Visakhapatnam: ఎల్‌నినో బలహీనం నైరుతి రుతుపవనాలకు అనుకూలం..
ABN, Publish Date - Apr 29 , 2024 | 04:43 AM
ప్రపంచంలో అనేక దేశాల్లో కరువు, ఎండలు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నమోదుకు కారణమైన ఎల్‌నినో చివరి దశకు చేరుకుంది.
మే తొలి వారానికి తటస్థ పరిస్థితులు!
జూలై నెలాఖరుకల్లా పూర్తిస్థాయి లానినా
ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ విశ్లేషణ
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో అనేక దేశాల్లో కరువు, ఎండలు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నమోదుకు కారణమైన ఎల్‌నినో చివరి దశకు చేరుకుంది. గతేడాది అక్టోబరు నాటికి తీవ్రస్థాయికి చేరిన ఎల్‌నినో తర్వాత క్రమేపీ బలహీనపడుతూ వస్తోంది. వచ్చే నెల తొలి వారం నాటికి తటస్థ పరిస్థితులకు చేరుకోనుంది. ఈ విషయాన్ని అమెరికా వాతావరణ అంచనా కేంద్రం తాజా నివేదికలో పేర్కొంది. ఎల్‌నినో కథ ముగిసిందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. అటు ఆస్ట్రేలియా, ఇటు అమెరికా వాతావరణ శాఖల నివేదికలను భారత్‌కు చెందిన ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ విశ్లేషించి తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం జూలై తర్వాత పూర్తిస్థాయి లానినా పరిస్థితులు ఏర్పడనున్నాయి.
నైరుతి సీజన్‌లో మంచి వర్షాలు
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలను అంచనా వేసే సూచిక నినో (ఓషియానిక్ నినో ఇండెక్స్) 3.4 రాబోయే రెండు వారాల్లో 0.5 డిగ్రీలు అంతకంటే తక్కువకు చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా ‘సదరన్ ఆస్లేషన్ ఇండెక్స్’ కూడా దాదాపు ఇలాంటి అంచనాకు వచ్చింది. ఉష్ణ మండల పసిఫిక్ మహాసముద్రంలో పవనాలు సాధారణంగా ఉంటాయని అమెరికా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మే తొలి వారంలో ఎల్‌నినో బలహీనపడి తటస్థ పరిస్థితులకు చేరుకుంటుందని, దీని ప్రభావంతో భారత్‌లో నైరుతి రుతుపవనాల సమయంలో మంచి వర్షాలు కురుస్తాయని స్కైమెట్ పేర్కొంది.
అసంగతమైన (ప్లస్ ఆర్ మైన్‌సను లెక్కించే ఎనామిలిస్) సముద్ర ఉష్ణోగ్రతలకు సంబంధించి నినో 3.4 సూచిక ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు గల మూడు నెలల కాలంలో ‘ప్లస్ 1.52 డిగ్రీలు సెల్సియస్’ ఉండగా మార్చి ఒక్క నెలలో ప్లస్ 1.24కు తగ్గింది. ఇది ఈనెల 22 నాటికి మరింత తగ్గి ప్లస్ 0.7కు చేరుకుంది. వచ్చే నెల తొలి వారంలో ఎల్‌నినో పూర్తిగా బలహీనపడి తటస్థ పరిస్థితులకు చేరుకుంటుందని అంచనా వేసింది.
ఇదిలావుండగా ప్రస్తుతం క్షీణదశలో ఉన్న ఎల్‌నినో వచ్చేనెల నాటికి తటస్థ పరిస్థితులకు చేరుకున్నా వేసవి సీజన్‌లో దేశంలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ రిటైర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే పసిఫిక్ మహాసముద్రంలో మారిన పరిస్థతుల ప్రభావంతో ఆ దిశ నుంచి వచ్చే చల్లని గాలులతో నైరుతి ఆశాజనకంగా ఉంటుందన్నారు.
Updated Date - Apr 29 , 2024 | 05:02 AM