రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:39 AM
జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని హోం మంత్రి, ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఆమె జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్
బెల్టు షాపులపై కఠిన చర్యలు
గంజాయి నివారణకు ‘ఈగల్ ’
వేసవిలో తాగునీటి కి ముందస్తు ప్రణాళిక: మంత్రి అనిత
విజయనగరం/ కలెక్టరేట్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని హోం మంత్రి, ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఆమె జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, వీటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్రీహోల్డ్ పట్టాలకు సంబంధించి సుమారు 490 ఎకరాల వరకూ అవకతవకలు జరిగినట్లు తేలిందని, బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. బెల్టుషాపులు ఎక్కడా లేకుండా ఎక్సైజ్ అఽధికారులు చూడాలన్నారు. వచ్చే వేసవిలో తాగునీరు సమస్య రాకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ తయారు చేసుకోవాలన్నారు. ధాన్యం తడవడం ద్వారా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరు 1912కు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న రహదారులకు మరమ్మతులు వేగంగా నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దీనిలో భాగంగా ఈగల్ టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేశామని, త్వరలో ప్రతి జిల్లాలో ఈగల్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
- ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో నిర్ణీత గడువులోగా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే కేటాయింపులను రద్దు చేయాల్సి ఉంటుందని మంత్రి శ్రీనివాస్ చెప్పారు. త్వరలో బొబ్బిలి గ్రోత్ సెంటర్‌ను పరిశీలించి కేటాయింపులపై సమీక్షిస్తామన్నారు. విద్యుత్ శాఖలో ఏఈలు, లైన్‌మెన్లు ఖాళీల కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. జిల్లాలో క్రీడా పాఠశాల మంజూరు అయ్యిందని, దీనిని త్వరలో ప్రారంభిస్తామ న్నారు. జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలుకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ అంబేడ్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘరాజు, పెనుమత్స సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, బేబీనాయన, లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వని, ఎస్‌పి వకుల్‌జిందాల్, జేసీ సేతు మాధవన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 12:39 AM