ఆక్వాను ఆదుకోవాలి
ABN, Publish Date - Nov 07 , 2024 | 12:47 AM
ప్రభుత్వం ధరలు తగ్గిస్తుందని గడిచిన ఏడు నెలలుగా ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ఒక్క రైతు కూడా విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకోలేదు. ఇదే విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.
జగన్ హయాంలో నష్టపోయిన రైతులు
కూటమి ప్రభుత్వం.. హామీల అమలుకు ఎదురుచూపు
విద్యుత్ యూనిట్ రూపాయిన్నరకే ఇవ్వాలి..
ట్రాన్స్‌ఫార్మర్ల ధరలు తగ్గించాలి..
ఇన్‌చార్జ్ మంత్రి దృష్టికి జిల్లా ఎమ్మెల్యేల ప్రస్తావన
ప్రభుత్వం ధరలు తగ్గిస్తుందని గడిచిన ఏడు నెలలుగా ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ఒక్క రైతు కూడా విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకోలేదు. ఇదే విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.
జిల్లాలో 1.24 లక్షల ఎకరాలలో రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటికి 16,261 విద్యుత్ కనెక్షన్‌లుండగా, 13,648 కనెక్షన్‌లకు సబ్సిడీ వస్తోంది. మరో 2,613 కనెక్షన్‌లకు రావాల్సి వుంది.
ఆకివీడు రూరల్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆదాయాన్ని, కొనుగోలు శక్తిని పెంచి మార్కెట్‌ను కళకళలాడే విధంగా చేసిన ఆక్వా రంగం గత ప్రభుత్వ అనాలోచిత చర్యలకు కుదేలైంది. తాము అధికారంలోకి రాగానే ఆక్వా రైతులను ఆదుకుని, తిరిగి పట్టాలెక్కిస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆ హామీల అమలుకు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
డెల్టా ప్రాంతం వ్యవసాయం నుంచి ఆక్వా వైపు మరలి.. ఆర్థికాభివృద్ధి దిశగా పయనించింది. రొయ్యలు సాగు ప్రారంభమయ్యాక రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని పెద్ద ఎత్తున సాధించి పెట్టింది. 2014లో అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం ఆక్వాకు చేయూతనిచ్చి ప్రోత్సహించింది. ఎటువంటి సీలింగ్ లేకుండా సబ్సిడీపై విద్యుత్ యూనిట్‌ను 1.50 రూపాయలకు అందించింది. 40 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.2.35 లక్షలకే అందించింది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం వచ్చాక ఐదు ఎకరాలలోపు వారికే యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకు అందిస్తామని నిబంధన పెట్టింది. దీనిపై రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో దీని పరిమితి పదెకరాలకు పెంచింది. దీనిని ఆక్వా జోన్ పరిధిలో వున్న రైతులకు మాత్రమే అమలు చేసింది. దీంతో రైతులకు ఎటువంటి మేలు జరగకపోగా నష్టం వాటిల్లింది. సబ్సిడి లేకపోవడంతో రైతులకు యూనిట్ ధర రూ.4.05 పలికింది. 40 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ రూ.5.20 లక్షలకు చేరి రైతులపై అదనపు భారం పడింది. ట్రూ అప్ ఛార్జీలు, అదనపు లోడు, బొగ్గు చార్జీలని ఇతర భారాలు మోపడంతో రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. సాగు విస్తీర్ణం తగ్గింది. కనీసం సీడ్, ఫీడ్, మందులపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో శాపంగా మారింది. రైతుల బాధలను అర్థం చేసుకున్న టీడీపీ కూటమి ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా చెరువులన్నింటికి యూనిట్ రూపాయిన్నరకే అందిస్తామని, తక్కువ ధరకే ట్రాన్స్‌ఫార్మర్‌లు అందజేస్తామని, కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. వీటిని ఎప్పుడు అమలు చేస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికు మార్ దృష్టికి ఉండి, భీమవరం ఎమ్మెల్యే లు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను తీసుకెళ్లారు. రైతు లు వేచిచూస్తు న్నారని, వెంటనే అమలు చెయ్యకపోతే జరిగే నష్టాలను తెలియజేసారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన విధంగానే ఏరియేటర్లు, విద్యుత్ మోటార్లు, వాహనాలు ఇవ్వాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు నామమాత్రంగానే తగ్గాయి. దీనిపై రైతుల్లో ఎలాంటి సంతోషం లేదు. సీడ్, ఫీడ్, మందులపై ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Nov 07 , 2024 | 12:49 AM