నేటి నుంచి వందేభారత్
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:21 AM
విశాఖ నుంచి దుర్గ్ వరకు నడవనున్న వందేభారత్ రైలు సోమవారం లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు వర్చువల్‌గా దీనిని ప్రారంభించనున్నారు. అయితే తొలిరోజు ఇది రాయగడ వరకు మాత్రమే నడుస్తుంది. 20వ తేదీ నుంచి రెగ్యులర్‌గా రాకపోకలు కొనసాగుతాయి.
పార్వతీపురంలో హాల్ట్
పార్వతీపురం, సెప్టెంబరు15(ఆంధ్రజ్యోతి): విశాఖ నుంచి దుర్గ్ వరకు నడవనున్న వందేభారత్ రైలు సోమవారం లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు వర్చువల్‌గా దీనిని ప్రారంభించనున్నారు. అయితే తొలిరోజు ఇది రాయగడ వరకు మాత్రమే నడుస్తుంది. 20వ తేదీ నుంచి రెగ్యులర్‌గా రాకపోకలు కొనసాగుతాయి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం మినహా ప్రతిరోజూ నడుస్తుంది. ఇందులో 16 బోగీలు, అందులో 14 చైర్ కార్, రెండు ఎగ్జికూటివ్ బోగీలు ఉంటాయి. ఈ రైలుకు పార్వతీ పురంలో హాల్ట్ ఇవ్వడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా దుర్గ్‌లో ఉదయం 5.45 గంటలకు ఈ రైలు బయలు దేరుతుంది. రాయ్‌పూర్, కరియార్ రోడ్డు, కంటాబంజి, టిట్లాగఢ్ ,కేసింగ, రాయగడ స్టేషన్‌లతో పాటు పార్వతీపురం, విజయనగరంలో ఆగి విశాఖపట్టణం చేరుకుంటుంది. పార్వతీ పురంలో ఉదయం 11.30 నిమిషాలకు వచ్చి 11.32 నిమిషాల వరకు ఆగుతుంది. తిరుగుపయనంలో విశాఖలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి పార్వతీపురంలో సాయంత్రం 4.36 గంటలకు వచ్చి 4.38 నిమిషాల వరకు ఆగుతుంది. రాత్రి 10.30 గంటలకు అది దుర్గ్ చేరుకుంటుంది. కాగా జిల్లావాసులు రాయగడ, రాయపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ రైలు సౌలభ్యంగా ఉంటుంది.
ఫలించిన ఎమ్మెల్యే కృషి
వాస్తవంగా వందేభారత్ ట్రైల్ రన్ నిర్వహించిన సమయంలో పార్వతీపురం, టౌన్ రైల్వే స్టేషన్‌లో రైలును నిలుపలేదు. దీనిపై స్పందించిన పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర విశాఖపట్నం లోని డీఆర్‌ఎం , రైల్వేశాఖ సహాయ మంత్రిని ఢిల్లీలో కలిసి సమస్యను వివరించారు. పార్వతీపురానికి హాల్ట్ ఇవ్వాలని కోరారు. దీనిపై రైల్వేశాఖ సహాయమంత్రి సానుకూలంగా స్పందించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పార్వతీపురంలో హాల్ట్ కల్పిస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తంగా ఎమ్మెల్యే కృషి ఫలించడంతో కూటమి శ్రేణులు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆనందంగా ఉంది
పార్వతీపురంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నిలిపే విధంగా రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న చర్యలు తీసుకోవడం ఆనం దంగా ఉంది. రైల్వేశాఖ ఉన్నతాధికారులు కూడా సహకరిం చారు. పార్వతీపురంలో వందేభారత్ హాల్ట్ కోసం చేసిన ప్రయత్నం విజయవంతమవడం సంతోషంగా ఉంది.
బోనెల విజయచంద్ర, ఎమ్మెల్యే, పార్వతీపురం
===================================
స్వాగత ఏర్పాట్లు చేస్తున్నాం..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదట విడుదల చేసిన షెడ్యూల్‌లో పార్వతీపురంలో స్టాప్ లేదు. ఆ తర్వాత స్టాఫ్ ఉన్నట్టు ఆదేశాలు వచ్చాయి. ఇందు కోసం ప్రయత్నించిన ఎమ్మెల్యే విజయచంద్రకు అభినందనలు. పార్వతీపురం వస్తున్న ట్రైన్‌కు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
- శ్రీనివాసరావు, స్టేషన్ మాస్టారు, బెలగాం రైల్వేస్టేషన్, పార్వతీపురం
Updated Date - Sep 16 , 2024 | 12:21 AM