ఏఎంసీల పీఠం దక్కేదెవరికో?
ABN, Publish Date - Nov 17 , 2024 | 11:14 PM
జిల్లాలో తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. అయితే జిల్లాకు చెందిన వారికి ఎటువంటి పదవులు లభించలేదు. ఈ నేపథ్యంలో కూటమి సీనియర్ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీలపై దృష్టి సారించారు.
మంత్రి, ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం ఆరాటం
నామినేటెడ్ పదవులపై కొరవడిన స్పష్టత
నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ
పార్వతీపురం, నవంబరు17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. అయితే జిల్లాకు చెందిన వారికి ఎటువంటి పదవులు లభించలేదు. ఈ నేపథ్యంలో కూటమి సీనియర్ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీలపై దృష్టి సారించారు. ఏఎంసీల పీఠాల కోసం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణల ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఎవరికి నామినేటెడ్ పదవులు వరిస్తాయన్న దానిపై ఇంతవకు ఎటు వంటి స్పష్టత లేకపోవడంతో శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాలు ఉన్నాయి. వాటికి అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు ఒక్కో కమిటీకి ఐదు నుంచి ఆరు డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు ఏఎంసీలకు తెలుగు తమ్ముళ్లే నామినేటెడ్ అయ్యేవారు. అయితే ఈసారి జనసేన, బీజేపీ నాయకులకు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో చోటు దక్కనుంది. కాగా సాలూరుకు సంబంధించి మంత్రి సంధ్యారాణి, పార్వతీపురం, కురుపాం, పాలకొండలో ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణల సిఫారసుల మేరకే ఏఎంసీల పీఠం వరించే అవకాశం ఉంది.
తోటపల్లి దేవస్థానం చైర్మన్ ఎవరు?
- జిల్లాలో తోటపల్లి దేవస్థానం చైర్మన్ పదవి ఎవరికి లభిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఈ పర్యాయం ఈ పదవి దక్కిన వారిపై కీలక బాధ్యతలు ఉంటాయని చెప్పొచ్చు. రెండో తిరుపతిగా పేరొందిన తోటపల్లి వేంకటేశ్వర దేవస్థానం గత వైసీపీ ప్రభుత్వకాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. టీటీడీ సహకారంతో అభివృద్ధి చేసే పరిస్థితి ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో దేవస్థానం పూర్వ వైభవానికి ప్రస్తుత పాలకమండలి కృషి చేయాల్సి ఉంది. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత చైర్మన్‌పై ఉంది. దాతల విరాళాలతో సాగుతున్న దేవస్థానం పునర్నిర్మాణ పనులపై దృష్టి సారించాల్సి ఉంది.
- పార్వతీపురంలో సత్యనారాయణస్వామి ఆలయంతో పాటు గాంధీ సత్రం తదితర వాటికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్యక్ష పదవులను కేటాయించారు. తాజాగా ఇప్పుడు ఆ పదవులు ఎవరికి దక్కుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Nov 17 , 2024 | 11:14 PM