వాయుగుండం ముప్పు
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:24 AM
జిల్లాకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చెబుతు న్నాయి.
బలపడనున్న అల్పపీడనం
విస్తారంగా వర్షాలు
రైతుల్లో ఆందోళన
ఏలూరుసిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చెబుతు న్నాయి. తూర్పు బంగాళాఖాతంలో ఈనెల 21, 22 తేదీల్లో అల్పపీడనం ఏర్పడి అది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈనెల 23 వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశాలు న్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ కార ణంగా ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురుస్తా యని ఈనెల 24 నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది. జిల్లాలో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. ఇప్పటికే బంగాళాఖా తంలో ఏర్పడిన ఉపరి తల ఆవర్తనం కారణంగా జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల భారీగాను , మరి కొన్ని చోట్ల స్వల్పంగాను వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉరుములు, పిడుగులుతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో పంటలు దెబ్బతింటాయిని రైతులు ఆందోళన చెందుతు న్నారు. ఇప్పటికే జిల్లాలో వరి మాసూళ్లు ప్రారంభమయ్యాయి. వరికోతలు కూడా మొదలు కావటంతో వర్షాలు భారీగా కురిస్తే పంట చేతికి అందే అవకాశాలు తక్కువగా ఉంటాయిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులు ప్రభావం ఎక్కువగా ఉండడంతో వరి పంట నేలకొరిగితే పంట పూర్తిగా తడిసిపో తుందని, వరి పంట కుళ్లిపోయే అవకాశాలుం టాయిని రైతులు చెబుతున్నారు. అయితే ఏలూరు జిల్లాలో ఇప్పుడు కొన్ని మండల్లాలోనే వరి కోతలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 22వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవనున్నారు. ఈ నేపధ్యంలో వర్షాలు కురిస్తే వరి కోతల విషయంలో జాప్యం జరుగుతుందని చెబుతున్నారు.
పంట కాపాడుకునేందుకు పాట్లు
వాతావరణ శాఖ హెచ్చరికలతో పంటను రక్షించుకునేందుకు రైతులు అవస్థలు పడుతు న్నారు. జిల్లాలో మబ్బుపడితే భారీగానే వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యాన్ని బరకాలు కప్పి రక్షించుకుంటున్నారు. పగటి సమయంలో ధాన్యాన్ని ఆరబెట్టినా, వర్షం వస్తుందనే సమయంలో మాత్రం బరకాలు కప్పి జాగ్రత్త చేసుకుంటున్నారు. కొంత మంది రైతులైతే కుప్పలు వేసి, వాటిపై బరకాలు కప్పుతున్నారు. పంట చేలల్లో కుప్పలు తడిసి పోకుండా కూడా పలు చోట్ల జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి సిద్ధం చేసుకుం టున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో అల్పపీడనం, వాయుగుండం హెచ్చరికలతో రైతులు సతమతమవుతున్నారు.
నూజివీడులో 20.6 మి.మీ వర్షపాతం
జిల్లాలో గడచిన 24 గంటల్లో నూజివీడు మండలంలో అత్యధికంగా 20.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్ష పాతం 6 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లాలో వర్షం కురిసిన మండలాల్లో వర్షపాతం వివరాలు.. కలిదిండిలో 20.4, ముసునూరు 17.8, మండవల్లి 13.6, పోలవరంలో 13.2, ముదినేపల్లి 12,6, కైకలూరు 10.2, ఆగిరిపల్లి 9.6, కామవరపుకోట 7.2, చాట్రాయిలో 7.2, భీమడోలు 6.4, నిడమర్రు 5.4, కొయ్యల గూడెం 5.2, వేలేరుపాడు 5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మిగిలిన చోట్ల 5 మి.మీ కన్నా తక్కువ నమోదైంది.
జల్లేరు జలాశయం గేట్లు ఎత్తివేత
బుట్టాయగూడెం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయం గేట్లను ఆదివారం సాయంత్రం ఎత్తి 200 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఏఈ సురేష్ తెలిపారు. జలాశయం అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కుండపోత వర్షం కురవడంతో కొండవాగుల ద్వారా జలాశయంలోకి 250 క్యూ సెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. జలాశయం పూర్తి సామర్ధ్యం 217.80 ఎంటిఎస్ కాగా ప్రస్తుతం 217.25 ఎంటీఎస్‌కు చేరడంతో ముందుజాగ్రత్త చర్యగా 200 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నామన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 12:24 AM