వర్షాలు తగ్గుముఖం
ABN, Publish Date - Dec 04 , 2024 | 12:01 AM
తుఫాన్ కారణంగా మూడు రోజులుగా రైతులకు కంటిపై కునుకు లేకుండా కురిసిన వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా సార్వా మాసూళ్లు ముగిశాయి.
ఊపిరి పీల్చుకున్న రైతులు
సార్వా మాసూళ్లలో నిమగ్నమైన రైతులు
పెంటపాడు/ఆచంట, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : తుఫాన్ కారణంగా మూడు రోజులుగా రైతులకు కంటిపై కునుకు లేకుండా కురిసిన వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా సార్వా మాసూళ్లు ముగిశాయి. మెట్ట ప్రాంతాల్లో దాళ్శా నారుమడులకు రైతులు సంసిద్ధమవుతున్నారు. తుఫాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు వరికోతలు మూడు రోజులు నిలిపివేయాలని అధికారులు సూచనలు చేశారు. అయినప్పటికి అప్పటికే కోసిన ధాన్యం కల్లాలపై ఉండిపోవడంతో రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మంగళవారం ఎండకాయడంతో వర్షం కారణంగా తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకుని ఒబ్బిడి చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షంతో పాటు గాలులు కూడా విపరీతంగా వేయడం వల్ల కొన్ని ప్రాంతాల్లో వరిచేలు నేలకు ఒరిగాయి. పడిపోయిన చేలను మిషన్ ద్వారా కోసేందుకు అదనపు ఖర్చును భరించి మాసూళ్ళు పూర్తి చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆచంట మండలంలో పలువురు రైతులు తడిచిన ధాన్యాన్ని ఎండబెట్టుకున్నారు. మరోవైపు మేఘాలు కమ్ముకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు సూచనలతో మాసూళ్ల పనుల్లో నిమగ్నమయ్యారు.
Updated Date - Dec 04 , 2024 | 12:01 AM