నేడు ఆచంటలో అఖండ జ్యోతి
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:28 AM
ప్రసిద్ధి చెందిన రామేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) ప్రజ్వలనకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
కర్పూర జ్యోతి ప్రజ్వలనకు ఏర్పాట్లు
ఆచంట, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధి చెందిన రామేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) ప్రజ్వలనకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం పౌర్ణమి రోజున అఖండ జ్యోతిని వెలిగించడం ఇక్కడ ఆనవాయితీ. ముందుగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కృత్తిక నక్షత్ర హోమం, మండపారాధన, పూర్ణాహుతి మహానైవేద్యం, దూపసేవ, నిర్వహించి కర్పూర జ్యోతిని వెలిగిస్తారు.
కర్పూర జ్యోతి విశిష్టత
రెండు కేజీల దూదితో చేసిన ఏక ఒత్తి, ఇత్తడి మండిగను గడ్డితో చుట్టి దీప స్థంభంపై ఉంచుతారు. దానిలో నెయ్యిపోసి ఒత్తిని ఉంచి జ్యోతిని వెలిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన కర్పూరజ్యోతి జనవరి వరకు నిరంత రం వెలుగుతూనే ఉంటుంది. జ్యోతిని వెలిగించే రోజున జిల్లా నుంచి వేల సంఖ్యలో భక్తు లు ఆలయానికి చేరుకుని కర్పూర జ్యోతికి ఆవు నెయ్యి సమర్పిస్తారు. మొదటి రోజునే భక్తులు సమర్పించిన ఆవు నెయ్యి సుమారు 50 కేజీల పైగా ఉంటుంది. ఎప్పటికప్పుడు నెయ్యిని భారీ పాత్రలోకి సేకరిస్తారు. సేకరించని నెయ్యి నిల్వ ముగిసే వరకు జ్యోతి ప్రజ్వరిల్లుతునే ఉంటుం ది. ఆచంట గంధర్వ మహల్‌కు చెందిన గొడవర్తి కుటుంబీకులు కర్పూర జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ. సుమారు 150 సంవత్సరాల నుంచి గొడవర్తి కుటుంబీకులు కర్పూర జ్యోతిని వెలిగిస్తున్నారు. మహత్తర అఖండ జ్యోతి అరుణాచలం, కాశీ తర్వాత ఆచంటలో మాత్ర మే పౌర్ణమి రోజున వెలిగిస్తారు.
కర్పూర జ్యోతి ప్రజ్వలనకు ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో ఆదిమూలం వెంకట సత్యనారాయణ తెలిపారు. సుమారు 20 వేల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు.
Updated Date - Nov 15 , 2024 | 12:28 AM