వరద గోదారి
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:19 AM
గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటనతో దిగువ లంక గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.
వశిష్ఠకు పెరుగుతున్న ఉధృతి
బిక్కుబిక్కుమంటున్న లంక గ్రామాలు
అధికార యంత్రాంగం అప్రమత్తం
5 వేల ఇసుక బస్తాలు సిద్ధం
సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్
గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటనతో దిగువ లంక గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగితే సముద్రంలోకి విడుదల చేసిన జలాలతో గోదావరి మరింత పోటెత్తింది. లంక గ్రామాలు, తోటలు నీట మునుగుతాయి. వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకు జిల్లాలో పలుచోట్ల వరి నారుమడులు కొట్టుకుపోయాయి. తేరుకుంటున్న సమయంలో మళ్లీ వాయుగుండం హెచ్చరికతో రైతులు కుదేలయ్యారు. గోదావరి వరద హెచ్చరికతో లంక గ్రామాల ప్రజల కంటిమీద కునుకు లేదు. జూలైలో సుమారు పది రోజుల పాటు గోదావరికి వరద తాకింది. మరోసారి వరద నీరు పోటెత్తడంతో తీర ప్రాంతాల వారు ఆందోళన చెందుతున్నారు.
నరసాపురం/ఆచంట/పెనుగొండ, సెప్టెంబరు 4: వశిష్ఠా గోదావరికి బుధవారం ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. పరీవాహక ప్రాంతాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అప్రమత్తమైన మత్స్యకారులు గోదావరిలో కట్టిన వలకట్లను తొలగించుకున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉండడంతో ఆధికారులు కూడా అప్రమత్తమయ్యారు. జిల్లాలో దొంగ రావిపాలెం నుంచి నరసాపురం వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర ఏటిగట్టు విస్తరించింది. 1986 వరదలను పరిగణలోకి తీసుకుని 2007లో ఏటిగట్టు ఎత్తుచేసి పటిష్ఠం చేశారు. ఇంకా 11 కిలోమీటర్లు పనులు చేపట్టాల్సి ఉంది. అధికారుల లెక్కల ప్రకారం దొడ్డిపట్ల, యలమంచిలి, నరసాపురం మండలంలోని రాజుల్లంక, బియ్యపు తిప్ప వద్ద గట్టును ఎత్తు చేయాల్సి ఉంది. 2022 వరదలకు దొడ్డిపట్ల వద్ద నీరు బయటకొచ్చింది. ఈ ఏడాది వరదకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. జూలైలో వరదలకు ధవళేశ్వరం నుంచి సుమారు 18 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వశిష్ఠకు 9 లక్షల క్యూసెక్కులు రావడం ముప్పు తప్పింది. మరోసారి వరద తాకడంతో అధికారులు ముందుస్తు చర్యలకు సన్నద్ధమయ్యారు.
ఇసుక బస్తాలు సిద్ధం
ఏటిగట్టు పరిరక్షణకు 5వేల ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. వాటిలో 1500 బస్తాలను గట్టు బలహీనంగా ఉన్న దొడ్డిపట్లకు తరలించారు. యలమంచిలి, నరసా పురం మండలాల్లో ఏటిగట్టు వద్దకు కూడా బస్తాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు స్లూయిస్‌లను కూడా ప్రమాదభరితంగా ఉన్నాయి. వరద తాకగానే వీటిని మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నారు. తలుపుల లీకేజీలు ఉన్న చోట్ల ఇసుక బస్తాలను ఆడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చ రిక జారీ చేయగానే ఉభయగోదావరి జిల్లాల మధ్య నరసాపురం– సఖినేటిపల్లి రేవు ల్లో రాకపోకలు నిలిపివేయాలని నిర్ణ యించారు. ఏటిగట్టు పర్యవేక్షణాధి కారి సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది గట్టు బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించారు. ఆర్డీవో అంబరీష్ అధికారులు అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశారు. 9391185874 నెంబర్‌తో సబ్ కలె క్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సిద్ధాంతం వద్ద గోదావరి వరద ఉధృతిని పె నుగొండ సీఐ రజనీకుమార్, ఎస్‌ఐ కె.గంగాధరరావు పరిశీలించారు. గో దావరి ఉధృతితో లంక రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. గోదావరిలో స్నానాలకు ఎవ రు దిగవద్దని తెలిపారు. కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురంలో పుష్కరఘాట్‌లు నీట ము నిగాయి. మరింత ఉధృతమవుతుం దని అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:19 AM