చిన్నబొండపల్లిలో ఉద్రిక్తత
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:15 AM
చిన్నబొండపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
పార్వతీపురం రూరల్: చిన్నబొండపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒక సామాజిక వర్గానికి చెందిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వివాహం ఆదివారం జరిగింది. ఆదివారం జరిగిన ఊరేగింపు సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య స్వల్ప వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడిపై మరొక సామాజిక వర్గానికి చెందిన నలుగురు మూకుమ్మడిగా దాడి చేశారు. గమనించిన కొంతమంది గ్రామస్థులు ప్రశ్నించగా.. వారిపై కూడా రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ సామాజిక వర్గానికి చెందిన గొంగాడ వెంకటనాయుడు, గండి నారాయణరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రెండు సామాజిక వర్గాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు సామాజిక వర్గాలు ఒకరినొకరు నెట్టుకున్నారు. తమ వర్గాన్ని కొట్టిన వారిని తమకు అప్పగించాలని, లేకపోతే వెంటనే అరెస్టు చేయాలని మరో సామాజిక వర్గానికి చెందినవారు రహదారిపై బైఠాయించారు. దీంతో సీఐ గోవిందరావు, టౌన్ సీఐ నారాయణరావు, ఎస్‌ఐ దినకరన్, ఎస్‌ఐ సంతోష్‌కుమారి ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి ఇరువర్గాలను శాంతింప చేస్తున్నప్పటికీ ఫలితం దక్కలేదు. రాత్రి సమాచారం అందే వరకు పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.
Updated Date - Oct 08 , 2024 | 12:15 AM