అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా సుజయ్ బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Nov 13 , 2024 | 11:51 PM
మాజీ మంత్రి రావు వెంకట సుజయ్‌కృష్ణరంగారావు ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా బుధవారం సాయంత్రం మంగళగిరిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా
సుజయ్ బాధ్యతల స్వీకరణ
అడవుల పరిరక్షణకు కృషి చేస్తానని ప్రకటన
బొబ్బిలి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):
మాజీ మంత్రి రావు వెంకట సుజయ్‌కృష్ణరంగారావు ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా బుధవారం సాయంత్రం మంగళగిరిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో సుజయ్‌ను కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సుజయ్‌ను తమ్ముడైన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తనను ఈ పదవిలో నియమించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సుజయ్ చెప్పారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ రీజినల్, డివిజనల్ స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అటవీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. భౌగోళిక సమతుల్యానికి తగ్గట్టుగా అటవీ విస్తీర్ణ ఉండేలా తగిన కార్యాచరణ అవసరమని, అడవుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పచ్చదనాన్ని తద్వారా పర్యావరణాన్ని పెంపొందించా లన్నది చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల సంకల్పమన్నారు. పచ్చదనంతో పాటు సంపదను, ఆదాయ వనరులను సృష్టించేలా అడవులను అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. ఏపీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో వెదురు, యూకలిఫ్టస్, టేకు వంటి చెట్లను గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సుజయ్‌ను జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం, పార్వతీపురం ఎమ్మెల్యేలు అదితిగజపతిరాజు, విజయచంద్ర, బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, సీనియర్ నాయకులు కలిసి అభినందించారు.
Updated Date - Nov 13 , 2024 | 11:51 PM