Andhra Pradesh: అమరావతికి వచ్చేస్తాం..!
ABN, Publish Date - Jul 06 , 2024 | 04:11 AM
అమరావతి రాజధానిలో సంస్థల ఏర్పాటు అంశాన్ని సీఆర్‌డీఏ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది.
రాజధానికి వచ్చేందుకు 80 శాతం సంస్థలు రెడీ
ముందుకొచ్చిన 104 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు సంస్థలు
వాటికి కేటాయించిన భూములపై యుద్ధప్రాతిపదికన చర్యలు
విజయవాడ, జూలై 5(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో సంస్థల ఏర్పాటు అంశాన్ని సీఆర్‌డీఏ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది. అమరావతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 130 సంస్థలకు భూములు కేటాయించారు. సీఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం వాటి యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇక్కడ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు.. వంటి అంశాలపై చర్చిస్తోంది. కార్యాలయాల ఏర్పాటుపై శుక్రవారం నాటికి 80శాతం సంస్థల నుంచి సానుకూలత వచ్చిందని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 25కుపైగా సంస్థల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని సంస్థలు వైసీపీ ప్రభుత్వ హయాంలో బెదిరింపుల కారణంగా తరలిపోవటంవల్ల వాటినుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అమరావతిలో సంస్థల ఏర్పాటు నిమిత్తం మొత్తం 130 సంస్థలకు 1,660 ఎకరాలు కేటాయించారు. అప్పట్లో ఆయా సంస్థలకు కొన్ని లీజు ప్రాతిపదికన, మరికొన్ని అవుట్‌రేట్ సేల్ ప్రాతిపదికన రూ.677.10కోట్ల విలువైన భూములు కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.546కోట్ల మేర ఆయా సంస్థలు చెల్లింపులు చేశాయి. మరో రూ.131కోట్లు చెల్లించాల్సి ఉంది. రాజధానిలో 45 కేంద్ర సంస్థలకు భూములు కేటాయించగా.. వాటిలో తాజాగా 40 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 25 సంస్థలకు భూములు కేటాయించగా దాదాపు వాటన్నింటి నుంచీ సానుకూలత వచ్చింది. మరికొన్ని ప్రైవేటు సంస్థలు సానుకూలంగా స్పందించాయి. మొత్తానికి మరో వారం రోజుల్లో అమరావతిలో ఏర్పాటు కాబోయే సంస్థల మీద స్పష్టత వస్తుంది. రెండు నెలల్లో అవి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ అధికారులు భావిస్తున్నారు.
Updated Date - Jul 06 , 2024 | 08:17 AM