ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్లెక్సీలు.. పీక్స్‌కు

ABN, Publish Date - Nov 06 , 2024 | 12:24 AM

ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహ ఏర్పాటుపై ఇరు వర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. సోమవారం విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో భాగంగా ఒక వర్గానికి చెందిన యువకులు ‘గ్రామంలో ఎవడ్రా మమ్మల్ని ఆపేది’ అంటూ 15 అడుగుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

భారీ కటౌట్‌లు.. విద్వేషపూరిత రాతలు

తాడిపర్రులో నలుగురి మృతికి ఇదే కారణం !

పెరుగుతున్న ప్రమాదాలు.. వివాదాలు

గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు

పచ్చని పల్లెలకూ పాకిన విద్వేషాలు

అనవసర గొడవలకు ఫ్లెక్సీలు ఆజ్యం

చర్యలు తీసుకోకుంటే మరింత ముప్పు

ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహ ఏర్పాటుపై ఇరు వర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. సోమవారం విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో భాగంగా ఒక వర్గానికి చెందిన యువకులు ‘గ్రామంలో ఎవడ్రా మమ్మల్ని ఆపేది’ అంటూ 15 అడుగుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా మరో వర్గం యువకులు ‘మేమేరా మిమ్మల్ని ఆపేది’ అంటూ 20 అడుగుల ఫ్లెక్సీని తయారు చేయించారు. దీని ఏర్పాటులో కరెంట్‌ షాక్‌తో నలుగురు యువకులు మృతి చెందారు. ప్రశాంతంగా ఉండే గ్రామ సీమల్లోనూ ఇలాంటి స్లోగన్స్‌తో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు కక్షలను పెంచుతూ.. ప్రాణాలు తీస్తున్నాయి.

భీమవరం క్రైం/ఏలూరు క్రైం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):ఫ్లెక్సీల ప్రచారం ఫీక్స్‌కి చేరింది. పెళ్లి, పేరంటం, బర్త్‌ డే, డెత్‌ డే, నాయకులు వస్తున్నా, అభిమాన హీరోల సినిమాలు విడు దలవుతున్నా.. ఫ్లెక్సీ ఉండాల్సింది. ఒకటి, రెండు కాదు.. ఊరు ఊరంతా ఫ్లెక్సీలతో నిండిపోవా ల్సిందే. మన సత్తా ఏమిటో తెలియాల్సిందే అన్నట్టు తయారైంది ఉమ్మడి జిల్లాలో పరిస్థితి. పోటా పోటీ ఫ్లెక్సీల ఏర్పాటు, ఎదుటి వారిని కించపరిచే వ్యాఖ్యలతో విద్వేషాలను రగిల్చేలా ఇటీవల కాలంలో ఇవి పెరిగిపోయాయి. వీటితో ఇరు వర్గాల మధ్య గొడవలకు దారితీసి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. కొన్ని సంద ర్భాల్లో ప్రాణాలు పోతున్నాయి.

ఏర్పాటుకు అనుమతులేవి ?

ఫ్లెక్సీల ఏర్పాటుపై పరిమితి లేకపోవడంతో ఎవరికి వారు ఇష్టానుసారం పెడుతున్నారు. వాస్తవానికి వీటిని ఏర్పాటు చేయాలంటే సం బంధిత కార్పొరేషన్‌, మున్సిపాల్టీ, పంచాయతీల నుంచి అనుమతులు ఉండాలి. ఆపై తగిన రుసుము చెల్లించాలి. కాని, ఎక్కడా ఇవి అమ లు కావడం లేదు. ఎక్కడపడితే అక్కడ, ఎవరికిష్టం వచ్చినట్టు వారు.. ఐరన్‌ ఫ్రేమ్‌లతో కట్టేస్తున్నారు. ఇవి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండడంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ ప్లెక్సీల ఏర్పాటులో రాజకీయంగా, కులపరంగా, వర్గాల పరంగా మారిపోయాయి. ఎంత ఖర్చయినా మన ఫ్లెక్సీ నే పెద్దగా, ఎక్కువ రోజులుండాలన్న ఉద్దేశంతో ఐరెన్‌ రాడ్‌లు ఏర్పాటు చేసి మరీ ఎత్తులో పెడుతున్నారు. పది, ఇరవై, ముప్పయి అడుగు లకు పెంచుకుంటూ పోతున్నారు. వీటిని ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నది అభిమానులే. వారు రెక్కాడితేకాని డొక్కాడని బడుగుజీవులే. సాధారణంగా వీరు నాయకులు, సినీ నటులపై అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. మరి కొందరు అతిగా అభిమానం చాటుకుని ప్రాణా లు ఇవ్వడానికి సిద్ధపడుతుంటారు. వారి అమా యక అభిమానాన్ని ఆసరా తీసుకుని వారితో ఇష్టానుసారంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తూ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్లెక్సీల ఏర్పాట్ల పై నియంత్రణ లేకపోవడంతో ఇష్టాను సారంగా క్షణాల్లో తెల్లవారేటప్పటికి ఫ్లెక్సీలు అడ్డుగా వెలుస్తున్నాయి.

ఎన్నికల సమయంలో మాత్రమే ఫ్లెక్సీల ఏర్పాటుపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. మిగిలిన రోజుల్లో లేకపోవడంతో ఎక్కడబడితే అక్కడ ఎవరికి నచ్చిన చోటులో వారు కడుతున్నారు. మెయిన్‌ రోడ్లు కూడలి ప్రదేశాల్లో వీటిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గృహాల్లో నివసిస్తున్న వారికి దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి రోడ్డుపై వాహనాలతో ప్రయాణించే వారికి ఇబ్బందిగా మారుతున్నాయి. వీటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి భారీ వర్షాల సమయంలో ఈదురుగాలులకు ఎగిరిపడి పలువురు గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. ఇలా ఒకటేమిటి ఫ్లెక్సీల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తూర్పు గోదావరి కలెక్టర్‌ ప్రశాంతి తాడిపర్రు లో పర్యటించి ఈ ఘటనకు ఫ్లెక్సీ వివాదమే కారణమని గమనించి, వాటి తొలగింపునకు ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ముందే ఈ పనిచేసి ఉంటే ఈ రోజు తమ పిల్లలు దూరమయ్యే వారు కాదని వారి కుటుంబీకులు విలపించారు.

చర్యలు చేపట్టాలి..

ఫ్లెక్సీల ఏర్పాటుపై నిబంధనలు కఠినతరం చేయాలి. ఫ్లెక్సీ ఏర్పాటుచేసే ముందు సంబంధిత అధికారికి చూపించిన తర్వాతే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలి. ఫ్లెక్సీలపై ఎదుటి వర్గం, కులం వారిని, హీరోల అభిమానులను రెచ్చగొట్టేలా అవమానించే విధంగా రాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అవతలి వర్గం వారి ఫ్లెక్సీలను చించి వేస్తూ గొడవలకు కారణమవుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ఫ్లెక్సీల వివాదాలు అమాయక ప్రజలపై పడి వారు ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫ్లెక్సీలు.. ప్రమాదాలు.. వివాదాలు

2014లో భీమవరంలో ఇద్దరు ప్రముఖ హీరోల సినిమాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఇరు వర్గాలు బాహాబాహీకి సిద్ధమయ్యే పరిస్థితికి రావడంతో పోలీసులు భారీగా మోహరించి అదుపు చేశారు. కొద్ది రోజులపాటు 144 సెక్షన్‌ విధించారు.

2020లో ఆకివీడులో ఇరు వర్గాల రాజకీయ నాయకుల మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. విషయం రాష్ట్ర నాయకుల దృష్టికి వెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.

ఇటీవల ఓ ప్రజా ప్రతినిధి ఫ్లెక్సీ తొలగించారంటూ మరో వర్గం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసే వరకు వెళ్లింది. ఇప్పటికీ అక్కడ 144 సెక్షన్‌ కొనసాగుతూనే ఉంది.

ఎన్నికల ముందు వైసీపీ హయాంలో నరసాపురంలో ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను అధికార పార్టీ ప్రజా ప్రతినిధి ఆదేశాలతో తొలగించడం రాజ కీయంగా దుమారం చెలరేగింది. టీడీపీ నేతల ధర్నాతో అధికారులు దిగివచ్చి వివాదానికి చెక్‌ చెప్పారు.

ఏలూరు నగరంలో ఒక సినిమా రిలీజ్‌ సందర్భంగా ఒక పెద్ద ఫ్లెక్సీని కట్టగా అక్కడ టపాసులు కాల్చే సమయంలో తారాజువ్వలు అంటుకున్నాయి. కార్పొరేటర్ల మధ్య ఫ్లెక్సీ వివాదాలు చోటు చేసుకున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో తణుకులోనూ ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను అధికార పక్ష నేత తొలగించడం వివాదంగా మారింది.

కైకలూరు మండలం వరహాపట్నంలో ఇటీవల ఓ సినీనటుడు ఫ్లెక్సీని ఎలాంటి అనుమతులు లేకుండా షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు షాపుల వారికి నచ్చ చెప్పారే తప్ప ఫ్లెక్సీలను తీయించలేకపోయారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవో లులో ఓ రాజకీయ పార్టీ సమావేశానికి భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ యువకుడు ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ వైర్లు తగిలి కరెంటు షాక్‌తో చనిపోయాడు.

చర్యలు తప్పవు

‘ప్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుకు పోలీసులు, సంబంధిత మునిసిపాలిటీ, పంచాయతీ అధికారుల అనుమతి తీసుకోవాలి. కరెంటు పోల్స్‌, మెయిన్‌ లైన్స్‌ ఉన్నచోట్ల, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయకూడదు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదు వస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం’ అని హెచ్చరిస్తున్నారు భీమవరం డీఎస్పీ జయసూర్య.

Updated Date - Nov 06 , 2024 | 12:25 AM