దసరా రద్దీ
ABN, Publish Date - Oct 10 , 2024 | 12:35 AM
బంధువులతో కలిసి దసరా పండుగకు ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు ప్రజలు తరలివస్తున్నారు.
ప్రయాణికులతో బస్, రైల్వే స్టేషన్లు కిటకిట
భీమవరం టౌన్, అక్టోబరు 9: బంధువులతో కలిసి దసరా పండుగకు ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు ప్రజలు తరలివస్తున్నారు. రెండు రోజులుగా ప్రయాణి కుల సంఖ్య అంతంతమాత్రంగా ఉన్నప్పటికి బుధవారం నుంచి రద్దీ పెరిగింది. బస్ కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా ఆర్టీసీ హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. ఈ నెల 11 వరకు ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయి. ప్రతీరోజు సర్వీసులతో పాటు ప్రత్యేక సర్వీసులు సీట్లు నిండిపోతున్నాయి. బుధవారం ప్రత్యేక సర్వీసుల ద్వారా ప్రయాణికులు తరలివచ్చారు. 10, 11 తేదీల్లో జిల్లాకు 14 సర్వీసులు వచ్చే అవకాశం ఉందని అదికారులు చెబుతున్నారు. దానికనుగుణంగా ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వీటితోపాటు ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. వరుస సెలవులతో స్వగ్రామాలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనావేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రత్యేక సర్వీసులను ఏర్పాటుచేస్తున్నారు.
పల్లెవెలుగు సర్వీసులు కిటకిట
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల మీదుగా నడిపే పల్లెవెలుగు సర్వీసులు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. గత మూడు రోజులుగా ఆక్యుపెన్సీ దాదాపు 80 శాతం వరకు పెరిగిందని చెబుతున్నారు. రెండు రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉండడంతో సర్వీసులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
13 నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు
దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకోసం రెగ్యులర్ సర్వీసులతో పాటు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌కు రద్దీని బట్టి సర్వీసులను పెంచుతామని అధికారులు చెబుతున్నారు.
Updated Date - Oct 10 , 2024 | 12:35 AM