Reservoirs : కరువు తీరేలా జలాలు
ABN, Publish Date - Aug 18 , 2024 | 04:09 AM
గడచిన రెండేళ్లు కరువుతో అల్లాడిపోయిన రాష్ట్రానికి ఊరట లభించింది. నదులు, ప్రాజెక్టుల్లో కరువు తీరేలా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి.
నిండు కుండల్లా ప్రధాన జలాశయాలు
పరవళ్లు తొక్కుతున్న కృష్ణా, గోదావరి
జగన్ పాలనలో చివరి రెండేళ్లూ వర్షాభావమే
పైగా బాబు వస్తే కరువు వస్తుందని దుష్ప్రచారం
తిరిగి ఇప్పుడు జల వ్యవస్థలకు ప్రాణం
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): గడచిన రెండేళ్లు కరువుతో అల్లాడిపోయిన రాష్ట్రానికి ఊరట లభించింది. నదులు, ప్రాజెక్టుల్లో కరువు తీరేలా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. జలాశయాల్లో రెట్టింపు నిల్వలున్నాయి. నాగార్జునసాగర్ గరిష్ఠ నీటినిల్వ 312.05 టీఎంసీలకుగాను దాదాపు 312.04 టీఎంసీల నిల్వఉంది. ఇది రికార్డే. కృష్ణా నదీ జలాలు ఈ ఏడాది రైతుకు గొప్ప ఊరటని ఇస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు వస్తుందంటూ జగన్‌తో పాటు .. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గతంలో ఊదరగొట్టారు. గత జగన్ ప్రభుత్వంలో చివరి రెండేళ్లూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా.. కరువు మండలాలను తొలుత ఆయన ప్రకటించలేదు. చివరి ఎన్నికల ఏడాది మొదట్లో తూతూమంత్రంగా అక్కడక్కడ కొన్నింటిని ప్రకటించారు. తన పాలనలో కరువు ఉండదని రాజకీయ ప్రకటనలు చేసుకునేందుకు జగన్ తాపత్రాయపడ్డారు. ఆ అవసరం కొత్త ప్రభుత్వానికి లేకుం డా.. జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యానికి దాదాపు సరిసమానంగా రికార్డుస్థాయిలో నిల్వలు ఉండటం అపురూపమేనని జలవనరుల శాఖ ఇంజనీర్లు కూడా అంగీకరిస్తున్నారు. మేజర్ రిజర్వాయర్లలో గరిష్ఠస్థాయిలో 865.64 టీఎంసీలకుగాను 641.13 టీఎంసీల నిల్వ కనిపిస్తోంది. మీడియం ప్రాజెక్టుల్లో 115.09 టీఎంసీల గరిష్ఠ నిల్వకు గాను 51.72 టీఎంసీల జలం అందుబాటులో ఉంది. ఇతర నీటి వనరుల్లో 1.62 టీఎంసీలకుగాను ..0.16టీఎంసీలున్నాయి. మొత్తంగా 983.49 టీఎంసీలకుగాను 693.02టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి.
నదుల వారీగా...
గోదావరి జలాలు 5.8టీఎంసీలకుగాను శనివారం నాటికి 4.59 టీఎంసీలు ఉన్నాయి. కృష్ణాలో గరిష్ఠంగా 589.67 టీఎంసీలకుగాను దాదాపు 559.67 టీఎంసీల నిల్వ ఉంది. పెన్నాలో 239.59 టీఎంసీలకుగాను 77.57 టీఎంసీల నిల్వలు కనిపిస్తున్నాయి. ఇతర నదుల్లో 148.33 టీఎంసీలకు గాను శనివారం నాటికి 51.18 టీఎంసీల నిల్వ ఉంది.
జలాశయాల వారీగా..
శ్రీశైలం డ్యాంలో 215టీఎంసీలకుగాను శనివారం నాటికి 195.21 టీఎంసీల నిల్వఉంది. ఎగువ నుంచి 86,517 క్యూసెక్కులు వస్తుండగా, దిగువన సాగర్‌కు 1,00,972 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌కు చేరుతున్న వరద 63,369 క్యూసెక్కులను బయటకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 45.77టీఎంసీలకుగాను 44..69 టీఎంసీల నిల్వ ఉంది. ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ నిల్వ 3.07 టీఎంసీలకుగాను పూర్తి నీటినిల్వలు ఉన్నాయి. ఈ బ్యారేజీలోకి 32,305క్యూసెక్కులు వస్తుంటే.. 32,226 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. తుంగభద్ర నుంచి సుంకేశుల బ్యారేజీకి 62,820క్యూసెక్కులు వస్తుంటే.. 62799 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరినదిపై నిర్మించిన సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజీ గరిష్ఠ నీటి నిల్వ 2.93 టీఎంసీలు పూర్తిగా నిండిపోయాయి. బ్యారేజీలోకి వస్తున్న 2,16,001 వరదను పూర్తిగా వదిలేస్తున్నారు.
Updated Date - Aug 18 , 2024 | 05:41 AM