మండుతున్న ఎండలు
ABN, Publish Date - Apr 06 , 2024 | 11:55 PM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భానుడి ప్రతాపంతో జనం విలవిల్లాడుతున్నారు.
ఉక్కపోత..వడగాడ్పులతో ప్రజలు విలవిల
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భానుడి ప్రతాపంతో జనం విలవిల్లాడుతున్నారు. ఉక్కపోత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
– ఏలూరుసిటీ/ఆచంట/చింతలపూడి
గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. మేలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదు కావడం విశేషంగా పేర్కొనవచ్చు. శుక్రవారం జిల్లాలలోనే అత్యఽధికంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, భీమడోలు, కొవ్వూరు, నిడదవోలు, తదితర ప్రాంతాల్లో 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం కూడా 41 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులుగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడిగాలులు ప్రభావంతో ప్రజలు రహదారులపైన ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, బయటకు వెళ్లే సమయంలో ఎండ తీవ్రతను తట్టుకోవఢానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల వారు ఇప్పటికే మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలను చాలా ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. వేసవి ఎండలు తగ్టేవరకు కరెంటుకోతలు విధించవద్దని మంచినీరు సమస్య రాకుండా చూడాలని గ్రామాల్లో స్థానికులు కోరుతున్నారు.
ఎన్నికల వేళ ఎండల గోల
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎండల తీవ్రత పెరగటంతో రాజకీయ పార్టీల నాయకులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించటానికి అవస్థలు పడుతున్నారు. పగటి పూట ఎన్నికల ప్రచారాలు రద్దు చేసుకుని సాయంత్రం వేళల్లోనే ప్రచారాలను నిర్వహిస్తున్నారు.
లో–వోల్టేజి సమస్య పరిష్కరించండి
జీలుగుమిల్లి, ఏప్రిల్ 6 : లో–ఓల్టేజి సమస్య పరిష్కరించాలని జీలుగుమిల్లి గ్రామ మహిళలు విద్యుత్‌శాఖ అధికారి జేఈ హరిబాబును శనివారం కోరారు. కొన్ని నెలలుగా జీలుగుమిల్లిలో లోఓల్టేజి సమస్య ఉందన్నారు. ఇటీవల ఫ్రిజ్‌లు, టీవీలు ఫ్యాన్‌లు, మిక్సీలు, వాషింగ్ మిషన్‌లు రోజుకో ఇంటిలో కాలిపోతున్నాయన్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
ఏలూరుసిటీ, ఏప్రిల్ 6: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. భానుడి భగభగలతో రోజువారీ విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోందని విద్యుత్ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత ఏప్రిల్ మొదటి వారంలోనే తారస్థాయికి చేరిందని, వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని, దీంతో ఎండ వేడిమిని తట్టుకోలేక ఏసీలు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్ల వినియోగం, కూలింగ్ వాటర్ కోసం ఫ్రిజ్‌లు వినియోగం పెరిగిందని చెబుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ కోటా వస్తోందని, అయినా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోత అమలులోనే ఉందని తెలుస్తోంది. బోర్ల కింద సాగులో వ్యవసాయ విద్యుత్ సరఫరాలో రైతులు ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు విద్యుత్ వినియోగం పరిశీలిస్తే ఈనెల 2,3,4 తేదీల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని ఏపీఈపీడీసీఎల్ వారి నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితులను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Updated Date - Apr 06 , 2024 | 11:55 PM