వేద విద్యను పరిరక్షించాలి
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:50 AM
వేద విద్యని పరిరక్షించకపోతే అది భావితరాలకు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం
ఆగిరిపల్లి, సెప్టెంబరు 15: వేద విద్యని పరిరక్షించకపోతే అది భావితరాలకు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం ఆగిరిపల్లిలో శోభనాచల లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల 116 వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన సభికులను ఉద్ధేశించి మాట్లాడుతూ పాత తరాల వారు ముందు చూపుతో నేర్పిన వేద విద్య వల్ల ఇప్పుడు ఇంతమంది వేద పండితులు ఉన్నారని, ఆధునిక శాస్త్ర విద్యలో ఫలితాలు అంతగా ఉండటం లేదని, ఇప్పుడున్న శాస్త్రవేత్తలందరికీ సంస్కృతం రాదని, వచ్చి ఉంటే భారత్ ఎప్పుడో అగ్రరాజ్యంగా అవతరించేదని, వేదం చదివే పండితులకు ఆధునిక శాస్త్రం తెలియటం లేదని ఈ రెండు కలిసి ఉంటే దేశరక్షణ పరిస్థితులు మెరుగవవచ్చని తెలిపారు. ఇప్పటి జనరేషన్ వేదం అంటే పెళ్ళి సమయంలో ఉపయోగపడే మంత్రాలు అనుకుంటున్నారని కొన్ని వాఞ్మయాల్లో రాడార్లు కూడా పసిగట్టలేని అదృశ్య పరిజ్ఞానం ఉందని వేదశక్తితో పాటు లౌకిక విద్య కూడా కలిపి అభ్యసించాలని కోరారు. దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ ఆగిరిపల్లిలో వేద పాఠశాల స్థాపించిన మార్కండేయ శర్మ కృషి వల్ల ఈ పాఠశాల ఇంత గొప్పగా నడుస్తోందని భారతదేశం వేద భూమి అయినందున వేదాలను సంర క్షించుకోవాలని, ఆధునిక విద్యతో వేద విద్య మిళితం చేయాలన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు చెప్పినట్లు ఆలయాలు, ఇతర ప్రదేశాల్లో వేదాశీర్వాదం ఇచ్చేటప్పుడు ప్రజలకు అర్థమయ్యేలా తాత్పర్యం బోధించాలని, ఇవి అర్థమైతే ప్రజలు పరమతాల వైపు మరలరన్నారు. ఆదాయ పన్ను శాఖ మాజీ డైరెక్టర్ పేర్వాల రఘు, ద్వారకా తిరుమల మాజీ ఈఓ విష్ణు ప్రసాద్, చిర్రావూరి శ్రీరామ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 16 , 2024 | 12:50 AM