ఆచంటేశ్వర క్షేత్రంలో అఖండ జ్యోతి
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:46 AM
ప్రసిద్ధ ఆచంట ఉమా రామేశ్వరస్వామి ఆలయంలో వేలాది మంది భక్తుల శివనామస్మరణ మధ్య శుక్రవారం సాయంత్రం అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) ప్రజ్వలన జరిగింది.
ఆచంట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ ఆచంట ఉమా రామేశ్వరస్వామి ఆలయంలో వేలాది మంది భక్తుల శివనామస్మరణ మధ్య శుక్రవారం సాయంత్రం అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) ప్రజ్వలన జరిగింది. ముందుగా గంధర్వ మహల్‌కు చెందిన గొడవర్తి వంశీయులు కృత్తికా నక్షత్ర హోమం, మండపారాధన, మహా నైవేద్యం, ధూపసేన నిర్వహించి అనంతరం కర్పూర జ్యోతిని వెలిగించారు. కర్పూర జ్యోతిలో ఆవు నెయ్యి వేయడానికి భక్తులు పోటీ పడ్డారు. సుమారు పది వేల మంది భక్తులు కర్పూర జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు వెలిగించిన అఖండ జ్యోతి జనవరి వరకు నిరంతరం వెలుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ప్రతీ రోజూ భక్తులు కర్పూర జ్యోతిలో ఆవు నెయ్యి వేసి మొక్కులు తీర్చుకుంటారు. కర్పూర జ్యోతి అనంతరం ఆలయం వద్ద జ్వాలా తోరణం వెలిగించారు. స్వామి ప్రభను గ్రామంలో ఊరేగించారు. భక్తులకు ఆలయ అధికారి ఆదిమూలం వెంకట సత్యనారాయణ, గజేశ్వరరావు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఐ కట్టా వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
Updated Date - Nov 16 , 2024 | 12:46 AM