ఇష్టారాజ్యంగా ఇచ్చేశారు!
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:29 AM
జిల్లాలో కొంతమంది అనర్హులు సామాజిక పింఛన్లు పొందు తున్నారు. దీంతో అర్హులకు అన్యాయం జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా మంజూరు చేసిన ఇటువంటి పింఛన్లపై విచారణ జరపాలని ఎంతోమంది కోరుతున్నారు.
అర్హులకు తీరని అన్యాయం
ప్రజా పరిష్కార వేదికకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
విచారణలో జిల్లా అధికారులు
పార్వతీపురం, అక్టోబరు20 (ఆంధ్రజ్యోతి)
- గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన 40 మందికి గతంలో దివ్యాంగుల పింఛను మంజూరు కాగా, వారిలో 17 మందిని తొలగించారు. అయితే మిగిలిన వారికి అర్హత లేనప్పటికీ పింఛన్లు పొందుతున్నారు. దీనిపై గత నెల 12న కలెక్టరేట్ ప్రజా సమస్య పరిష్కార వేదికలో అదే గ్రామానికి చెందిన కొంతమంది ఫిర్యాదు చేశారు.
- అదే మండలం బురద వెంకటాపురం గ్రామానికి చెందిన అక్కేన సూర్యనారాయణ అనే వ్యక్తి అర్హత లేనప్పటికీ దివ్యాంగుల పింఛను పొందుతున్నట్లు సామాజిక తనిఖీ సిబ్బంది జూలై 9న ప్రకటించారు. అయితే దీనిపై ఇప్పటివరకు విచారణ పూర్తికాలేదు.
- పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో అనేక మంది అర్హత లేని వారు దివ్యాంగుల పింఛను పొందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇటువంటి పింఛన్లపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని గత నెల 3న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అధికారులకు లేఖ రాశారు.
..ఇలా జిల్లాలో కొంతమంది అనర్హులు సామాజిక పింఛన్లు పొందు తున్నారు. దీంతో అర్హులకు అన్యాయం జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా మంజూరు చేసిన ఇటువంటి పింఛన్లపై విచారణ జరపాలని ఎంతోమంది కోరుతున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో 61 ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సిబ్బంది రంగంలోకి దిగారు. అర్హులకు మాత్రమే పింఛన్లు అందేలా విచారణ చేపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
పార్టీలకతీతంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేశామని గత వైసీపీ సర్కారు గొప్పగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అర్హత లేని వారికే అత్యధికంగా పింఛన్లు మంజూరు చేశారన్నది కాదనలేని వాస్తవం.
రెండు శాతం దివ్యాంగుల పింఛన్లు..
- జిల్లాలో సుమారు 9.25 లక్షల జనాభా ఉండగా ఇందులో 16,857 మంది ( 1.83 శాతం) దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారు. సుమారు రెండు శాతం ప్రజలకు దివ్యాంగుల పింఛన్లు అందుతున్నాయని అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వారిలో అనర్హులే అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు, ప్రజాప్రతి నిధులు ఓట్లు కోసం పలు పంచాయ తీల్లో అడ్డగోలుగా సామాజిక పింఛన్లు మంజూరు చేయించారు. దివ్యాంగులు, చెప్పులు కుట్టే వారు, డప్పు కార్మికులు, కళాకారుల పేరిట అనర్హులకు సామాజిక పింఛన్లను అందించారనే ఆరోపణలున్నాయి. దీనివల్ల గత ఐదేళ్లలో ఎంతోమంది అర్హులు పింఛన్లకు నోచుకోలేదు.
- చర్మకారులు, చెప్పులు కుట్టేవారి పేరు చెప్పి జిల్లాలో 1,855 మందికి, డప్పు కళాకారుల పేరిట కూడా సుమారు 1,766 మందికి పింఛన్లు అందిస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో ఇంత పెద్ద సంఖ్యలో వారు ఉన్నారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. గత ఐదేళ్లలో వారి పేరు చెప్పి అన ర్హులకు పెద్దఎత్తున పింఛన్లు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
పింఛన్ల పంపిణీ ఇలా..
జిల్లాలో ప్రస్తుతం 1,42,393 మందికి ప్రతినెలా పింఛన్ల రూపంలో రూ.59.19 కోట్లు అందిస్తున్నారు. ఓఏపీ 77,665, వేవర్స్ 758, దివ్యాంగులు 16,857, వితంతవులు 34,502, తాడి టాపర్స్ 192, ట్రెడిషనల్ క్యాబర్స్ 1855, అభయ హస్తం పథకం కింద 4,575, ట్రాన్స్‌జెండర్స్ 126 మందికి పింఛన్లు అందిస్తున్నారు. అదేవిధంగా మత్స్యకారులు 808, ఒంటరి మహిళలు 2,352, డప్పు కళాకారులు 1,766, కళాకారులు 129, సైనిక్ వెల్ఫేర్ కింద ముగ్గురు, అమరావతి ల్యాండ్లెస్ ఫర్ పూర్ కింద ఒకరు వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 656 మందికి, సీకేడీ యువ కింద 148 మందికి పింఛన్లు అందజేస్తున్నారు. అయితే వారిలో అనర్హులే అత్యధికంగా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సి ఉంది.
విచారణకు ఆదేశించాం..
వివిధ రకాల సామాజిక పింఛన్లకు సంబంధించి ఇప్పటివరకు 61 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారణ చేయాలని ఎంపీడీవోలను ఆదే శించాం. నివేదికలు అందిన తర్వాత అర్హత లేని వారి పింఛన్లను నిబంధనల ప్రకారం తొలగిస్తాం.
- సత్యంనాయుడు, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ, పార్వతీపురం మన్యం
Updated Date - Oct 21 , 2024 | 12:29 AM