పత్తికి.. గడ్డుకాలం
ABN, Publish Date - Nov 04 , 2024 | 12:20 AM
తెల్లబంగారంగా పిలువబడే పత్తిసాగుకు ప్రస్తు తం కష్టకాలం ఎదురైంది.
వర్షాలకు తడుస్తున్న పంట
బూజు పట్టి నల్లబడే అవకాశం
ప్రస్తుతం క్వింటా ధర రూ.5500 – రూ.6000
గిట్టుబాటు కాదంటున్న రైతులు
కుక్కునూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెల్లబంగారంగా పిలువబడే పత్తిసాగుకు ప్రస్తు తం కష్టకాలం ఎదురైంది. కుక్కునూరు, వేలేరు పాడు మండలాల్లో సుమారు 18 వేల ఎకరాల్లో పత్తిసాగు చేపట్టారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఏటా గోదావరి వరద ముంచెత్తి నష్టపోతుండడంతో గోదావరి ముంపు బారిన పడని మెట్ట ప్రాంతాలు, పోడు భూముల్లో అత్యధికంగా పత్తిసాగు చేపట్టారు. వారం రోజుల క్రితం వరకు పత్తి సాగు ఆశాజనకంగా ఉంది. రైతులు పత్తి తీయడానికి సన్నాహాలు ప్రారంభిం చారు. ఇంతలోనే వర్షాలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పత్తికాయ నుంచి పగిలిన పత్తికి వర్షం కారణంగా బూజుపట్టి నల్లబడే అవకాశం ఉంది. మొక్కపై ఉన్న పూత రాలిపోవడంతో పాటు కాయలతో ఉన్న మొక్కలు వర్షం కారణంగా పక్కకు ఒరిగిపోతున్నాయి. ఈ ఏడాది పత్తిసాగుపై ఎన్నో ఆశలతో ఉన్న రైతాంగానికి ఏం చేయాలో తోచడం లేదు.
గతేడాది వర్షాలు లేక నష్టం
గతేడాది సెప్టెంబరు నుంచి వర్షాలు లేక పత్తి పంటకు తడులు అందక దిగుబడులు తగ్గి రైతు లు నష్టపోయారు. తడులు అందించడానికి వేలాది రూపాయలతో డీజిల్ ఇంజన్లు, పైపులు కొనుగోలు చేశారు. సమయానుకూలంగా తడులు అందక ఎకరాకు మూడు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అధిక శాతం రైతుల పంటలకు తడులు అందక ఎండిపోయాయి. పండిన పంటకు క్వింటా ధర రూ.6వేలు నుంచి రూ.7వేల లోపే పలికింది. పంట దిగుబడి తగ్గడం, ధర లేక రైతులు నష్టపోయారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలంగా కురవడంతో పత్తి ఆశాజనకంగా మారింది. మొదటి కాపులోనే నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుం దని రైతులు ఆశించారు. అనూహ్య వర్షాలతో నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గతేడాది అనావృష్టితో ఈ ఏడాది అతివృష్టితో రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడిం ది. ఈ సీజన్ ఆరంభంలో క్వింటా పత్తి రూ.9 వేలు పైగా ధర పలికింది. ప్రస్తుతం క్వింటా ధర రూ.5500 – రూ.6000 పలుకుతోంది. దీంతో ధర గిట్టుబాటు కాదని రైతులు వ్యక్తం చేస్తున్నారు. క్వింటా ధర రూ.9వేలు పైగా పలికితేనే ఒడ్డున పడతామని రైతులు చెబుతున్నారు.
Updated Date - Nov 04 , 2024 | 12:20 AM