాస్టారుకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రైవేటు, ప్రభుత్వ అవార్డులతో పాటు రాష్ట్రపతి పురస్కారం కూడా వరించాయి. వాటిలో కొన్ని..
2010లో కామన్‌వెల్త్ అంతర్జాతీయ అవార్డు.
2010లో బాల సాహిత్య పురస్కారం,
2011లో రాష్ట్రపతి అవార్డు.
2011లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం.
2012లో నేషనల్ గ్రీన్ టీచర్ అవార్డు.
2012లో ఐక్యరాజ్య సమితి జీవన వైవిధ్య అంతర్జాతీయ అవార్డు.
2012లో లీడ్ ఇండియా పురస్కారం.
2013లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు.
2014లో సాక్షర్ భారత్ జాతీయ పురస్కారం.
2016లో ఉత్తమ రచయిత అవార్డు.
2017లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు.
2019లో బెంగళూరు విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ పురస్కారం.... ఇలా అనేక అవార్డులు శంకరరావు మాస్టారును వరించాయి. ఇక జిల్లా స్థాయిలో అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు.
బతుకు పాఠం నేర్పారు
నాది బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామం. 7 నుంచి పది వరకు శంకరరావు మాస్టారు దగ్గర చదువుకోవడం నా పూర్వజన్మ సుకృతం. ఆయన క్లాస్ అంటే నేనే కాదు... పిల్లలందరం ఎగిరి గంతులేసేవాళ్లం. పాటల రూపంలో ఆయన బోధన నాకు జీవిత పాఠం నేర్పింది. చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతకు అప్పుడే నాలో బీజం పడింది.
- హరీష్, ఎస్‌ఐ, భీమునిపట్నం
గురుబ్రహ్మ అనే పదానికే గౌరవం
నాది దత్తిరాజేరు మండలం దాసుపేట గ్రామం. శంకరరావు మాస్టారు గురు బ్రహ్మ పదానికి గౌరవం తెచ్చిన వ్యక్తి. ఆటపాలతో విద్యను బోధిస్తూనే, ఉన్నత వి లువలు, వ్యక్తిత్వం, సామాజిక బాధ్యతను కూడా నేర్పారు. రోడ్డు సౌకర్యం లేక సైకి లుపై రావడానికి మాస్టారు ఇబ్బంది పడేవారు. మేము సైకిల్‌పై తీసుకొచ్చే వాళ్లం. ఆయన పాఠాలు విని మహిళలు గ్రామంలో మద్యపాన నిషేధం చేయించారు.
- గణపతి, బీట్ ఆఫీసర్, అటవీ శాఖ
Updated Date - Nov 24 , 2024 | 12:24 AM