అప్పులు.. తిప్పలు
ABN, Publish Date - Nov 03 , 2024 | 12:35 AM
ఒకానొకప్పుడు ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లిన నాడు అప్పంటేనే ఆ కుటుంబాలన్నీ వణికిపోయేవి. ఆ పరిస్థితి రాకూడదని దేవుళ్ళకు మొక్కేవారు. ఉన్నదానిలోనే సరిపెట్టుకోవడమే తప్ప అప్పు జోలికి వెళ్ళేందుకే జంకు. అంతకంటే మించి అప్పు తీసుకుంటే ఆ కుటుంబానికి అప్రదిష్టే.
ప్రతి ఇంటా అప్పుల కుప్పలే
పెరుగుతున్న అవసరాలు.. ఆర్భాటాలు..
ఇంటిలో ఇల్లాలి నుంచి పిల్లల వరకు అప్పులే
రెచ్చిపోతున్న కాల్‌నాగ్‌లు..
ఏటా వందల మంది ఉసురు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
ఒకానొకప్పుడు ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లిన నాడు అప్పంటేనే ఆ కుటుంబాలన్నీ వణికిపోయేవి. ఆ పరిస్థితి రాకూడదని దేవుళ్ళకు మొక్కేవారు. ఉన్నదానిలోనే సరిపెట్టుకోవడమే తప్ప అప్పు జోలికి వెళ్ళేందుకే జంకు. అంతకంటే మించి అప్పు తీసుకుంటే ఆ కుటుంబానికి అప్రదిష్టే. సమాజంలో పెద్దింటిగా మెలిగినవారికి ఈ పరిస్థితి నామోషీగా ఉండేది. తమ హీన స్థితికి ఇదొక నిదర్శనంగా భావించేవారు. కష్టించి పనిచేయడమే ధ్యేయంగా మెలిగిన రోజుల్లో అత్యవసరాల్లో తప్ప చేబదులుకు కూడా చేయిచాచని కుటుంబాలు లెక్కకు మిక్కిలి. అప్పట్లో ఇంటి పెద్దే అన్ని పద్దులు సరిచూసుకునేవారు. ఎవరికెంత కావాలో.. ఏడాదికి ఎంత ఖర్చో అంచనాకు వచ్చేవారు.
పెళ్ళైనా.. పేరంటమైనా సోకులకు పోయేవారు కాదు. ఆర్థికంగా కొంత స్థిమితపడి క్రమశిక్షణగా మెలిగే కుటుంబాలను అప్పటికీ, ఇప్పటికీ కూడా పిసినారి బోర్డు తగిలిస్తారు. అదే స్తోమతకు మించి అప్పులు చేసి సోకులకు పోయేవారిని చూసి మురిసిపోతారు. రానురాను ఇంటి ఖర్చులు పెరుగుతూ పోతున్నాయి. రానురాను ఇవి కాస్తా పెరిగి ఉమ్మడి కుటుంబాలు రకరకాల కారణాలతో విచ్చిన్నమయ్యాయి. ఆ స్థానంలో ఒంటరి కుటుంబాలు వచ్చాయి. సరిగ్గా ఇక్కడే సొంత ఆర్థిక వ్యవస్థ తిరగబడింది. ఆస్తులు, అంతస్తులన్నీ ఎవరంతట వారుగా పంచుకుని వేరుపడ్డారు. మనసులు విరిగి.. బంధాలు కరిగి.. ఒకప్పటి ఆనందాన్ని అంతం చేసుకుని.. పొరుగింటి వారే తమకు ఆదర్శంగా మలుచుకుని చేతినిండా ఖర్చులు.. ఆపై అప్పులు. ఇంకేముంది అప్పు తీరే మార్గంలేక చితికిపోయిన సంసారాలెన్నో ఉన్నాయి.
ఇంటింటా అప్పులు
అప్పు చేయకపోవడం ఒకప్పటి ధర్మం. ఇప్పుడు అప్పే చేసి ఇంటిని సాకడం మరో ధర్మం. ఏకంగా ఇంట్లో మహిళా మణులే నిరంతర ఆదా చేసేవారుగా ఇంతకుముందు ఓ గుర్తింపు. అందుకనే ఇంట్లో ఆడవారు క్రమశిక్షణగా ఉంటే ఆ ఇంటికి తిరుగుండదని తెగ గొప్పలు చెప్పేవారు. కాని ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఓ అప్పు ప్రభుత్వమే సమకూరుస్తుంది. త్వరగా కడితే ఇంకో అప్పు. ఇచ్చే అంతటికి తక్కువ వడ్డీ అంటూ ఏటా ఓ ఆఫర్. జిల్లా వ్యాప్తంగా ఉన్న 43 వేల పొదుపు సంఘాలు ఉండగా వీటిలో 4 లక్షల 30 వేల మందికిపైగా మహిళలే సభ్యులు. వీరంతా కలిసి ఏడాదికి బ్యాంకుల నుంచి సుమారు రూ.1100 కోట్ల నుంచి 1200 కోట్లు అప్పుగా తీసుకుంటారు. ఉమ్మడిగా ప్రతి నెలా వాయిదా పద్ధతిన బ్యాంకుల్లో చెల్లిస్తూనే వస్తారు. ఈ సొమ్ములతోనే జీవనోపాధికి అవకాశం అంటూ సర్కార్ యోచిస్తుంటే వీరిలో కొందరు తాము తీసుకున్న తక్కువ వడ్డీ సొమ్మును తిరిగి ఎక్కువ వడ్డీకి తిప్పుతుంటారు. బయట వడ్డీ రూపాయిన్నర నుంచి మూడు రూపాయల పైమాటే. అవసరాన్ని బట్టి కొందరు ఈ అప్పుల వైపు చేయి చాపుతారు. ఒకప్పుడు ఈ పొదుపు సంఘాలన్నింటికి ఏడాదికి ఐదొందలు నుంచి ఆరొందలు కోట్లు వరకు ఉండే రుణం కాస్తా ఇప్పుడు రెట్టింపు కావడం ఒక విచిత్రమైతే తాము తీసుకున్న అప్పును ఇంకొకరికి అప్పుగా ఇచ్చి రుణ గ్రహీతల సంఖ్యను వీరంతా రెట్టింపు చేస్తున్నారు. అంటే సరాసరిన ప్రతీ ఇంట్లోను ఓ అప్పు ఉన్నట్టే. దీనికితోడు సొంతిల్లు ఉంటే అదే పదివేలు. ఇంకేముంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రుణం పొందితే చాలు కల్లో.. గెంజోతాగి సొంతింట్లోనే బతకొచ్చనే కల నిజమయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు మిగతా అన్ని తరగతులది ఇదే తాపత్రయం. దీంతో ఈ జిల్లాలోనే ఏడాది పొడవునా గృహ అవసరాల కోసం ఇచ్చే రుణాల సంఖ్య రూ.1300 కోట్లు దాటింది. ఇదొకనాడు ఒక వంతుగానే ఉండేది. ఇప్పుడు నెల వచ్చిపడితే చాలు.. అమ్మో ఈంఐ(ప్రతినెలా చెల్లింపు) పేరిట గగ్గోలు పెట్టాల్సిందే. ఇది ఒక ఏడాది కాదు.. 13 నుంచి 15 ఏళ్ళ సుదీర్ఘ అప్పు పోరాటం చేయాల్సిందే. సాధారణంగా అద్దె ఇళ్ళల్లో ఉంటే నెలకు సరాసరిన 7 నుంచి 11 వేలలోపు అద్దె చెల్లిస్తే సరిపోతుంది. కాని ఈఎంఐ వైపు తొంగి చూసినవారంతా 25 నుంచి 34 వేల రూపాయల వరకు సరాసరిన నెలవారీ కిస్తులు బ్యాంకులకు చెల్లించాల్సిందే. ఇదికాకుండా అనేక కుటుంబాలు తమ స్తోమతకు మించి మరీ అప్పులు చేస్తున్నాయి. ఉదహరణకు ఇంట్లో టివి, రిఫ్రిజిరేటర్ ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడా ట్రెండ్ కాస్తా మారీ ఇంకోవైపు ఒంగి చూస్తుంది. ఇల్లు అంటూ ఉంటే చాలు ఏకంగా ఏసీ, వాషింగ్ మిషన్, హీటర్‌తోపాటు మరిన్ని గృహోపక రణాలు కూడా అత్యవసరమే. ఇక చేసేదేముంది. ముందస్తుగా పెట్టుబ డి పెట్టే ప్రైవేటు కంపెనీలు ఎలాగూ ఉన్నాయి. వీటికి తల తాకట్టు పెట్టైనా నెలవారీ చెల్లింపు చేయాల్సిందే. ఇంకోవైపు కార్లు, బైక్‌లకు కోట్లాది రూపాయలు అప్పులు చేసే కుటుం బాలు వేలల్లోనే కనిపిస్తున్నాయి. ఒక్క ఏలూరు జిల్లాలోనే ప్రతి ఏటా మూడు వేల కోట్లు వీటి కోసమే ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లో ఉన్న వారైనా లేకుంటే మధ్య తరగతి అయినా అప్పు చేయాల్సిందేనని అంతలా అప్పుకు అలవాటు పడిపోయారు.
కాలనాగులెన్నో..
రోజులు మారాయి.. అవసరాలు పెరిగాయి. అత్యవసరాలు రెండింతలయ్యాయి. క్షణాల్లో సొమ్ము చేతికందాలి. దానికి ఎంత వడ్డీ అయినా పర్వాలేదు. అలాంటి ట్రెండ్ ఇప్పుడు కొందరి పాలిట శాపం అవుతుంది. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలన్నీ విలనిజం పాటిస్తున్నాయి. ముందుగా అప్పు తీసుకునే వారందరికీ మీ ఆధార్ కార్డు ఒక్కటిస్తే చాలని బిస్కెట్ విసిరి ఆ తరువాత రకరకాలుగా షరతులతో సంతకాలు చేయించుకుంటారు. ఇంకేముంది ఒక్క నెలలోనే కడితే తక్కువ వడ్డీ అని చెప్పి రానురాను ఇచ్చిన సొమ్ము అంతా వడ్డీకే సరిపోయింది అసలు ఎక్కడెంటూ నిత్యం వేధింపులు. గూండాలు, రౌడీలతో బెదిరింపులు. అంతకంటే మించి రెచ్చిపోయిన ఇంకొందరు మహిళలపై లైంగిక వేధింపులకు తోడు అవమానాలు. చీటికి మాటికి ఇంటి వద్ద వాలిపోవడం, ఇరుగుపొరుగువారితో చర్చించడం, ఇంటి పరువుని బజారుకెక్కించడంలో వీరు దిట్ట. తమకు ఇవ్వాల్సిన అప్పు వసూలు కోసం ఎంతకైనా బరితెగిస్తారు. కాల్‌మనీ వ్యాపారం మధ్య తరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఈ తరహా కేసులు పదుల సంఖ్యలో పోలీసుల దృష్టికి వెళ్ళగా మిగతా కేసులన్నీ ఎక్కడికక్కడే మిగిలిపోయాయి. ఆఖరుకి ప్రైవేటు ఫైనాన్సర్లు బరితెగించి భౌతికదాడులకు తెగబడిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది ఉసురు తీసుకుంటున్నారు.
Updated Date - Nov 03 , 2024 | 12:35 AM