ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఖతం
ABN, Publish Date - Jul 17 , 2024 | 12:40 AM
ఒకప్పుడు ప్రభుత్వ కార్పొరేషన్ ఏదైనా సందర్శకులతో కిటకిటలాడుతూ కనిపించేవి. సంబంధిత శాఖాధికారులు రోజంతా బిజీబిజీగా ఉండేవారు.
రుణాలు లేవు.. చేతినిండా పనిలేదు
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కార్పొరేషన్లు నేడు సర్వనాశనం
ఒకప్పుడు ప్రభుత్వ కార్పొరేషన్ ఏదైనా సందర్శకులతో కిటకిటలాడుతూ కనిపించేవి. సంబంధిత శాఖాధికారులు రోజంతా బిజీబిజీగా ఉండేవారు. సిఫార్సులు, ఒత్తిళ్లతో క్షణం తీరిక లేకుండా కార్యాలయాల్లో రద్దీ. పేద వర్గాలకు రుణ సదుపాయం, స్వయం ఉపాధికి వీలుగా చేయూత లభించేది. దరఖాస్తులను ఆహ్వానించి అర్హత కలిగిన వారికి రుణాలు, సబ్సిడీలు ఇచ్చేవారు. చిన్న యూనిట్ల నుంచి మొదలు ఇన్నోవా కార్లు వరకు క్లియరెన్స్ ఇచ్చేవారు. కలెక్టర్లు స్వయంగా బ్యాంకర్ల సమావేశంలో రుణ పరపతి లక్ష్యాలను నిర్దేశించేవారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా రుణాల మంజూరులో కచ్చితంగా వ్యవహరించేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సమీక్షించేవారు. 2014–19 వరకు టీడీపీ పాలనలో కార్పొరేషన్‌లో ఈ తరహా పనితీరు కనిపించేది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్లు అన్నింటిని ఖతం చేశారు.
– ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి
గడిచిన ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వ నిర్వీర్యం చేసిన వాటిలో కార్పొరేషన్లు ముందు వరుసలో ఉన్నాయి. ఒకప్పుడు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్‌లే కాకుండా ప్రభుత్వ ఊతంతో మరిన్ని రాణించిన దాఖలాలు ఉన్నాయి. కాని 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో కార్పొరేషన్లు వైసీపీ సర్కార్ చేతిలో విలవిల్లాడిపోయాయి. గతంలో తెలుగుదేశం హయాంలో ఇచ్చిన మాదిరిగా రుణసదుపాయం లేదు. బడ్జెట్‌లో తగినంత నిధుల సంపత్తి లేదు. ఏటా కార్పొరేషన్ల వారీగా చేయాల్సిన పనుల లక్ష్యం అంతకన్నా లేదు. రుణం కోసం, స్వయం ఉపాధి కోసం తరలివచ్చే ప్రజలెవ్వరూ మచ్చుకైనా కనిపించలేదు. అంతలా కార్పొరేషన్లు నీరుగారిపోయాయి. అంతకు ముందు బీసీ కార్పొరేషన్ ప్రామాణికంగా ఆదరణ పేరిట వివిధ కుల వృత్తులు అన్నింటికి రుణ సదుపాయం, వృత్తి పరికరాలు, సబ్సిడీపై అందించేవారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను ఎంపికచేసి వారికి కొంతలో కొంత జీవనో పాధికి వీలుగా బాటలు వేసేవారు. గ్రామస్థాయిలో కాస్తంత వెనుకబడిన కుటుంబా లను కాస్తోకూస్తో పైకితెచ్చే ప్రయత్నం అప్పట్లో జరిగింది. అధికారులతో పాటు రాజకీయాల్లో ఉన్నవారంతా వాటికి ఊతమిచ్చేవారు.
బీసీ కార్పొరేషన్‌కు ఆదరణ లేదు
బీసీ వర్గాల్లో ఆదరణ పథకానికి ఒక దశలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అప్పట్లో ప్రభుత్వం లక్ష్యాలను అందుకోవడానికి అధికారులు శ్రమించాల్సి వచ్చేది. బీసీ కార్పొరేషన్, తెలుగుదేశం హయాంలో ఓ వెలుగు వెలగ్గా ఐదేళ్ల జగన్ సర్కార్‌లో సర్వనాశనమైంది. బీసీ వర్గాలకు పైపైకి హామీలు, లోలోన రిక్తహస్తం చూపారు. ఓట్ల కోసమే కథ నడుపుతూనే.. నా బీసీలు అంటూ ప్రసంగాల్లో ఊదరగొట్టేవారు. కాని వాస్తవానికి బీసీ కార్పొరేషన్ ఈ ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా పతనమైంది. కార్పొరేషన్ ఉనికినే కోల్పోయే స్థాయికి వచ్చింది. బీసీ కార్పొరేషన్ పరిధిలో ఉద్యోగు లకు జీతభత్యాలు ఇవ్వడం తప్ప, మరే లక్ష్యాన్ని ప్రభుత్వపరంగా నిర్దేశించలేక పోయారు. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్‌కు ఏకంగా నాలుగువేల కోట్లకు పైబడి బడ్జెట్ కేటాయింపులు ఉండేవి. గడిచిన ఐదేళ్లల్లో నయాపైసా బడ్జెట్ పద్దులో కనిపించనే లేదు.
ఎస్సీ కార్పొరేషన్ పథకాలు శూన్యం
ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో 2014–19 మధ్య ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేసింది. ఎస్సీ వర్గాలకు తగినంత రుణ పరపతి కల్పించే దిశగా బ్యాంకర్లను ఒత్తిడిచేసి అయినా లక్ష్యాలను చేరుకునే దిశగా అధికారులను పరుగులు పెట్టించారు. అప్పట్లో కార్పొరేషన్ చైర్మన్‌గా ఎవరుంటే వారే తమ పరిధిలో లక్ష్యాలను పూర్తి చేయడానికి ఉరకలు వేసేవారు. తెలుగుదేశం ప్రభు త్వం అధికారంలో ఉండగా, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో మరింతగా ఎస్సీ కార్పొరేష న్‌కు ఊతమిచ్చింది. చేతివృత్తి చేసుకునే వారికి కొంతలో కొంత రోజువారి ఉపాధి దక్కేలా ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరత్రా పరికరాలను అందించడానికి ప్రయత్నించింది. ఈ దశలోనే మారుతున్న కాలంతో పాటు యువత అవసరాలను గుర్తించి ఉపాధికి శాశ్వత స్థానం ఇచ్చేందుకు వీలుగా సబ్సిడీపై ఇన్నోవా కార్లను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. అప్పట్లో ఎన్నికల కాలం కాబట్టి మరింతగా ఈ రంగానికి ప్రాణం పోసేందుకు సిద్ధ పడింది. ఇదే క్రమంలో ఇన్నోవా కార్లు సాధారణ ఎస్సీలకు అందలేదు. కేవలం కొంతమంది పలుకుబడితోనే స్వాధీన పరుచుకోగలిగారు. అప్పట్లో అధికార యంత్రాంగం ఈ వ్యవహారంలో, రుణాలు పంపిణీలో ఇష్టానుసారం వ్యవహరించినా గాడి తప్పకుండా అప్పటి ప్రభుత్వం జాగ్రత్త పడింది.
మైనారిటీ, కాపులకు మొండిచేయి
మైనార్టీ సంక్షేమంలో కూడా ఇదే ధోరణి. అప్పట్లో మైనార్టీల కోసం ఎడాపెడా పథకాలు పెట్టి వారికోసం రుణాలను బారీగా మంజూరయ్యేలా ప్రయత్నించింది. కాపు కార్పొరేషన్ ద్వారా కాపువర్గాలు అన్నింటికి మేలు చేసే ప్రక్రియ మాత్రం శరవేగంగా సాగింది. బీసీలతో పాటు కాపులకు సమంగా ప్రాధాన్యత ఇచ్చి కొత్త పుంతలు తొక్కేదిశగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అడుగులు కదిపింది. కాపు యువతకు, మహిళలకు ఇచ్చే ప్రత్యేక రుణసదుపాయ కల్పనకు ప్రయత్నించింది. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.152 కోట్లు ఒక్క ఏడాదిలోనే రుణంగా అందించగలిగారు. సమాంతరంగా ఎస్టీలకు ఇదే తరహాలో కొంతలో కొంత ఆదుకునే ప్రయత్నం జరిగింది. ఐదేళ్లలో ఆయా కార్పొరేషన్లు ఉనికి కోల్పోయాయి.
వైసీపీ పాలనలో అంతా అథపాతాళంలోకి..
2014–19 మధ్య తెలుగుదేశం హయాంలో కార్పొరేషన్లు అన్నింటికి జీవం పోసేందు కు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించగా, 2019–24 మధ్య వైసీపీ ప్రభుత్వం అసలు కార్పొరేషన్లు అన్నింటిని పాతాళంలోకి నెట్టింది. ఎక్కడికక్కడ కార్పొరేషన్ ప్రమేయం లేదన్నట్లు పప్పుబెల్లాలకు సిద్ధపడింది. వ్యవస్థను అంతటిని వలంటీర్ చేతిలో పెట్టింది. బీసీ కార్పొరేషన్‌కు తెలుగుదేశం హయాంలో ఐదేళ్ల పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలకోట్లు బడ్జెట్‌లో కేటాయించగా వైసీపీ హయాంలో గడిచిన ఐదేళ్లలో అంతా సున్నా. ప్రభుత్వపరంగా బటన్ నొక్కుడే తప్ప వ్యక్తిగతంగా ఊతమిచ్చేందుకు, బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం అందించేందుకు ఎలాంటి చర్యలు లేవు. కేవలం ఆటోడ్రైవర్ల దగ్గర నుంచి వివిధ ప్రార్థనా మందిరాల్లో పనిచేసే వారికి కూడా బటన్ నొక్కుడు ద్వారా నగదు అందించారు. తిరిగి చెల్లింపులు లేని విధానంలో ఈ వ్యవహారం అంతా సాగింది. దీంతో లబ్దిదారులకు బాధ్యత లేకుండా పోయింది. కేవలం ప్రభుత్వం సొమ్ములు పంపిణీ చేస్తుంది కాబట్టి నేరుగా ఏ కార్పొరేషన్‌కు వెళ్ళాల్సిన అవసరం ఎవరికి లేకుండా పోయింది. దీంతో ఐదేళ్ల పాటు అన్ని కార్పొరేషన్లు దిగజారిపోయాయి. పనిపాట లేకుండా మూలనపడ్డాయి. ఒకప్పుడు కళకళలాడిన కార్పొరేషన్లు ఐదేళ్లలో కనీసం సమీక్షలకు కూడా నోచుకోలేదు. వార్షిక బడ్జెట్‌లో వీటి ప్రస్తావనే లేదు. ఇలా ఒకటేంటి జగన్ హయాంలో వ్యవస్థలు అన్ని ఏ రూపంలో దెబ్బతిన్నాయో కార్పొరేషన్‌లే ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పటికి కూడా కార్పొరేషన్‌లో మళ్ళీ పనితీరు మెరుగుపరుస్తారా? లేదా? అన్నది మాత్రం ఇప్పటికి సందిగ్ధమే. ఎందుకంటే ఆర్థికంగా భారీ లోటు చవిచూస్తున్న కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లు అన్నింటికి తగినంత పని కల్పించటమే కాకుండా వీటి ద్వారా కనీసం కొంతలో కొంత అయినా నిలదొక్కుకునేలా చేస్తాయా? చేయవా? అనేది సందిగ్ధమే. జగన్ ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు తనానికి కార్పొరేషన్లు అన్ని దాదాపు బలి అయ్యాయి. ఆఖరికి రాజకీయ ఉపాధిగా మరికొన్ని రాడ్డుతేలాయి. కాపు కార్పొరేషన్ ద్వారా కేవలం కొంతమందికి మాత్రమే రుణసదుపాయం కల్పించి చేతులు దులుపుకున్నారు. ఇంతకు మించి జరిగింది ఏమీ లేదు.
Updated Date - Jul 17 , 2024 | 12:40 AM