వలంటీర్ల వ్యవస్థ వైసీపీ హయాంలోనే రద్దు
ABN, Publish Date - Nov 21 , 2024 | 04:56 AM
రాష్ట్రంలో ప్రస్తుతం వలంటీర్లు లేరు. వైసీపీ ప్రభుత్వం 2023 ఆగస్టు వరకే వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తూ జీవో ఇచ్చింది.
వారిని కొనసాగిస్తూ జగన్ జీవో ఇవ్వలేదు
లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తాం: మంత్రి డోలా
మండలిలో వైసీపీ నిరసనలకు సమాధానం
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ప్రస్తుతం వలంటీర్లు లేరు. వైసీపీ ప్రభుత్వం 2023 ఆగస్టు వరకే వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తూ జీవో ఇచ్చింది. సెప్టెంబరు 2023లో వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదు. అంటే వారు ఉనికిలో లేరు. కాబట్టే కొనసాగించలేకపోతున్నాం. లేని పిల్లవాడికి పేరు ఎలా పెడతాం?’ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ‘గ్రామ, వార్డు వలంటీర్లను రెన్యువల్ చేయకుండా మోసం చేసింది జగనే. ప్రస్తుత ం రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదు. ఉనికిలో లేని వలంటీర్లతో ఎన్నికల ముందు ఫేక్ రాజీనామాలు చేయించారు. గత ప్రభుత్వం వలంటీర్లను కొనసాగించి ఉంటే మేం వారిని ఉంచి వేతనాలు పెంచేవాళ్లం. ఆ వ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది. కాబట్టే వలంటీర్ల కొనసాగింపు అంశాని సమగ్రంగా పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. వైసీపీ సభ్యుల తీరు దొంగే దొంగ అన్నట్లు ఉంది. వారిని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వమే’ అని మంత్రి ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయం కాబట్టి..: బొత్స
ఈ సందర్భంగా మండలిలో వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ‘ఎన్నికల ముందు వలంటీర్లకు రూ.ఐదు వేలు కాదు రూ.10 వేలు గౌరవ భృతి ఇస్తామన్నారు. ఇస్తారా? లేదా? ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలలు కొనసాగిస్తూ జీవో ఇవ్వలేకపోయి ఉండవచ్చు. మీరు కొనసాగించొచ్చుకదా?’ అని ప్రశ్నించారు.
వలంటీర్లకు న్యాయం చేయాలి: ఎమ్మెల్సీ కల్యాణి
వలంటీర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అమరావతి అసెంబ్లీ మీడియాతో పాయింట్‌లో వరుదు కల్యాణి మాట్లాడుతూ... ‘ఎన్నికలప్పుడు చంద్రబాబు వలంటీర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో వరదలప్పుడు నష్టం అంచనాలకు వలంటీర్ల సేవలు ఉపయోగించుకున్న ఈ ప్రభుత్వం ఇప్పుడేమో చాలా మంది వలంటీర్లు రాజీనామా చేశారని, గత ప్రభుత్వం వలంటీర్ల సేవలను పొడిగించలేదని అంటోంది. ప్రభుత్వ తీరుతో 2.60 లక్షల వలంటీర్లు రోడ్డున పడ్డారు’ అని అన్నారు. సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎన్నికల్లో కూటమి నేతల హామీ ప్రకారం వలంటీర్లకు న్యాయం చేయాలని కోరారు. వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, బాలికల వసతి గృహాల వద్ద మహిళా సిబ్బందితో భద్రత కల్పించాలని కోరారు. కల్పలతారెడ్డి మాట్లాడుతూ, కర్నూలులోని లోకాయుక్త, హెచ్‌ఆర్సీ, వక్ఫ్‌బోర్డు కార్యాలయాలను ప్రభుత్వం తరలించడం సరికాదన్నారు. ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Nov 21 , 2024 | 04:56 AM