చిక్కుకుంటే చిక్కులే..
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:52 AM
సోషల్ మీడియా లో ఇష్టానుసారం పోస్టులు పెడితే జీవితాంతం కేసులు వెంటాడతాయి.
పాత పోస్టులను తవ్వితీస్తూ.. కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
కొత్త చట్టాలతో మరింత కఠిన శిక్షలు
రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దంటున్న పోలీసులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నాయకురాలు, ప్రస్తుత హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై అసభ్య పదజాలంతో ట్రోల్ చేసిన ఉమ్మడి గుంటూరు జిల్లా నకిరేకల్‌కు చెందిన పావులూరి రాజశేఖర్‌రెడ్డిపై నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేశారు.
అత్తిలి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):సోషల్ మీడియా లో ఇష్టానుసారం పోస్టులు పెడితే జీవితాంతం కేసులు వెంటాడతాయి. రాజకీయ పార్టీల నాయకుల మెప్పు కోసమో, వారిపై అభిమానంతోనే.. మరేదైనా కారణం తోనో ఇష్టానుసారం పోస్టులు పెడితే తమతోపాటు కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లోకి నెట్టినట్టే. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ సానుభూతిపరులు, మరికొందరు ఉన్మాదుల్లా వ్యవహరించి కేవలం కొన్ని కుటుంబాలను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లల్లోని మహిళల ను కించపరిచే విధంగా పోస్టులు పెట్టారు. వీటిని ప్రశ్నించిన, కౌంటర్ పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, సానుభూతిపరులను వెంటాడి అరెస్టు చేశారు. వైసీపీ నాయకులు అసభ్యకర పోస్టులు పెట్టినా, విమర్శలు గుప్పించినా వారిని అరెస్టు చేయ లేదు. వైసీపీ ఘోర పరాజయం పాలై, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇప్పటికి ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా బృందాలు తీరు మార్చుకోలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్, పీసీసీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిలతో పాటు రాజకీయాల్లో లేని వారిపైన, మీడియా ప్రతినిధులపై అసభ్యకర పోస్టులు పెడుతూ వచ్చారు. సభ్య సమాజం సిగ్గు పడేలా సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి పోస్టులపై జిల్లాస్థాయి పోలీసు విభాగం సైబర్ క్రైం టీమ్ సునిశితంగా పరిశీలిస్తోంది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో వీటిపై ఫిర్యా దులు అందుతున్నాయి. ఇప్పటి వరకూ 15కి పైగా కేసులు నమోదయ్యాయి.
ఇలా చేయడం నేరం
ఉద్దేశ పూర్వకంగా గాని, దురుద్దేశంతో గాని వ్యక్తిత్వ హననానికి పాల్పడే సమాచారాన్ని ప్రజలకు చేరవేయకూడదు. అసత్యాలు ప్రచారం చేయకూడదు.
ఎదుటి వ్యక్తులు కుటుంబాలను ఉద్దేశించి దూషిస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టరాదు. వీటికి లైక్‌లు కొట్టడం ఇతరులకు ఫార్వర్డ్ చేయడం నేరం.
ప్రజల మధ్య, కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చే పోస్టులు చేస్తే జైలుకు వెళ్లక తప్పదు.
చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారిపై కేసులు నమోదైతే పోలీసులు ఎన్‌ఓసీ ఇవ్వరు. ఇది లేకపోతే ఉద్యోగాలు రావు.
ఒకసారి కేసు నమోదైతే ఆ వ్యక్తిపై నిరంతర నిఘా ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులకు ఇబ్బందే. తప్పు చేసిన పిల్లలు దొరక్కపోతే తల్లిదండ్రులు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిందే.
కొత్త చట్టాలు ఏం చెబుతున్నాయి ?
భారతీయ న్యాయ సంహిత (బీఎస్‌ఎన్‌ఏసీ) ఐటీ సైబర్ నేరాల చట్టాలు ఉన్నాయి. ఫేస్ మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలు వైరల్ చేయడం ద్వారా ఇతరుల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారు.
ప్రముఖ వ్యక్తుల పేరుతో పోస్టులు పెడితే 66 డీఐటీ యాక్ట్ నమోదు చేసి మూడేళ్ల జైలు, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
జుగుప్సాకరంగా ఉన్న చిత్రాలు వీడియో ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేస్తే ఎలక్ర్టానిక్ ఎవిడెన్స్‌గా పరిగణించి బీఎన్‌ఎస్ చట్టంలో 353(2) సెక్షన్ కింద కేసు నమోదవుతుంది.
అసభ్యకర పోస్టులు రూపొందించి అప్‌లోడ్ చేస్తే 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఒక వ్యక్తి పరువుకు భంగం కలిగిస్తే బిఎస్‌ఎన్ చట్టంలోని 336(4) సెక్షన్ కింద కేసు.
సమాజంలో సంఘాలు, సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే 356 (2) సెక్షన్‌తో పాటు పరువునష్టం కేసులు కడతారు.
ఏలూరు జిల్లాలో 11 సోషల్ మీడియా కేసులు.. ఆరుగురి అరెస్ట్
ఏలూరు క్రైం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి):సోషల్ మీడియాల్లో ఇతర వ్యక్తులను అవమాన పరుస్తూ, అవహేళన చేస్తూ వారి గౌరవానికి భంగం కల్గించేలాగ మానసిక వేదనకు గురిచేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. జిల్లాలో 11 కేసులు నమోదు చేయగా వీటిలో నిందితులుగా ఉన్న వారందరూ వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులే. ఇప్పటికే ఆరు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. వేలేరుపాడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ధర్మాజీగూడెం, ఏలూరు వన్‌టౌన్, నూజివీడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. వేలేరుపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన కేసులో వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను అరెస్టు చేశారు. జిల్లాలో మరి కొన్నికేసుల్లో కూడా అతన్ని అరెస్టు చూపించాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన వారిని అరెస్టు చేయడానికి పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాను ఆసరా చేసుకుని వివిధ పార్టీలను, నాయకులను, వ్యక్తులను అవమాన పరిచినా వారి గౌరవానికి భంగం కల్గించినా సహించేది లేదంటూ ఇప్పటికే పోలీస్ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
Updated Date - Nov 14 , 2024 | 12:52 AM