కల్తీ నెయ్యి దోషాన్ని తొలగించాం
ABN, Publish Date - Sep 23 , 2024 | 03:51 AM
తిరుమలలో కలకలం రేపిన కల్తీ నెయ్యి దోషాన్ని గత నెల ఆగస్టులో సంప్రోక్షణతో పోగొట్టామని, భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు వెల్లడించారు.
గత నెలలోనే సంప్రోక్షణతో శుద్ధి
నేడు ఆలయంలో శాంతి హోమం
అలాగే పంచగవ్య ప్రోక్షణ చేస్తాం
భక్తులెవరూ ఆందోళన చెందొద్దు
స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం: ఈవో
తిరుపతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో కలకలం రేపిన కల్తీ నెయ్యి దోషాన్ని గత నెల ఆగస్టులో సంప్రోక్షణతో పోగొట్టామని, భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు వెల్లడించారు. ఆదివారం రాత్రి తిరుపతిలో పద్మావతి రెస్ట్ హౌస్‌లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు మోహనరంగాచార్యులు, రామకృష్ణ దీక్షితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘తిరుమల ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో తెలుసో తెలియక జరిగే దోష నివారణకు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఆగస్టులోనే ఆలయంలో అన్న ప్రసాదపోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేశాం. అందులోని కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను సమర్పించాం. కల్తీ నెయ్యి వలన ఏమైనా దోషాలు ఉండుంటే కూడా తొలగిపోయాయి. అయినప్పటికీ భక్తుల్లో నెలకొన్న ఆందోళన దృష్ట్యా ఆగమశాస్త్ర పండితులు, పెద్దజియ్యంగార్లను సంప్రదించిన తర్వాత సీఎం చంద్రబాబు శ్రీవారి ఆలయంలో ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతిహోమం చేస్తున్నాం. శ్రీవారి ఆలయంలోని యాగబావి వద్ద యాగశాలలో, మూడు హోమగుండాలు (వాస్తు, సభ్యం, పౌండరీక) ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని ఆలయాల్లో పంచగవ్య ప్రోక్షణ చేయనున్నాం’ అని ఈవో వివరించారు.
గత కొన్ని రోజులుగా టీటీడీ కొనుగోలు చేసే ఆవు నెయ్యి విషయంలో ఎన్డీడీబీ నివేదికలో కల్తీ విషయం రావడం, హిందువుల మనోభావాల దెబ్బతినడం చూశామన్నారు. ఆవు నెయ్యి తీసుకునేవిధానంలో మార్పు తీసుకొచ్చామని టీటీడీ తరపున భక్తులందరికీ తెలియజేస్తున్నామని అన్నారు. ‘మంచి పేరున్న సంస్థల నుంచి మాత్రమే ఆవు నెయ్యి కొంటున్నాం. అది కూడా రూ.475కే. నందిని, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ పేరెన్నిక సంస్థలు. వీటిని పరీక్షించారు. చాలా కరెక్టుగా ఉన్నాయి. ఇప్పటికే ఎన్‌ఏబీఎల్‌కు శాంపిల్స్ పంపే విధానం మెదలైంది. ఆ ప్రక్రియను కొనసాగిస్తాం. అక్కడే జంతువుల కొవ్వు ఉందో లేదో పరీక్ష జరుగుతుంది. తిరుమలలో ఇదివరకు అలాంటి పరీక్షలు జరగలేదు. ఇక్కడ సాధారణ పరీక్షలు చేసే సామర్థ్యం మాత్రమే ఉంది. 18మందితో సెన్సరీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశాం. మైసూరులో శిక్షణ పొందిన ల్యాబ్ నిపుణులు ఇందులో ఉంటారు. జీరో నుంచి 9 వరకు రేటింగ్‌లో కనీసం 7 పాయింట్ల రేటింగ్ ఉండే ఆవు నెయ్యినే ఆమోదిస్తున్నాం. ఎన్డీడీబీ ముందుకొచ్చి విరాళంగా సుమారు రూ.75 లక్షల విలువగల టెస్టింగ్ యంత్రాన్ని తిరుమలలో ఏర్పాటుచేస్తున్నాం. అది మూడు నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తిరుమలలో ఎఫ్‌ఎ్‌సఎ్‌సఐ ల్యాబ్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చారు. ఇప్పటికే వారికి బిల్డింగ్ కూడా చూపించాం. తిరుమలలో స్వచ్ఛమైన నెయ్యితోనే లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తున్నాం. యాత్రికులు ఎలాంటి భయాందోళనలు చెందవద్దు’ అని ఈవో శ్యామలరావు భక్తులను కోరారు.
Updated Date - Sep 23 , 2024 | 03:51 AM