ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాతృభాషలోనే మాట్లాడండి

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:40 AM

తెలుగు భాష సజీవంగా ఉండాలంటే తెలుగు ప్రజలంతా మాతృభాషలోనే మాట్లాడాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ (ఎన్‌వీ రమణ) అన్నారు. పరభాష వ్యామోహంలో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

మీగడ రామలింగస్వామికి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న జస్టిస్‌ ఎన్‌వీ రమణ

మాతృభాషలోనే మాట్లాడండి

పరభాషా వ్యామోహం వీడండి

సంఘ సంస్కర్త గురజాడ

సాంఘిక దురాచారాలను అరికట్టేలా ఆయన రచనలు

సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ

విజయనగరం టౌన్‌ నవంబరు 30(ఆంధ్రజ్యోతి): తెలుగు భాష సజీవంగా ఉండాలంటే తెలుగు ప్రజలంతా మాతృభాషలోనే మాట్లాడాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ (ఎన్‌వీ రమణ) అన్నారు. పరభాష వ్యామోహంలో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మహాకవి గురజాడ వెంకట అప్పారావు వర్థంతిని పురస్కరించుకుని విజయనగరంలోని ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన గురజాడ విశిష్ట పురస్కార ప్రదానోత్సవానికి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పురస్కార గ్రహీత, రచయిత, దర్శకుడు మీగడ రామలింగస్వామికి పురస్కారాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాకవి గురజాడ రచనలు నేటికి సజీవమని అన్నారు. నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు ‘కన్యాశుల్కం’ సజీవ సాక్ష్యమని తెలిపారు. వందేళ్ల క్రితం ఆయన ప్రస్తావించిన సమస్యలు నేటికి మిగిలే ఉన్నాయన్నారు. నాడు ఒక గిరీశమే ఉంటే, నేడు వందలాది మంది గిరీశాలు పుట్టుకొచ్చారన్నారు. పోలీస్‌, న్యాయ వ్యవస్థల్లో లోపాలను, కుళ్లిన సమాజాన్ని నాడు తన కన్యాశుల్కంలో ఎత్తి చూపారని గుర్తుచేశారు. బ్రిటీష్‌ న్యాయ వ్యవస్థను ఆయన ఆక్షేపించారని, నాటి సమాజంలో సాంఘిక దురాచారాలను, ఇతరత్రా అసమానతలను తొలగించేందుకు తన రచనలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన సంఘ సంస్కర్త గురజాడ అని చెప్పారు.

తెలుగు భాషపై నిర్లక్ష్యం తగదు

పరభాష వ్యామోహంలో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదని జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. ప్రస్తుతం తెలుగు భాషపై తీవ్ర నిర్లక్ష్యం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భాష అంతరించిపోకుండా ఉండాలంటే పాలన అంతా తెలుగులోనే సాగాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మిత్రుడు మండలి బుద్ధప్రసాద్‌ చెప్పిన చేప, పిల్ల కోతి కథను చెప్పి ఆహూతులను ఆలోచింపజేశారు. తెలుగు భాషను సజీవంగా ఉంచాలన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే మేధావులు అవుతారు అనుకోవడం తప్పని అన్నారు. మాతృభాషను నేర్చుకోని, పరిపూర్ణత కాలేని వ్యక్తి పరాయి భాషపై ఏవిధంగా పట్టు సాధిస్తాడని ప్రశ్నించారు. కొన్ని పరిశోధనల్లో మాతృభాషలో మాట్లాడితేనే మెదడు చురుగ్గా పని చేస్తున్నట్లు తేలిందన్నారు. సమాజాభివృద్ధిలో మాతృభాష కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తెలుగు భాష సజీవంగా ఉండాలంటే తెలుగు ప్రజలు మాతృభాషలోనే మాట్లాడాలని ఆయన సూచించారు. భాష, సంస్కృతులు అంతరించిపోకూడదన్నారు. తెలుగు భాషకు పరిపుష్టత లభించాలంటే కోర్టుల తీర్పులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగాలన్నారు. తల్లిదండ్రులకు ఆంగ్ల మాధ్యమంపై భ్రమలు తొలగిపోవాలని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు శతక సాహిత్యాల విశిష్టతను వివరించాలని ఆయన సూచించారు.

కేసును ఉపసంహరించుకోవాలి

గతంలో ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో జారీ చేయడం దురదృష్టకరమని అన్నారు. ఆ కేసును హైకోర్టు కొట్టివేసినా, సుప్రీం కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. తెలుగు భాషను రక్షించేందుకైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించుకోవాలన్నారు. తెలుగు భాషకు గౌరవం లభించే విధంగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కృషి చేయాలని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు.

తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి

తెలుగు వారికి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే గౌరవప్రదంగా ఉంటుందన్నారు. తెలుగు ప్రజలు గర్వించే విధంగా రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు. వివిధ ప్రాంతాల్లో తెలుగు మాండలికాలు సజీవంగా ఉండాలంటే భాషా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.

ఆనందంగా ఉంది

మహాకవి పేరున ఉన్న గురజాడ విశిష్ట పురస్కారాన్ని దేశ అత్యున్నత వ్యక్తుల్లో ఒకరైన సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చేతుల మీదుగా అందుకోవడం ఆనందంగా ఉందని మీగడ రామలింగ స్వామి అన్నారు. 50 ఏళ్ల క్రితం విజయనగరంలో విద్యనభ్యసించానని, గురజాడ సాంస్కృతిక సమాఖ్య రజతోత్సవానికి ముందుగా ఈ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. గురజాడ రచనలు సమాజ చైతన్యానికి దోహద పడ్డాయన్నారు.

సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ

పురస్కార గ్రహీత మీగడ రామలింగ స్వామి గురజాడ రచనల్లోని పద్యాలు ఆలపించడం... తెలుగు భాష, సంస్కృతి గురించి మాట్లాడడం చూసి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆనందపడ్డారు. తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం రామలింగస్వామితో మాట్లాడారు. అనంతరం నిర్వాహకులు, విజయనగరం బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఎన్‌వీ రమణ, శివబాల దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం మానాపురం చంద్రశేఖర్‌, ఇందిరావెల్లి, జీఎల్‌ఎం శాస్త్రి, సత్యముని నవీన్‌, మీసాల చిన గౌరునాయుడు, కె.పద్మజా శంకర్‌, ఎన్‌.నరేంద్రబాబులకు గురజాడ పురస్కారాలు, డాక్టర్‌ కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి, కుసుమంచి శ్రీదేవి సురేష్‌లకు కవితా పురస్కారాలు అందజేశారు. వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి సాయి కళ్యాణ చక్రవర్తి, నగర డిప్యూటీ మేయర్‌ కె.శ్రావణి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌, ఎన్‌సీఎస్‌ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్‌, డాక్టర్‌ వెంకటేశ్వరరావు, సన్‌స్కూల్‌ అధినేత అనీల్‌కుమార్‌, మేకా అనంతలక్ష్మి, గురజాడ వారసులు ఇందిరా ప్రసాద్‌, వారి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

పైడిమాంబ దర్శనం

జిల్లా కేంద్రానికి విచ్చేసిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముందుగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లమ్మను దర్శించుకున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఎస్పీ వకుల్‌జిందాల్‌ తదితరులు ఆయనకు స్వాగతం తెలిపారు.

Updated Date - Dec 01 , 2024 | 12:40 AM