వరించిన అదృష్టం
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:06 AM
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు అమిత ప్రాధాన్యం ఇచ్చింది. రెండో విడత విడుదల చేసిన పదవుల్లో మూడు కీలక పదవులను కేటాయించింది.
ఉమ్మడి పశ్చిమలో నలుగురికి నామినేటెడ్ పదవులు
ప్రభుత్వ సలహాదారుగా షరీఫ్
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా
కొత్తపల్లి సుబ్బారాయుడు
క్షత్రియ కార్పొరేషన్
చైర్మన్‌గా కనకరాజు సూరి
ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్‌గా
రెడ్డి అప్పలనాయుడు
తొలి విడతలో నాలుగు..
తాజాగా నాలుగు పదవులు
(భీమవరం/నరసాపురం/ఏలూరు రూరల్ 9 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు అమిత ప్రాధాన్యం ఇచ్చింది. రెండో విడత విడుదల చేసిన పదవుల్లో మూడు కీలక పదవులను కేటాయించింది. సీనియారిటీ, విధేయతకు పెద్దపీట వేసింది. జిల్లాకు మూడు పదవులు కట్టబెట్టింది. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, కనకరాజు సూరిలకు కీలక పదవులు వరించాయి. తెలుగుదేశం ఇన్‌చార్జిలకు ఎటువంటి పదవులు ఇవ్వలేదు. ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఇన్‌చార్జిలకు పదవులు ఇవ్వలేదన్న అభిప్రాయం ఉంది. ఇన్‌చార్జిలకు ఇతర పదవులు ఇవ్వాలన్న తలంపుతో ఉంది. ఇప్పటికే అధిష్ఠానం వద్ద కొందరు ఇన్‌చార్జిలు తమ మనోగతాన్ని వెల్లడించారు. అందులో భాగంగానే రెండో విడత నామినేటెడ్ పదవులు కేటాయించలేదు. జిల్లాలో తొలి వరుసలో తెలుగుదేశం ఇన్‌చార్జిలు తోట సీతారామలక్ష్మి, వలవల బాబ్జి, పొత్తూరి రామరాజులున్నారు. తొలి నుంచీ టిక్కెట్ భరోసా ఇచ్చి ఇవ్వలేకపోయామంటూ బాబ్జిపై అధిష్ఠానం ఇప్పటికే మల్లగుల్లాలు పడుతోంది. అలాగే తోట సీతారామలక్ష్మి విషయంలో ఇప్పటికే పార్టీలో కీలకమైన పొలిట్‌బ్యూరో బాధ్యతలు అప్పగించింది. ఇక నర్సాపురం ఇన్ చార్జి పొత్తూరి రామరాజుకు పదవి ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రెండో విడత నామినేటెడ్ పదవుల కేటాయింపులో తెలుగుదేశం, జనసేనకు బెర్త్‌లు వరించాయి. మైనారిటీ వ్యవహారాల విభాగంలో ప్రభుత్వ సలహాదారుగా శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్‌ను నియమించింది. తొలి నుంచీ తెలుగుదేశం పార్టీకి షరీఫ్ విధేయతగా ఉంటున్నారు. 1982 టీడీపీ జెండాను నరసాపురంలో ఎగర వేసినవారిలో షరీఫ్ ఒకరు. లా చదివి, టీడీపీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీలో అనేక పదవులు నిర్వహించారు. పార్టీ ఒడిదుకుల్లోనూ అంటిపెట్టుకుని ఉన్నారు. వివాద రహితునిగా, పార్టీ విధేయునిగా షరీఫ్‌కు మంచి పేరుంది. విధేయత చూపిన వారికి పెద్దపీట వేస్తామన్న సంకేతాలను తెలుగుదేశం అధిష్ఠానం కేడర్‌కు పంపింది. ఇదివరకే ఉండి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు రామరాజుకు ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు. టిక్కెట్ వదులుకున్న రామరాజుకు ఇప్పటికే తెలుగుదేశం పెద్దపీట వేసింది. మాజీ మంత్రి పీతల సుజాతకు రాష్ట్ర వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. పోలవరం నేత బొరగం శ్రీనివాస్‌కు ఏపీ ట్రైకార్ చైర్మన్ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో జనసేనలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా కనకరాజు సూరికి పదవి వరించింది. గతంలో ఆయన ప్రజారాజ్యం తరపున భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అప్పట్లో పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే భీమవరం టిక్కెట్ దక్కించుకున్నారు. ఓటమి తర్వాత ఆయన ఏ పార్టీకి చేరువకాలేదు. పవన్ కల్యాణ్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కనకరాజు సూరికి ప్రత్యేకంగా భరోసా ఇచ్చారు. ఇప్పుడు మాట నిలబెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు.
కూటమిలో రెండో సారి
కాపు కార్పొరేషన్ పదవి రెండో సారి జిల్లాకు వరించింది. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో తొలిసారి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొదటి చైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుడు నియమితులయ్యారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకే రెండో సారి కాపు కార్పొరేషన్ పదవి వరించింది. జనసేనలో కొత్తపల్లి చేరినప్పుడే పవన్ కల్యాణ్ నుంచి హామీ లభించింది. అందుకు తగ్గట్టుగానే కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను కూటమి పంపకాల్లో కొత్తపల్లి సుబ్బారాయుడుకు కేటాయించారు. రుస్తుంబాదా ప్రాంతానికి చెందిన ప్రాంతానికి 1983లో స్వతంత్ర అభ్యర్థిగా మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైంది.
పదవులు ఆశించే వారెందరో
ఇంకా జిల్లాలో ప్రధాన పదవులను ఆశించే నాయకులు ఉన్నారు. ఆ వరుసలో భీమవరం నుంచి మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, తణుకు నుంచి దొమ్మేటి సుధాకర్, నర్సాపురం నుంచి మాధవ నాయుడు వంటి నాయకులకు తెలుగుదేశం కూటమి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాయకులు ఇప్పటికే అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పదవికి వన్నెతెస్తా:
రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు రూరల్: సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తనకు అప్పగించిన పదవికి వన్నెతెస్తానని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్‌గా ఎంపికైన ఏలూరు జనసేనపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డిఅప్పల నాయుడు అన్నారు. ఏలూరు మార్కెట్ యార్డులో హమాలీగా చేరి ఆ తర్వాత ఏలూరు వెంకటాపురం సర్పంచ్‌గా గెలుపొంది రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2019లో జనసేనపార్టీ నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2024లో ఏలూరు ఎమ్మెల్యే సీటు ఆశించారు. కూటమిలో భాగంగా బడేటి చంటికి టికెట్ కేటాయించారు. అప్పట్లో రెడ్డిఅప్పలనాయుడు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పట్లో పార్టీ అధిష్ఠానం అప్పలనాయుడుకు భవిష్యత్‌లో ఉన్నత పదవులు ఇస్తామని ఇచ్చిన హామీలో భాగంగానే ఆర్టీసీ విజయవాడ రీజయన్ చైర్మన్‌గా నియమించారు.
పాలకొల్లు టీడీపీ శ్రేణుల్లో నిరాశ
పాలకొల్లు అర్బన్, నవంబరు 9 (ఆంధ్ర జ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల 2వ జాబితాను విడుదల చేసిన నేపఽథ్యంలో 59 మందికి రాష్ట్ర వ్యాప్తంగా పదవులు లభించినప్పటికీ పాలకొల్లు నియోజక వర్గానికి ఒక్క పదవి రాకపోవడం పట్ల టీడీపీ శ్రేణు లు నిరాశగా ఉన్నాయి. టీడీపీ హయాంలో గత 40 ఏళ్ళుగా పాలకొల్లు నియోజక వర్గంలో పార్టీకి వెన్నంటి ఉన్న వారు ఎందరో ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల తొలి జాబితాలోనూ, మలి జాబితా లోనూ పాలకొల్లు నియోజక వర్గానికి చోటు లభించకపోవడంతో నామినేటెడ్ పదవు లు ఆశించిన నాయకులు డీలా పడ్డారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌కు మాత్రం రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు తప్ప మరొకరికి కనీసం నామినే టెడ్ పదవీ కూడా టీడీపీ అధిష్ఠానం ఇవ్వకపోవడం సముచితంగా లేదని సీనియర్ నాయకులు పెదవి విరుస్తున్నారు.
Updated Date - Nov 10 , 2024 | 12:07 AM