పర్యాటకంపై ప్రత్యేక దృష్టి
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:07 AM
జిల్లాలో పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక మండలి సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం, నవంబరు29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతంపేట పార్వతీ పురం, సాలూరు, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లోని జలపాతాలు, సందర్శనీయ ప్రదేశాలను కలుపుతూ సర్క్యూట్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ప్రతి పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు వీలుగా రహదారి సౌకర్యంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ముఖద్వారం, మెట్లు, ఆట పరికరాలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ జలాశయాలు, వేగావతి, సువర్ణముఖి నదీ ప్రాంతాలు, వీరఘట్టం వద్ద ఉన్న పెద్ద చెరువు తదితర ప్రదేశాల్లో వాటర్ పార్క్‌లను అభివృద్ధి చేయాలన్నారు. భామినిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, డీఎఫ్‌వో ప్రసూన, దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి వీవీఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల రవాణా నివారణకు జాయింట్ ఆపరేషన్
మాదకద్రవ్యాల రవాణా నివారణకు పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలని, బస్సులు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘మన్యం’లో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయి రవాణాను అరికట్టాలని తెలిపారు. ఇందుకోసం స్నిఫర్‌డాగ్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లు వినియోగించి నిఘా మరింత పెంచాలన్నారు. అక్రమ రవాణా చేసేవారికి పడే శిక్షలు అందరికీ తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యా సంస్థల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నాటుసారా తయారు చేసే వారిపై పీడీయాక్ట్, బైండోవర్ కేసులు పెట్టాలని ఆదేశించారు. ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి మాట్లాడుతూ... జిల్లా మీదుగా మదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయి రవాణా జరగకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ దిలీప్‌కిరణ్, పాలకొండ డీఎస్పీ రాంబాబు, వైద్య ఆరోగ్యశాఖ నోడల్ అధికారి వినోద్, బీసీ సంక్షేమ సాధికారిత అధికారి కృష్ణ తదితరులున్నారు.
Updated Date - Nov 30 , 2024 | 12:07 AM