ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బలహీనంగా భావి పౌరులు..!

ABN, Publish Date - Nov 29 , 2024 | 12:37 AM

నేటి బాలలే రేపటి పౌరులు. ఈ దేశం వారిదే. వారి భవిష్యత్తు బాగుంటే దేశం బాగుంటుందని అంటారు. అందుకని ప్రభుత్వాలు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి.

జిల్లా వ్యాప్తంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం

వయసుకు తగ్గట్లు ఎదుగుదల లేనివాళ్లు దాదాపు 15 వేలు

12 వేల మందికి పోషకాహార లోపం

స్పష్టంగా కానవస్తున్న అధికారుల పర్యవేక్షణ లోపం

నంద్యాల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నేటి బాలలే రేపటి పౌరులు. ఈ దేశం వారిదే. వారి భవిష్యత్తు బాగుంటే దేశం బాగుంటుందని అంటారు. అందుకని ప్రభుత్వాలు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ చర్యలు క్షేత్ర స్థాయిలో సరిగా అమలు కావడం లేదు. వయసుకు తగ్గట్టు పిల్లలు ఎదగడం లేదు. వేల సంఖ్యలో పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ఇటీవల వెలువడిన ప్రపంచ ఆకలి సూచీ - 2024లో మన దేశం 105వ స్థానంలో నిలిచింది. ఈ దుస్థితి జిల్లాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేక, పోషకాహార లోపంతో బాధపడుతూ మరణిస్తున్న ఐదేళ్ల లోపు పిల్లల సంఖ్య ఆధారంగా తయారైన ఆకలి సూచీ - 2024 వెలువడింది. దీని ప్రకారం జిల్లాలో బాలల పరిస్థితిని పరిశీలిస్తే ఐదేళ్ల లోపు పిల్లల మరణాల అంశంలో తప్పించి మిగిలిన మూడింట క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లలు 1,12,460 మంది ఉన్నారు. వీరిలో వయసుకు తగ్గ ఎదుగుదల లేని పిల్లల సంఖ్య 14,920. ఇది మొత్తం సంఖ్యలో 13.3 శాతం. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్యను పరిశీలిస్తే 12,087 మంది ఉన్నారు. శాతం పరంగా చూస్తే 10.77 శాతంగా కనిపిస్తోంది. సంఖ్యాపరంగా చూసుకున్నా, శాతం పరంగా చూసుకున్నా ఈ స్థాయిలో పిల్లలు బలహీనంగా ఉన్నారంటే అధికారులు పౌష్టికాహారాన్ని అందించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు శాతం పరంగా 2.94 శాతం ఉన్నా, సంఖ్య పరంగా చూసుకుంటే 3301 మంది ఉన్నారు. ఇక ఐదేళ్ల లోపు పిల్లల మరణాల సంఖ్య మాత్రమే పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేని విధంగా ఉంది. జిల్లా శిశు, మహిళా సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు తాము మెరుగైన పనితీరు కనబరుస్తున్నామని చెబుతున్నారు. కానీ పై అంశాలను పరిశీలిస్తే వారి పనితీరు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫ పట్టించుకోవటం లేదా..?

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 3,549 అంగనవాడీ కేంద్రాలుండగా, నంద్యాల జిల్లాలో 1663 ఉన్నాయి. వీటితో పాటు మినీ అంగనవాడీ కేంద్రాలు కూడా ఉన్నాయి. నంద్యాల జిల్లా వరకు చూసుకుంటే 5 ఏళ్లలోపు పిల్లలతో పాటు గర్భిణులు 11,967 మంది, బాలింతలు 10,665 మంది ఉన్నారు. వీరికి పౌష్టికాహారం అంగనవాడీ కేంద్రాల నుంచే అందుతున్నది. వాస్తవానికి అంగనవాడీ కేంద్రాలకు వెళ్లి పౌష్టికాహారం తీసుకునే వారి సంఖ్య ఎంత అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాల వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకొని బలవర్థకమైన ఆహారం తీసుకునే శక్తి ఉంటుంది. దిగవ మధ్య తరగతి, పేద వర్గాల్లోని వారు మాత్రమే అంగనవాడీ కేంద్రాల్లో ఇచ్చే ఆహారం మొదలైనవి తీసుకుంటారు. ఈ లెక్కన అంగనవాడీ కేంద్రాల్లో నమోదు అయిన బాలల సంఖ్యతో పోల్చి చూస్తే ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎదుగుదల, పోషకాహార లోపం వంటి అంశాలతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. నమోదైన సంఖ్య కంటే తక్కువ సంఖ్యలో ఉన్న వారిని పర్యవేక్షించాల్సిన అధికారుల తీరువల్లే పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫ చెంచుగూడేల్లో మరింత అధ్వానం..

నంద్యాల జిల్లాలో దాదాపు 46 చెంచుగూడేలు ఉన్నాయి. పోషకాహార లోపం, తదితర అంశాలకు సంబంధించి ఎక్కువ సమస్యలు ఇక్కడే ఉన్నాయన్న విమర్శలున్నాయి. ఈ గూడేలలో నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, అనారోగ్యం, పేదరికం, అవగాహన లేమి మొదలైనవి పిల్లల్లో పోషకాహాక లోపానికి కారణాలు అని తెలుస్తున్నాయి. మహిళలు చిన్న వయసులోనే గర్భం దాల్చితే నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం ఉంది. ఇలా పుట్టిన పిల్లలు అనేక రుగ్మతలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూలీ పనులు చేసే వారు పేదరికం, నిరక్ష్యరాస్యత, అవగాహన లేక చిన్నారులకు పోషకాహారం అందడం లేదు. వలస కూలీల పిల్లల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులున్న చోట అంగనవాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్‌ అధికారులు పర్యవేక్షణ సక్రమంగా ఉండాలి. కానీ చాలా చోట్ల అంగనవాడీ కేంద్రాల్లో సరైన ఆహారాన్ని అందటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని అవగాహన కల్పించటంలో విఫలమవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఫ ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదట..

జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగనవాడీ కేంద్రాల ద్వారా పోషకాహారానికి ప్రభుత్వం నెలకు దాదాపు రూ.75 లక్షల పైనే ఖర్చు చేస్తున్నట్లు అంచనా! ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టినా దానిని ప్రజల్లోనికి బలంగా తీసుకువెళ్లాల్సింది అధికారులే! ఈ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు అంగనవాడీల ద్వారా ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందన్న దానిపైన సంబంధిత అధికారులకు కనీసం అవగాహన లేదంటే అశ్చర్యం కలగకమానదు. అవన్నీ ప్రభుత్వాలు చూసుకుంటాయని, తమ పని సక్రమంగా ప్రజలకు అందివ్వటమేనన్నది అధికారులు వాదన! ఈ పని కూడా అధికారులు సక్రమంగా చేయడం లేదు. జిల్లాలో పోషకాహార లోపానికి సంబంధించిన గణాంకాలు ఇంత దిగదుడుపుగా ఎందుకుంటాయన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.

ఫ పక్కదారి పడుతున్నాయి..

జిల్లాలో అంగనవాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహార పదార్ధాలు సక్రమంగా అందుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలాచోట్ల పిల్లలకు కేవలం అన్నం, పప్పు మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గుడ్లు కూడా రోజూ పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక చాలా చోట్ల సరుకులు పక్కదారి పడుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. అంగనవాడీ సెంటర్లకు వచ్చే నూనె నుంచి చిక్కీలు, పాల ప్యాకెట్ల వరకు అక్కడి వారు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా కేంద్రాల్లో నమోదైన పిల్లల సంఖ్యకు వాస్తవ సంఖ్యకు తేడా ఉంటోందని, నమోదైన సంఖ్య పరంగా వచ్చే పదార్థాలను అమ్ముకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అంగనవాడీ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన అధికారులు సక్రమంగా పట్టించుకోకపోవటంతో ఇలా జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వెరసి పిల్లల ఎదుగుదల ప్రమాదంలో పడిపోయింది. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందన్న దానిపైన ఆరా తీసి, పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలనే అభిప్రాయం వినిపిస్తోంది.

Updated Date - Nov 29 , 2024 | 12:38 AM