మొదలైన ఇసుక కష్టాలు
ABN, Publish Date - Jun 12 , 2024 | 11:35 PM
కూటమి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక పాలసీని మళ్లీ తీసుకువస్తామని టీడీపీ నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చాలని వినియోగదారులు, టిప్పర్ లారీ యజమానులు కోరుతున్నారు.
నూతన పాలసీకై ఎదురుచూపు
కూటమి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక పాలసీని మళ్లీ తీసుకువస్తామని టీడీపీ నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చాలని వినియోగదారులు, టిప్పర్ లారీ యజమానులు కోరుతున్నారు.
నిలిచిన ఎగుమతులు
జూన్ మూడో తేదీతో అమ్మకాలు బంద్
వరదలు వస్తే తప్పని ఇబ్బందులు
కిరాయిలు లేక లారీ యజమానుల ఆందోళన
పాలకొల్లు, జూన్ 12 : ఉమ్మడి జిల్లాలో ఇసుక కష్టాలు మొదలయ్యాయి. జూన్ మూడో తేదీ తెల్లవారు జాము వరకు ఇసుక అక్రమ రవాణా జరగ్గా, ఎన్నికల ఫలితాలు వెలువడం మొదలైన వెనువెంటనే ఇసుక ఎగుమతులు నిలిపివేశారు. ఐదేళ్లపాటు ఇసుక అమ్మకాలను ఇష్టారాజ్యంగా చేసి, వేల కోట్ల రూపాయలు తాడేపల్లికి చేర్చిన ఇసకాసురులు ఈనెల నాలుగో తేదీ నాటికి దుకాణాలు సర్దేశారు. అనూహ్యరీతిలో కూటమికి ప్రజలు పట్టం కట్టడంతో జె–బ్రాండ్ మూకలు నిశ్శబ్దంగా ఇసుక ర్యాంపులు, స్టాక్ పాయింట్ల నుంచి దుకాణం సర్దేశారు.
నిలిచిన ఎగుమతులు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 20పైబడి ఇసుక ర్యాంపులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో నేరుగా గోదావరిలోకి లారీలు వెళ్లి ఇసుక ఎగుమతి చేసుకునే విధానం ఉండగా పలు ర్యాంపులలో పడవలలో ఒడ్డుకు తెచ్చిన ఇసుకను లారీల్లో ఎగుమతి చేస్తారు. జూన్ మూడో తేదీ తెల్లవారుజాము వరకూ జరిగిన ఎగుమతులు, ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా నిలిచాయి.
నూతన పాలసీ రూపొందించాలి..
2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగానే సరఫరా చేశారు. కేవలం రూ. 5, 6 వేలకు ట్రాన్స్‌పోర్టు ఖర్చుతో ఐదు యూనిట్ల ఇసుక వినియోగదారుడికి లభించేది. జగన్‌రెడ్డి పాలనలో ఐదు యూనిట్ల ఇసుక రూ. 20 వేలుకు చేరింది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇసుక తవ్వకాలపై పాలసీ రూపొందించాలని వినియోగదారులు కోరుతున్నారు.
కిరాయిలు లేక ఆందోళన..
వారం రోజులుగా ఇసుక ఎగుమతులు పూర్తిస్థాయిలో నిలిచిపోవడంతో టిప్పర్ లారీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. కిరాయిలు లేకుంటే లారీల యజమానులు ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు పడతామని పలువురు లారీ యజమానలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
వరదలు వస్తే ఇబ్బందులే..
సాధారణంగా ప్రతీ ఏటా గోదావరి నదికి జూన్ నెలాఖారు లేదా జూలై మొదటి వారంలోనో వరదలు వస్తుంటాయి. భారీ వర్షాలు కురిస్తే గోదావరి వరద నీటితో పొంగుతుంది. వరద వస్తే పోలవరం నుంచి నరసాపురం వరకు గోదావరిలో ఇసుక తవ్వకాలు నిలిచిపోతాయి. అదే జరిగితే నవంబరు వరకు ఇసుక కష్టాల సమస్య పరిష్కారం లభించదు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోజుల వ్యవధిలో ఇసుక పాలసీని ప్రకటిస్తే ఆ వెంటనే సంబంఽధిత శాఖ అనుమతులు లభించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఇసుక తవ్వకాలు మొదలవుతాయి.
ఇసుక కొల్ల గొట్టేశారు..
జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ర్యాంపులలో పరిమితికి మించి ఇసుక తవ్వేశారు. రెండు లేదా మూడు అడుగుల మేర మేట వేసిన ఇసుకను తవ్వాల్సి ఉండగా పలు ర్యాంపులలో 5, 6 అడుగుల లోతున ఇసుకను తవ్వేశారు. ఇసుక నాణ్యత తగ్గితే బొండు ఇసుక పేరుతో పల్లపు ప్రాంతాలు, లే ఔట్ల పూడికలకు తరలించేవారు. మొత్తంగా కొన్ని ర్యాంపులలో ఇసుక తవ్వకాలకు స్టాక్ పాయింట్లలో అనుమతి ఇవ్వాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తీపర్రు, చిడిపి, తదితర ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కాతేరు, లాలా చెరువు, రావులపాలెం, గన్నవరం వంటి ప్రాంతాల్లో ఇసుక నిల్వలు ఉన్నాయి. నూతన పాలసీ వచ్చేలోపు స్టాక్ పాయింట్లలోని ఇసుక ఎగుమతులకు అనుమతులు ఇవ్వాలని లారీ యజమానులు, వినియోగదారులు కోరుతున్నారు.
నూతన పాలసీకై ఎదురు చూస్తున్నాం
అసోసియేషన్ ద్వారా కూటమికి మద్దతును నేరుగా ప్రకటించాము. ఇచ్చిన మాట ప్రకారం కూటమి విజయానికి కృషి చేశాం. ఇప్పడు కొలువు దీరే ప్రభుత్వం వెంటనే ఉచిత ఇసుక పాలసీ రూపొందించి, అదేవిధంగా లారీ యజమానులకు నష్టం రాని విధంగా కిరాయిలు రూపొందించి నష్టాల్లో కూరుకుపోయిన టిప్పర్ లారీ యజమానులను ఆదుకోవాలి.
– రావూరి రాజా. పాలకొల్లు, ఉభయ గోదావ రి జిల్లా టిప్పర్ లారీ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు
Updated Date - Jun 12 , 2024 | 11:35 PM