ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైబర్‌ వలలో విలవిల

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:42 AM

ఉమ్మడి జిల్లాలో ఎంతోమంది సైబర్‌ మోసాలకు గురువుతున్నారు. సైబర్‌ కేటుగాళ్ల వలలో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆధునిక సాంకేతికత సాయంతో ఈ నేరగాళ్లు బరి తెగిస్తున్నారు. కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ప్రజల అత్యాశ, అమాయ కత్వం ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారు.

కొత్త పంథాలో మోసాలు

ఆధునిక సాంకేతిక సాయంతో రెచ్చిపోతున్న కేటుగాళ్లు

ఉమ్మడి జిల్లాలో రెండేళ్లలో రూ. 23.01 కోట్లు దోపిడీ

లబోదిబోమంటున్న బాధితులు

జియ్యమ్మవలస, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి)

- ‘హలో... మేము సీఎం కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీరు చేసిన ఓ మంచి పనికి రూ.50 వేలు బహుమతిగా పంపించాలనుకుంటున్నాం. మీ ఫోన్‌పే నెంబరు ఇవ్వండి. మీ ఫోన్‌ నెంబరుకు వచ్చిన ఓటీపీ చెపితే మీ ఖాతాలో డబ్బులు పడతాయి’ అని ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఓ వ్యక్తికి కాల్‌ వచ్చింది. అది నమ్మి ఓటీపీ చెబితే.. ఆయన ఖాతాలో డబ్బులన్నీ మాయమయ్యాయి.

- భోగాపురం మండలం లింగాలవలసకు చెందిన ఓ వ్యక్తి ఓ మనీ యాప్‌ వలలో పడి సుమారు రూ.9లక్షలు పొగొట్టుకున్నాడు.

- డ్రగ్స్‌ పార్సిల్‌ వచ్చిందని విజయనగరానికి చెందిన ఓ రిటైర్డ్‌ అధ్యాపకురాలకు ఓ ఫోన్‌ వచ్చింది. డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నామని బెదిరించి.. ఆమె అకౌంట్‌ నుంచి రూ.40 లక్షలను కాజేశారు. విషయాన్ని సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడంతో రూ.20 లక్షలు రికవరీ చేశారు.

- ముంబై సీబీఐ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని బొబ్బిలి పట్టణంలో ఓ ఉపాధ్యాయుడికి ఇటీవల ఫోన్‌ వచ్చింది. విదేశాల్లో ఉన్న మీ కుమారుడు హవాలా ద్వారా నగదు బదిలీ చేస్తున్నాడని తక్షణమే రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు తెలియజేస్తామని చెప్పడంతో వారు మరి ఫోన్‌ చేయలేదు.

... ఇలా ఉమ్మడి జిల్లాలో ఎంతోమంది సైబర్‌ మోసాలకు గురువుతున్నారు. సైబర్‌ కేటుగాళ్ల వలలో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆధునిక సాంకేతికత సాయంతో ఈ నేరగాళ్లు బరి తెగిస్తున్నారు. కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ప్రజల అత్యాశ, అమాయ కత్వం ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారు. బాధితులకు అనుమానం రాకుండా ఫోన్లలో బెదిరిస్తూ.. రూ.లక్షలు కాజేస్తున్నారు. ఏసీబీ, ఉన్నధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ ఫొటోలను డీపీలుగా పెట్టి బాధితులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత డ్రగ్స్‌, వీడియోలు, నల్లదనం, హవాలా తదితర అంశాల్లో కేసులు నమోదయ్యాయనో బెదిరించి.. తక్కువ పెట్టుబడికి అధిక లాభం ఇస్తామనో ఆశ చూపించి అందిన కాడికి దోచుకుంటున్నారు. దీంతో సామాన్యులే కాదు.. ఉద్యోగులు, యువత, వివిధ వర్గాల వారు బాధితులుగా మారుతున్నారు. ఇంటర్నెట్‌పై అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత వంటి అంశాల వల్ల ప్రజలు వారి ఉచ్చులో పడిపోతున్నారు. తరువాత అటు కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక, ఇటు పోలీస్‌ యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తే ఏమవుతుందోనన్న ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. గత రెండేళ్లలో ఉమ్మడి జిల్లా పరిధిలో రూ. 23.01 కోట్లు సైబర్‌ నేరగాళ్ల జేబుల్లోకి వెళ్లాయని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పోలీసులు ఈ తరహా నేరాలపై దృష్టి సారిస్తున్నా.. సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు.

సైబర్‌ ఆర్మీ పేరిట శిక్షణ

విశాఖ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి సైబర్‌ నేరాల అడ్డుకట్టకు మరో ముందడుగు వేశారు. సాయి తెలుగు సైబర్‌ ఆర్మీ పేరిట శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్‌ ఇస్తున్నారు. సైబర్‌ నేరాల విషయంలో పోలీసులు తీసుకోవలసిన మెళకువలు నేర్పిస్తున్నారు. అధునాతన సైబర్‌ నేర నిరోధక పరికరాలు కొనుగోలు చేసి తన పరిధిలో ఉన్న సిబ్బంది అందరితో వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫార్మ్‌లో వాట్సాప్‌, టెలిగ్రాం, ఇన్‌స్ట్రాగ్రాం, ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ట్విట్టర్‌, ఇమో, స్కై వంటి వాటి ద్వారా ఏ విధమైన ఫ్రాడ్‌ జరుగుతున్నాయి అనే వాటిపై వాటిని పట్టుకునే పరికరాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇలా చేయాలి..

- వాట్సాప్‌, టెలిగ్రాం గ్రూపుల్లో ఏపీకే యాప్‌ ఫైల్స్‌లో వచ్చిన లింక్‌లు క్లిక్‌ చేయరాదు.

- ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌లు వచ్చినా, రకరకాలుగా బెదిరింపు కాల్స్‌ వచ్చినా.. వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు గాని, డయల్‌ 1930 నెంబర్‌ను గాని సంప్రదించాలి.

- ఆధార్‌కార్డు గడువు ఎప్పుడూ ముగియదు. ఒకవేళ వ్యక్తిగత వివరాలు మార్చాలనుకుంటే ఆధార్‌ సెంటర్లకు వెళ్తే సరిపోతుంది.

- కరెంటు బిల్లులు కట్టాలని, లేకుంటే విద్యుత్‌ సరఫరా నిలిపేస్తామని ఎవరైనా ఫోన్‌ చేస్తే దానిని నమ్మరాదు. సమీప విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవాలి.

- రిమోట్‌ డెస్క్‌ యాప్‌లు చాలావరకు సైబర్‌ కేటుగాళ్ల చేతుల్లో ఉన్నాయి. అందువల్ల ఎటువంటి అపరిచిత యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయడం మంచిది కాదు.

- ఫేక్‌ లోన్‌ యాప్‌లకు దూరంగా ఉండాలి.

- ఈ-మెయిల్‌ హ్యాక్‌ అయ్యింది. వీడియోలు ఉన్నాయని బెదిరింపు కాల్స్‌ వస్తే వెంటనే డయల్‌ 100, 1930 112కు సమాచారం ఇవ్వాలి. లేకుంటే సమీప పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలి.

- అపరిచిత నెంబర్ల నుంచి వీడియో కాల్స్‌ వస్తే.. అవతలి వ్యక్తిని ముందుగా చూడాలి. వాళ్లు మీకు తెలిసిన వారే అని నిర్ధారించుకున్న తరువాత నేరుగా వీడియో కాల్స్‌ మాట్లాడొచ్చు.

- సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిందని ఎవరైనా చెబితే.. జిల్లాలో సంబంధిత అధికారిని కలిసి కన్ఫర్మ్‌ చేసుకుని సలహా తీసుకోండి.

- తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందొచ్చని ఎవరైనా ఫోన్‌ చేసినా.. యాప్స్‌ లింకులు వచ్చినా.. వెంటనే పోలీసులకు తెలియజేయాలి.

అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్‌లో వచ్చిన మెసేజ్‌లు , లింకులపై జాగ్రత్తగా ఉండాలి. బెదిరింపు కాల్స్‌ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. పోలీస్‌, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని, ఒకే రోజు ఎక్కువ మొత్తంలో నగదు డ్రా చేసే వారిపై నిఘా పెట్టాలని ఇటీవల ఎస్పీ మాధవరెడ్డి వారికి సూచించారు. నేరాలు తగ్గుముఖం పట్టేలా, బాధితులకు న్యాయం చేసేలా మా వంతు కృషి చేస్తున్నాం.

- టీవీ తిరుపతిరావు, సీఐ, చినమేరంగి

Updated Date - Dec 07 , 2024 | 12:42 AM