ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీఆర్‌ బాండ్లపై విజిలెన్స్‌ పంజా

ABN, Publish Date - Dec 04 , 2024 | 12:03 AM

తాడేపల్లిగూడెంలో మంజూరైన టీడీఆర్‌ బాండ్‌లపై విజిలెన్స్‌ పంజా విసిరింది. మునిసిపాలిటీలో తనిఖీలు నిర్వహించింది.

తాడేపల్లిగూడెంలో రికార్డులు స్వాధీనం

మునిసిపాలిటీలో కలకలం

వైసీపీ హయాంలో దందా

రూ.150 కోట్లు విలువైన బాండ్‌ల జారీ

స్థల యజమానులకు కుచ్చుటోపీ

అధికారుల బలి

భీమవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెంలో మంజూరైన టీడీఆర్‌ బాండ్‌లపై విజిలెన్స్‌ పంజా విసిరింది. మునిసిపాలిటీలో తనిఖీలు నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా మంజూరు చేసిన బాండ్‌ల వివరాలను సేకరించింది. విజిలెన్స్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఇదివరకే మునిసిపల్‌ పరిపాలన శాఖ వివరాలను రాబట్టింది. మునిసిపాలిటీ వివరాలను సమర్పించింది. ప్రస్తుతం విజిలెన్స్‌ బృందం దృష్టి సారించింది. మున్ముందు సీబీసీఐడీ కూడా రంగ ప్రవేశం చేసే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీఆర్‌ బాండ్‌లపై దృష్టిపెట్టారు. తాడేపల్లిగూడెం కూటమి నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ వైసీపీ ప్రభుత్వంపై, స్థానిక వైసీపీ నేత దందాపైనా కూటమి నేతలు అస్ర్తాలు సంధించారు. అధికారులను నిలదీశారు. అయినా బాండ్‌ల జారీ ఆగలేదు. ఎన్నికల ముందు వైసీపీ నేత సొంత స్థలానికి రూ.15 కోట్లు విలువైన బాండ్‌లు జారీచేసేలా ప్రయత్నాలు చేస్తే తెలుగుదేశం నేత అడ్డుతగిలారు. మునిసిపల్‌ ప్రత్యేక అధికారికి విషయాన్ని చేర్చారు. దాంతో సదరు బాండ్‌ల జారీ నిలిచిపోయింది. అప్పటికే ఇతర ప్రాంతాల్లో స్థల యజమానులకు సంబంధించి అక్రమంగా బాండ్‌లు జారీఅయ్యాయి. వీటిపై తాజాగా విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాండ్‌లు ఎలా జారీచేశారు. అంత అవసరం ఏమిటి? ఏ ప్రాంతంలో ఇచ్చారు? నిబంధనలు పాటించారా అంటూ మునిసిపల్‌ అధికారుల నుంచి వివరాలను సేకరించారు. గతంలో మంజూరు చేసిన బాండ్‌లపై మునిసిపాలిటీ పూర్తి వివరాలను సమర్పించింది.

పక్కా ప్లాన్‌

తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో వైసీపీ హయాంలో దాదాపు రూ. 150 కోట్లు విలువ చేసే బాండ్‌లను మంజూరు చేశారు. వైసీపీ నేత అండదండలున్నాయన్న ఉద్దేశంతో అధికారులు నాడు బరితెగించారు. వైసీపీ నేతకు సాగిలబడ్డారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉన్నతాధికారులు సహకరించారు. మునిసిపల్‌ శాఖలో కీలకంగా వ్యవహరించిన మహిళా ఉన్నతాధికారికి కూడా ముడుపులు అందాయి. దాంతో తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో అక్రమంగా బాండ్‌లు జారీఅయ్యాయి. భవన నిర్మాణంలో విడచిపెట్టిన సెట్‌బ్యాక్‌లకు కూడా బాండ్‌లు ఇచ్చేసిన ఘనతను అధికారులు మూటగట్టుకున్నారు. స్థల యజమానులకు తెలియకుండానే బాండ్‌లు జారీ అయిపోయాయి. బిల్డర్లు వాటిని విక్రయించుకున్నారు. వైసీపీ నేతకు పెద్దమొత్తంలో ముడుపులు అందించారు. భీమవరం పట్టణానికి చెందిన ఓ దళారి మధ్యవర్తిగా ఉండి బాండ్‌లు ఇప్పించడంలో కీలక ప్రాత పోషించారు. ఆయనకు వైసీపీ నేత రూ.2.50 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆ మొత్తాన్ని వైసీపీ నేత ఎగనామం పెట్టారు. ఇద్దరి మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి. బాండ్‌ల జారీ తతంగమంతా బయటకు వెల్లడైంది. మరోవైపు బాధితులు సైతం కూటమి నేతలను ఆశ్రయించారు. వీటన్నింటినీ క్రోడీకరించి కూటమి నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అక్రమ టీడీఆర్‌ బాండ్‌లపై ప్రభుత్వం విచారణ చేపడుతోంది.

విస్తరణ పేరుతో బాండ్ల జారీ

తాడేపల్లిగూడెం–భీమవరం రహదారికి ఆనుకుని ఉన్న షాపులకు టీడీఆర్‌ బాండ్‌లు ఇచ్చిన ఘనతను మునిసి పాలిటీ దక్కించుకుంది. ప్రస్తుతం 80 అడుగుల విస్తీర్ణంలో రహదారి ఉంది. మాస్టర్‌ ప్లాన్‌లో 100 అడుగుల రహదారి ఉండడంతో విస్తరణ పేరుతో బాండ్‌లు జారీచేశారు. వాస్తవానికి అక్కడ ర హదారి విస్తరణ జరిగే అవకాశం లేదు. అయినా సరే కొందరు ఉద్దేశపూర్వకంగా మునిసిపాలిటికి స్థలాలను రాసి ఇచ్చేశారు. అందుకు నాలుగు రెట్లు విలువైన బాండ్‌లు తీసుకున్నారు. ఇప్పటికీ ఆ స్థలంలో షాపులు న్నాయి. మునిసిపాలిటీ స్థలాలను స్వాధీనం చేసుకోలేదు. చేసుకున్నాసరే రహదారి విస్తరణకు అవకాశం లేదు. ఇదిలా ఉంటే తాడేపల్లిగూడెం–భీమవరం రహదారికి ఆనుకుని ఉన్న 2000 చదరపు గజాల స్థలంలో భవన నిర్మాణానికి స్థల యజమానులతో ఒప్పందం చేసుకున్న బిల్డర్‌ తన పేరుతో టీడీఆర్‌ బాండ్‌లు పొందారు. మునిసిపాలిటీకి దాదాపు 800 గజాల స్థలాన్ని ఇచ్చారు. నిబంధనల ప్రకారం నాలుగు రెట్లు అంటే 3200 గజాల బాండ్‌లను తీసుకున్నారు. మార్కెట్‌లో బాండ్‌లు విక్రయించుకున్నారు. కోట్ల రూపాయల లబ్ధిపొం దారు. వైసీపీ నేతకు అందులో ముడుపులు చెల్లించారు. స్థల యజమానులకు మాత్రం ఒక్కపైసా ముట్ట చెప్పలేదు. అదే స్థలంలో నిర్మించే అపార్ట్‌మెంట్‌కు అదనపు నిర్మాణాలు చేప ట్టేలా టీడీఆర్‌ బాండ్‌లను వినియోగించుకుంటామని నమ్మ బలికారు. ఇప్పటికీ భవన నిర్మాణం జరగడం లేదు. బాండ్‌ లను విక్రయించి స్థల యజమానులకు మోసం చేశారు. ఇవన్నీ ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి. బాండ్‌లు జారీచేసిన గత అధికారుల్లో వణుకుపుడుతోంది. వైసీపీ నేత తమను నిట్ట నిలువునా ముంచేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ నేత కోట్లు సంపాంధించారు. అంట కాగిన అధికారులు బలికానున్నారు.

Updated Date - Dec 04 , 2024 | 12:03 AM